‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు! | World Bank officials informed the state government about funding | Sakshi
Sakshi News home page

‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!

Published Sun, Jul 21 2019 3:09 AM | Last Updated on Sun, Jul 21 2019 2:59 PM

World Bank officials informed the state government about funding - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్‌ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రుణం రాకముందే రోడ్ల టెండర్లా?
అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడానికి చంద్రబాబు సర్కారు వైఫల్యాలతోపాటు బ్యాంకు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణాలు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకముందే గత సర్కారు రహదారుల పనులకు టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఖరారు కూడా చేసింది. అనంతరం టెండర్ల వివరాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇందులో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని సీఆర్‌డీఏను కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సేకరించి ఇతర అవసరాలకు వినియోగించడం, రైతు కూలీలు జీవనోపాధి కోల్పోవడం, పర్యావరణ విపత్తులు, రాజధానిలో కృష్ణా నది వరదల ప్రభావం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించడంతో పాటు విచారణ జరిపించింది. చంద్రబాబు సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గుర్తించిన ప్రపంచ బ్యాంకు తనిఖీల కోసం బృందాన్ని అమరావతికి పంపింది. రుణం మంజూరు కూడా కాకముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి ప్రాజెక్టుపై విచారణ చేయడం పట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విస్మయం వ్యక్తం చేసింది. 

తనిఖీల తరువాతే బ్యాంకు నిర్ణయం..
– రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణం కోరుతూ 2016 అక్టోబరు 8న చంద్రబాబు సర్కారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి ప్రతిపాదనలు పంపింది. 2017 జూన్‌ 12న ఈ ప్రతిపాదన రిజిస్టర్‌ అయింది.
– మొత్తం ప్రాజెక్టు విలువ 715 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కాగా దీని విలువ మన రూపాయల్లో ఇంచుమించు రూ.5 వేల కోట్లు.
– ఇందులో వరల్డ్‌ బ్యాంకు వాటా రూ.2100 కోట్లు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు వాటా రూ.1,400 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాటా రూ.1500 కోట్లు.
– ప్రపంచ బ్యాంకు నుంచి రుణం మంజూరు కాకముందే 2017–2018లో రాజధానిలో రహదారి నిర్మాణ పనులను హడావుడిగా కాంట్రాక్టర్లకు అప్పగించేశారు.
– 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, ముంపు నివారణకు కాలువలు, రిజర్వాయర్‌ పేరిట రూ. 947 కోట్ల విలువైన పనులు అప్పగించారు.
– టీడీపీ ప్రభుత్వం అప్పగించిన వాటిల్లో 7 పనులు రెట్రోయాక్టివ్‌ ఫైనాన్సింగ్‌ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు అభ్యంతరం తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు దీన్ని పట్టించుకోకుండా చాలా పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది.
– రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో గత సర్కారు బాధితులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలున్నారు. 
– దీనిపై వాస్తవాలను నిర్థారించుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఏఎం, ఇండిపెండెంట్‌ అకౌంటబులిటీ మెకానిజం 2017 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించింది. అమరావతి ప్రాజెక్టు డిజైన్, పర్యావరణం, రాజధానిలో నివసిస్తున్న బడుగు, బలహీనవర్గాల స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై పరిశీలన, తనిఖీలు జరిపింది. తొలుత 2017 సెప్టెంబరు 27న నివేదిక ఇవ్వగా అనంతరం అదే ఏడాది నవంబర్‌ 27న సవరించింది. ఆ తరువాత 2018 జూన్‌ 26న మరోసారి సవరించగా చివరగా ఈ ఏడాది మార్చి 29న నివేదికను ఖరారు చేసింది.
– ప్రపంచబ్యాంకుకు చెందిన ఐదు విభిన్న బృందాలు తమకు అందిన ఫిర్యాదులపై  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భారీగా సమాచారాన్ని సేకరించాయి. ఇందులో ఇద్దరు ప్రతినిధులు చాలా ఘాటుగా ప్రపంచబ్యాంకుకు నివేదిక ఇచ్చారు. రాజధాని రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని, కౌలు రైతులను పట్టించుకోలేదని, నిరుద్యోగాన్ని సృష్టించారని, వ్యవసాయం దెబ్బతిందని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సృష్టించారని, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, తనిఖీ బృందాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై సరైన వివరణలు కూడా ఇవ్వలేదు. దీంతో పూర్తిస్థాయి బృందంతో విచారణ చేయాలని తనిఖీ బృందం ప్రపంచబ్యాంకుకు సిఫార్సు చేసింది. ప్రాజెక్టు మంజూరు కాకముందే ఇలాంటి విచారణకు ఆదేశించడం గతంలో దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement