World Bank funding
-
డబ్బులు తెద్దాం.. బస్సులు కొందాం
సాక్షి, హైదరాబాద్: కొత్త బస్సులకు నిధుల్లేక దిక్కులు చూస్తున్న ఆర్టీసీ.. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. రోడ్లను మెరుగుపర్చడం, పర్యావరణహిత వాహనాలు, బస్సులు సమకూర్చుకోవటానికి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం అందిస్తుండటంతో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు 800 కొత్త బస్సులు కొనాలని, ఇందుకు రూ. 270 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తూ ప్రతిపాదన రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్టీసీకి కేటాయించిన బడ్జెట్లో ఇంకా రూ.500 కోట్లకు పూచీకత్తు ఇచ్చే వీలుంది. దాన్ని కలుపుకొంటూ వరల్డ్ బ్యాంకుకు పూచీ ఇస్తే ఆ నిధులు చేతికందుతాయని భావిస్తోంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. సిటీకి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరంలో తిప్పేందుకు కొత్తగా 320 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కేంద్ర పథకం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్) లో భాగంగా వీటిని సమకూర్చుకోనుంది. ఈ పథకం రెండో విడతలో రాష్ట్రానికి 324 బస్సులు మంజూరయ్యాయి. అప్పట్లో ఏసీ బస్సులు తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు తీసుకున్న ఏసీ బస్సులు తెల్ల ఏనుగుల్లా మారి తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతుండటంతో ఆ మంజూరును వద్దనుకుంది. ఇప్పుడు అదే కేటాయింపులో భాగంగా ఏసీ బస్సులకు బదులు నాన్ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రపంచ బ్యాంకు నిధుల ప్రతిపాదన అలాగే ఉంచి అదనంగా అద్దె బస్సులు తీసుకోవాలా, లేక ప్రతిపాదన సంఖ్య తగ్గించి అద్దెవాటితో సర్దుబాటు చేయాలా అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్తగా కొనే బస్సులివే.. గరుడ ప్లస్ – 30, రాజధాని – 25, సూపర్ లగ్జరీ – 270, డీలక్స్ – 190, ఎక్స్‌ప్రెస్ – 30, సిటీబస్సులు – 210, పల్లెవెలుగు – 15 -
విద్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకరించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ప్రపంచ బ్యాంకు సహకారాన్ని అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. శుక్రవారం సమగ్ర శిక్షా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు షబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ బూచర్లతో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య అభివృద్ధి పథకం’ గురించి వెబినార్ సమావేశం జరిగింది. ఈ వెబినార్‌లో విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ► రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తోంది. బడ్జెట్లో 16 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ► మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాం. ► విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపడానికి ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ► మంత్రితో పాటు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి. సమగ్ర శిక్షా ఏఎస్పీడీ∙ఆర్.మధుసూదనరెడ్డి, పాఠశాల విద్య సలహాదారులు డాక్టర్ ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌కు భారీ సాయం
న్యూఢిల్లీ: కోవిడ్–19తో ఆర్థికంగా కుదేలైన భారత్‌ను ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. నిరుపేదల సంక్షేమం కోసం 1బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) రుణాన్ని విడుదల చేయనుంది. పట్టణాల్లో నిరుపేదలు, వలస కూలీల సంక్షేమం కోసం ఈ రుణాల్ని అందిస్తున్నట్టుగా వరల్డ్ బ్యాంకు ఇండియా డైరెక్టర్ జునాయిద్ అహ్మద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ దేశాన్ని సరైన దిశగా ప్రయాణించేలా బాటలు వేస్తుందన్నారు. గతంలో ఇచ్చిన సాయానికి అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. -
ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం
