'రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర '
హైదరాబాద్: రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీతోపాటు కేంద్రప్రభుత్వం అందజేసిన మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు 25 శాతమే లబ్ది చేకూరుతుందని తెలిపారు.
రైతుల నుంచి తీసుకున్న భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భూములతో చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటోందని ఆయన విమర్శించారు. ఇది మంచి సంప్రదాయం కాదని మైసూరారెడ్డి... చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. అలాగే రాజధాని పేరుతో విచ్చలవిడిగా ప్రజల డబ్బును ఖర్చు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో మరోసారి పునారాలోచన చేయాలని మైసూరా ఈ సందర్భంగా చంద్రబాబుకు హితవు పలికారు.