సాక్షి, అమరావతి: అమరావతి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) సంయుక్తంగా రుణం మంజూరుకు ప్రతిపాదించాయని, గత టీడీపీ సర్కారు రాజధానిలో సాగించిన అవినీతి, అక్రమాల వల్ల రుణ మంజూరును ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకోవడంతో అందులో భాగంగానే ఏఐఐబీ కూడా అదే బాటలో నడిచిందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అమరావతికి రుణం మంజూరు ప్రతిపాదనను ఏఐఐబీ ఉపసంహరించుకుందంటూ కొన్ని పత్రికలు, ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పాయి. ఉపసంహరించుకున్న రుణాన్ని మరో కొత్త ప్రాజెక్టుకు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ ఆసక్తి కనబరుస్తోందని, ఇప్పటికే ఈ విషయాన్ని రెండు బ్యాంకుల ప్రతినిధులు తెలియజేశారని గుర్తుచేశాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... ల్యాండ్ పూలింగ్ పారదర్శకంగా జరగలేదు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు కాకుండానే గత టీడీపీ సర్కారు అమరావతిలో రహదారులు, వరద నియంత్రణకు సంబంధించి ఏడు ప్యాకేజీలకు టెండర్లను ఖరారు చేసింది. ఆ టెండర్లలో పాల్గొన్న సంస్థలన్నీ కుమ్మక్కైనట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతోపాటు రాజధాని పేరుతో టీడీపీ సర్కారు చేసిన ల్యాండ్ పూలింగ్ పారదర్శకంగా జరగలేదని తేల్చారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను తీసుకోవడంతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అమరావతిలో వ్యవసాయ కూలీల జీవనోపాధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రపంచ బ్యాంకు స్వతంత్ర బృందం తనిఖీల్లో వెల్లడైంది. అమరావతి ప్రాజెక్టుపై మరింత లోతుగా తనిఖీలు నిర్వహించాలని ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్ ప్రపంచ బ్యాంకుకు సూచించింది. దీంతో ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే... రుణం మంజూరు చేయకుండానే దేశంలో ఎక్కడా తనిఖీలు, దర్యాప్తులు జరగలేదని, ఇందుకు అనుమతిస్తే దేశంతో పాటు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు ప్రతిపాదనను మాత్రమే ఉపసంహరించుకోవాలని సూచించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులకు రుణం మంజూరు చేశాయని, ఆ రుణాన్ని ఖర్చు చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆ సంస్థల ప్రతినిధులు ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తామని కొత్త ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టులో భాగంగా 140 మిలియన్ డాలర్లను ఏఐఐబీ ఇదివరకే మంజూరు చేసిందని, గ్రామీణ రహదారులకు 400 మిలియన్ డాలర్లు, పట్టణాల్లో పారిశుధ్య ప్రాజెక్టుకు మరో 400 మిలియన్ డాలర్లు.. మొత్తం 940 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని మంజూరు చేసిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేశాయి. కాంట్రాక్టు సంస్థల కుమ్మక్కుపై విచారణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు కొసాగిస్తామని ఏఐఐబీ ఉపాధ్యక్షుడు ఇప్పటికే హామీ ఇచ్చారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, సంబంధిత రంగాలకు సంబంధించి రుణ ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని పేర్కొన్నాయి. 2031 నాటికి పట్టణ జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు సదుపాయాలు కల్పించాల్సి ఉందని, దీనిపై దృష్టి సారించామని అధికార వర్గాలు తెలియజేశాయి. అమరావతి ప్రాజెక్టులో భాగంగా ఏడు ప్యాకేజీ పనుల విషయంలో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. -
ప్రపంచ బ్యాంకు నిధులపై బుగ్గన కీలక ప్రకటన
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంకు నిధులపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా ప్రపంచ బ్యాంక్ నిధులపై సోమవారం మంత్రి వివరణ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉందని, రూ. 5వేల కోట్లు సాయమందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీలో ఆయన కీలక ప్రకటన చేశారు. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారని, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారని వివరించారు. అయితే తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకానికి ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. సభలో బుగ్గన ప్రకటన వివరాలు.. ‘‘అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు మద్దతు ఉంటుంది. అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి సహాయం కోరుతూ ఏపీ ప్రభుత్వం 2016 అక్టోబర్ 8న ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రాజెక్టు ప్రతిపాదన కోసం చేసిన అభ్యర్థన మే 25 2017న పునరుద్ధరించబడిన తరువాత జూన్‌లో నమోదు చేయబడింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా మోలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నుంచి నిధుల కోసం రుణ ప్రతిపాదనను డీఆఏ క్లియర్ చేసింది. అయితే నూతన రాజధాని నగర అభివృద్ధి నమూనా వల్ల కలిగే ప్రతికూల, పర్యావరణ సామాజిక, ఆర్థిక ప్రభావావలకు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిదని అన్ని విధాలుగా స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వ చర్యలు భారతదేశాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుకు ఆమోదించక పూర్వమే, స్వతంత్ర బృందం దర్యాప్తు చేయాలని సిఫారసు చేసింది. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడి దోపిడి చూసి ప్రపంచ బ్యాంకు బయపడింది. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు. ప్రపంచ బ్యాంకు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారు. అయితే తాజాగా అమరావతి మానవ అభివృద్ధి ప్రాజెక్టుకు పూర్తి సహాకారం అందిస్తామని వివరించింది’’ అని తెలిపారు. -
రుణం వద్దన్నది భారత ప్రభుత్వమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సుస్థిర మౌలిక వసతుల ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదనను భారత ప్రభుత్వమే విరమించుకుందని, దాంతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకోలేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం చేసిన వినతి మేరకే ఈ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గినట్లు పేర్కొంది. రాజధాని ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకపోయినా ఏపీలో కొత్త ప్రభుత్వానికి అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రిన్సిపల్ కమ్యూనికేషన్ అధికారి సుదీప్ మొజుందర్ పేరిట ఆదివారం బ్యాంకు వెబ్సైట్లో పత్రికా ప్రకటన విడుదలైంది. ఏపీ ప్రభుత్వంతో సుదీర్ఘమైన భాగస్వామ్యం అమరావతి ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలన్న విజ్ఞప్తిని ఈ నెల 15 తేదీన భారత ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఈ నేపథ్యంలో దీనిపై తాము ముందుకు వెళ్లలేమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు తెలిపిందని సుదీప్ మొజుందర్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తుల నిర్వహణ రంగాలను కవర్ చేసే ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. గత నెల 27వ తేదీన ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్య రంగంలో 328 మిలియన్ డాలర్ల కొత్త ఆర్థిక సహాయం కూడా ఇందులో కలిసి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో ప్రపంచ బ్యాంకుకు సుదీర్ఘమైన, ఫలవంతమైన భాగస్వామ్యం ఉందని ఆ ప్రకటనలో వివరించారు. వినూత్నమైన ఆవిష్కరణలు చేయడంలో ఏపీ ముందుందని ప్రశంసించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం రూపొందించుకున్న ప్రాధామ్యాలకు అనుగుణంగా వారికి కావాల్సిన సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం విజ్ఞప్తికి లోబడి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమరావతికి రుణం ఇచ్చే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకోలేదని, కేంద్ర ప్రభుత్వమే రుణ విజ్ఞప్తిని విరమించుకుందని సుదీప్ మొజుందర్ ‘సాక్షి’కి తెలిపారు. రాజధానిలో ఉల్లంఘనల వల్లే ఆగిన రుణం తమను చూసి రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఇదే పాట అందుకున్నారు. కానీ, స్వయంగా ప్రపంచ బ్యాంకే దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వడంతో చంద్రబాబు, ఆయన పరివారం చేస్తున్న ప్రచారంలోని డొల్లతనం తేటతెల్లమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలిన ఎల్లో గ్యాంగ్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. వాస్తవానికి ఈ రుణం మంజూరు వ్యవహారం మూడేళ్లుగా పరిశీలన దశలోనే ఉంది. రుణం కచ్చితంగా వస్తుందనే గ్యారంటీ ఏ దశలోనూ లేకుండా పోయింది. చంద్రబాబు హాయంలో రాజధాని అమరావతి నిర్మాణంలో లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు జరిగాయని అక్కడి రైతులు, పర్యావరణవేత్తలు, మేధావులు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. వాటిపై ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందాలతో పలుమార్లు విచారణ జరిపించింది. ఉల్లంఘనలు నిజమేనని తన వెబ్సైట్లో తనిఖీ బృందం నివేదికలను ఉంచింది. చంద్రబాబు పాలనలో రాజధాని పేరిట జరిగిన అరాచకం వల్లే ఈ రుణం రావడం లేదని అప్పట్లోనే స్పష్టమైంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన హయాంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ మరచిపోయి ప్రపంచ బ్యాంకు రుణం రాకపోవడానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ నిందలు వేయడం గమనార్హం. -
‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రుణం రాకముందే రోడ్ల టెండర్లా? అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడానికి చంద్రబాబు సర్కారు వైఫల్యాలతోపాటు బ్యాంకు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణాలు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకముందే గత సర్కారు రహదారుల పనులకు టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఖరారు కూడా చేసింది. అనంతరం టెండర్ల వివరాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇందులో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని సీఆర్డీఏను కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సేకరించి ఇతర అవసరాలకు వినియోగించడం, రైతు కూలీలు జీవనోపాధి కోల్పోవడం, పర్యావరణ విపత్తులు, రాజధానిలో కృష్ణా నది వరదల ప్రభావం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించడంతో పాటు విచారణ జరిపించింది. చంద్రబాబు సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గుర్తించిన ప్రపంచ బ్యాంకు తనిఖీల కోసం బృందాన్ని అమరావతికి పంపింది. రుణం మంజూరు కూడా కాకముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి ప్రాజెక్టుపై విచారణ చేయడం పట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విస్మయం వ్యక్తం చేసింది. తనిఖీల తరువాతే బ్యాంకు నిర్ణయం.. – రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణం కోరుతూ 2016 అక్టోబరు 8న చంద్రబాబు సర్కారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి ప్రతిపాదనలు పంపింది. 2017 జూన్ 12న ఈ ప్రతిపాదన రిజిస్టర్ అయింది. – మొత్తం ప్రాజెక్టు విలువ 715 మిలియన్ అమెరికన్ డాలర్లు కాగా దీని విలువ మన రూపాయల్లో ఇంచుమించు రూ.5 వేల కోట్లు. – ఇందులో వరల్డ్ బ్యాంకు వాటా రూ.2100 కోట్లు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు వాటా రూ.1,400 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ.1500 కోట్లు. – ప్రపంచ బ్యాంకు నుంచి రుణం మంజూరు కాకముందే 2017–2018లో రాజధానిలో రహదారి నిర్మాణ పనులను హడావుడిగా కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. – 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, ముంపు నివారణకు కాలువలు, రిజర్వాయర్ పేరిట రూ. 947 కోట్ల విలువైన పనులు అప్పగించారు. – టీడీపీ ప్రభుత్వం అప్పగించిన వాటిల్లో 7 పనులు రెట్రోయాక్టివ్ ఫైనాన్సింగ్ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు అభ్యంతరం తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు దీన్ని పట్టించుకోకుండా చాలా పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. – రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో గత సర్కారు బాధితులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలున్నారు. – దీనిపై వాస్తవాలను నిర్థారించుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఏఎం, ఇండిపెండెంట్ అకౌంటబులిటీ మెకానిజం 2017 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించింది. అమరావతి ప్రాజెక్టు డిజైన్, పర్యావరణం, రాజధానిలో నివసిస్తున్న బడుగు, బలహీనవర్గాల స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై పరిశీలన, తనిఖీలు జరిపింది. తొలుత 2017 సెప్టెంబరు 27న నివేదిక ఇవ్వగా అనంతరం అదే ఏడాది నవంబర్ 27న సవరించింది. ఆ తరువాత 2018 జూన్ 26న మరోసారి సవరించగా చివరగా ఈ ఏడాది మార్చి 29న నివేదికను ఖరారు చేసింది. – ప్రపంచబ్యాంకుకు చెందిన ఐదు విభిన్న బృందాలు తమకు అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భారీగా సమాచారాన్ని సేకరించాయి. ఇందులో ఇద్దరు ప్రతినిధులు చాలా ఘాటుగా ప్రపంచబ్యాంకుకు నివేదిక ఇచ్చారు. రాజధాని రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని, కౌలు రైతులను పట్టించుకోలేదని, నిరుద్యోగాన్ని సృష్టించారని, వ్యవసాయం దెబ్బతిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సృష్టించారని, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, తనిఖీ బృందాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై సరైన వివరణలు కూడా ఇవ్వలేదు. దీంతో పూర్తిస్థాయి బృందంతో విచారణ చేయాలని తనిఖీ బృందం ప్రపంచబ్యాంకుకు సిఫార్సు చేసింది. ప్రాజెక్టు మంజూరు కాకముందే ఇలాంటి విచారణకు ఆదేశించడం గతంలో దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగకపోవడం గమనార్హం. -
ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తవు : బిల్ గేట్స్
వాషింగ్టన్ : ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం ఎటువంటి తస్కరణకు గురికాదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. అది కేవలం ఒక బయో గుర్తింపు కార్డు మాత్రమేనని అన్నారు. ఆధార్ సాంకేతికతను ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు చేపడుతున్న చర్యలను గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆధార్ కార్డుని పొందేందుకు మన వ్యక్తిగత సమాచారాన్ని అప్లికేషన్లో సమర్పిస్తాం. తద్వార ప్రతి భారతీయుడు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందుతాడు. వ్యక్తి ఆధార్ సంఖ్య ద్వారా అతని మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడి అవుతాయి. మరేయితర సమాచారం బహిర్గతం కాదని’ బిల్‌గేట్స్ తెలిపారు. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యతో ఎన్ని బ్యాంకు అకౌంట్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇది ఒక రకంగా సమాజానికి మేలు చేసే అంశమని.. జనాభా ఆర్థిక స్థితిగతులు, దేశం ఆర్థిక పరిస్థితి వంటివి ఆధార్‌తో అంచనా వెయొచ్చని తెలిపారు. తద్వార ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకొనే వీలుంటుందని చెప్పారు. మెరుగైన పాలన అందించేందుకు దోహదపడే ఆధార్‌వంటి సాంకేతికత అన్ని దేశాలు అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణ కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చిందని తెలిపారు. ఇప్పటికే భారత్ పొరుగు దేశాలు ఆధార్ సాంకేతికతను తమ దేశాల్లో అమలు చేయడానికి సుముఖంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకనిని ఆయా దేశాలు సంప్రదించాయని పేర్కొన్నారు. ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం అంగట్లో పెట్టినట్టేనని దుమారం చెలరేగింది కదా అనే ప్రశ్నకు.. ‘ఆధార్‌తో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఎందుకంటే అదొక బయో గుర్తింపు కార్డు మాత్రమేన’ని సమాధానమిచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఆధార్‌ను దుర్వినియోగం చేయడం మినహా.. ఒక గుర్తింపు కార్డుగా ఆధార్ కన్నా విశిష్టమైనది మరొకటి లేదని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలన కంటే ముందే ఆధార్ మొదలైనా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆధార్ సాంకేతికత ఉండడం శుభపరిణామం. విద్యా, ప్రభుత్వ పాలనలో సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు నందన్ నీలేకని చేసిన కృషి అభినందనీయ మన్నారు. -
మీ డీడీఎన్ ఎంత ?
మీ డీడీఎన్ ఎంత? అని ఇకపై ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. డీడీఎన్ అంటే ఏమిటబ్బా!! అని ఆశ్చర్యపోకండి. మీ ఇంటి డిజిటల్ డోర్ నంబరే సంక్షిప్తంగా డీడీఎన్. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ లాగే భవిష్యత్తులో డీడీఎన్ రాబోతోంది. ఓ వ్యక్తికి ఆధార్ నంబర్ ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ఓ ఇంటికి డీడీఎన్ కూడా అదే రీతిలో గుర్తింపు కల్పిస్తుందని పురపాలక శాఖ చెబుతోంది. సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇంటింటికీ డిజిటల్ డోర్ నంబర్లు (డీడీఎన్) కేటాయించే కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుడుతోంది. సూర్యాపేటలోని శ్రీరాంనగర్ కాలనీలో ఇంటింటికీ డీడీఎన్ల కేటాయింపు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని 72 నగరాలు, పట్టణాల్లోని 12 లక్షలకు పైగా ఇళ్లకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. ఐదు నెలల వ్యవధిలో డీడీఎన్లు కేటాయించేందుకు కాంట్రాక్టర్ల కోసం ప్రకటన జారీ చేసింది. జియో ట్యాగింగ్.. ఇప్పటికే నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే జరిపి ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసిన పురపాలక శాఖ.. ఇళ్లకు కేటాయించే డీడీఎన్లతో జియో ట్యాగింగ్ నంబర్లను అనుసంధానం చేయనుంది. డీడీఎన్ను ఉపయోగించి గ్లోబల్ పోజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సహాయంతో సంబంధిత ఇంటిని గుర్తించి అక్కడికి చేరుకునేందుకు వెసులుబాటు కలగనుంది. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో లొకేషన్‌కు చేరుకునేందుకు ఉపయోగపడనుంది. క్యాబ్, ఫుడ్, కొరియర్ తదితరాల డెలివరీకి 30 శాతం వరకు సమయం ఆదా కానుంది. భవిష్యత్తులో డీడీఎన్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్యం, వంట గ్యాస్, తపాలా, అత్యవసర సేవలు అందించే అవకాశముంది. డీడీఎన్ సెర్చ్ సదుపాయం తెలంగాణ మునిసిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో పురపాలక శాఖ డీడీఎన్ల కేటాయింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంగ్ల అక్షరాలు, సంఖ్యల కలయికతో ప్రతి ఇంటికి నిర్దిష్టమైన డీడీఎన్ను కేటాయించనున్నారు. ఇంటింటికి సర్వే జరిపి పాత ఇంటి నంబర్, మైలు రాయి, వీధి పేరు, ప్రాంతం, నగరం పేరుతోపాటు ఇంటి ఫోటో, యజమాని ఫోన్ నంబర్‌ను సేకరించనున్నారు. ఈ వివరాలను ఆ ఇంటికి కేటాయించే డీడీఎన్తో అనుసంధానం చేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత పౌరులకు పురపాలక శాఖ ‘డీడీఎన్ సెర్చ్’అవకాశాన్ని కల్పించనుంది. అనంతరం పట్టణ ప్రాంతాల డిజిటల్ రోడ్ నెట్‌వర్క్‌ను కూడా రూపొందించనుంది. -
తుఫాన్ షెల్టర్లు సిద్ధం
- రూ.16.24 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో 16 భవనాల నిర్మాణం - పూర్తి చేసిన భవనాలు తహశీల్దార్లకు అప్పగింత - ప్రతి షెల్టర్‌కు సొసైటీ తప్పనిసరి ఒంగోలు టూటౌన్ : జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తుఫాన్ షెల్టర్ల నిర్మాణం పూర్తయింది. తుఫాన్ల నుంచి తీరప్రాంత గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆధునిక వసతులతో వీటిని నిర్మించారు. రెండు దశల్లో తుఫాన్ షెల్టర్లు జిల్లాకు మంజూరయ్యాయి. 2011-13 ఆర్ధిక సంవత్సరంలో మొదటి దశ (ఫేజ్-1) మూడు తుఫాన్ షెల్టర్లు మంజూరవగా..2014-15 లో ఉలవపాడు మండలంలో ఐదు, కొత్తపట్నం మండలంలో ఆరు, చీరాల మండలంలో ఒక తుఫాన్ షెల్టర్‌తో కలిపి మొత్తం 12 మంజూరుయ్యాయి. జాతీయ తుఫాన్ విపత్తు నివారణ పథకం కింద ప్రపంచ బ్యాంకు నిధులతో తుఫాన్ షెల్టర్ల నిర్మాణం పీఆర్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో చేపట్టారు. భవనం అంచనాలను బట్టి రూ.90 లక్షల నుంచి రూ.కోటి 10 లక్షల వరకు ఒక్కొక్క భవనానికి నిధులు కేటాయించారు. మొదటి విడతలో మంజూరైన తుఫాన్ షెల్టర్లు చాకిచర్ల, కనపర్తి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. పాకలలోతుఫాన్ షెల్టర్ ఇటీవల పూర్తయింది. రెండో విడతలో మంజూరైన చీరాల ఓడరేవు, కొత్తపట్నం మండలంలో కె. పల్లెపాలెం, మోటుమాల, పాదర్తి, రంగాయపాలెం, గవళ్లపాలెం, మడనూరు గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు పూర్తయ్యాయి. అదే విధంగా ఉలవపాడు మండలంలో కరేడు గ్రామ పరిధిలో పెద్దపల్లెపాలెం, అలగాయపాలెం, కొత్తపల్లెపాలెం, గుడ్లూరు మండలంలోని మండవవారిపాలెం, సాలిపేట గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. సింగరాయకొండలోని పోతయ్యగారి పట్టపుపాలెంలో నిర్మించతలపెట్టిన తుఫాన్ షెల్టర్ మాత్రం స్థలం లేకపోవడం వలన ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం దానికి గ్రామస్తుల చొరవతో స్థల సేకరణ జరిగి..రెండు రోజుల క్రితం బిల్డింగ్ నిర్మాణానికి సిద్ధమైందని ఇంజినీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 16 తుఫాన్ షెల్టర్లలో 15 పూర్తయ్యాయి. ఒక్కటి మాత్రం ప్రస్తుతం పునాదులు పడే దశలో ఉంది. పూర్తయిన అన్ని తుఫాన్ షెల్టర్లను ఆయా మండలాల తహశీల్దార్లకు అప్పగించామని పీఐయు (పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ) ఈఈ యం.వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. మొత్తం తీర ప్రాంత గ్రామాల్లో 54 తుఫాన్ షెల్టర్లు ఉండగా వాటిలో కేవలం 24 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి. సొసైటీలు ఏర్పాటులో నిర్లక్ష్యం గ్రామస్తుల శుభకార్యాలకు నిత్యం ఉపయోగపడే లా ఆధునిక వసతులతో నగరాల్లో అపార్ట్మెంట్లను తలదన్నేలా కొత్త తుఫాన్ షెల్టర్లను నిర్మించారు. భవనం కింద ఖాళీ స్థలం, చుట్టూ కాంపౌండ్ వాల్, పార్కింగ్ వంటి సౌకర్యాలు ఉండేలా రూపకల్పన చేశారు. మనుషులకే కాకుండా పశువులు, మేకలు, గొర్రెలను రక్షించుకునేందుకు అనువుగా ఈ తుఫాన్ షెల్టర్ల నిర్మాణం జరిగింది. ప్రతి తుఫాన్ షెల్టర్‌కు ఒక సొసైటీ ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. సొసైటీల ఏర్పాటు ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. గతంలో ఏర్పాటు చేసిన తుఫాన్ షెల్టర్లు నిత్యం వాడుకలో లేక నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుతుండటంతో ఈసారి కొత్త పంథాను ఎంచుకొని నిర్మించారు. ప్రతి తుఫాన్ షెల్టర్‌కు గ్రామస్థాయిలో సొసైటీ ఏర్పాటు చేయాలి. ఆ బాధ్యత ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. అయితే ఇప్పటి వరకు చాలా తుఫాన్ షెల్టర్లకు సొసైటీలు ఏర్పాటు చేయలేదని సమాచారం.