మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్
వాషింగ్టన్ : ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం ఎటువంటి తస్కరణకు గురికాదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. అది కేవలం ఒక బయో గుర్తింపు కార్డు మాత్రమేనని అన్నారు. ఆధార్ సాంకేతికతను ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు చేపడుతున్న చర్యలను గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆధార్ కార్డుని పొందేందుకు మన వ్యక్తిగత సమాచారాన్ని అప్లికేషన్‌లో సమర్పిస్తాం. తద్వార ప్రతి భారతీయుడు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందుతాడు. వ్యక్తి ఆధార్ సంఖ్య ద్వారా అతని మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడి అవుతాయి. మరేయితర సమాచారం బహిర్గతం కాదని’ బిల్‌గేట్స్ తెలిపారు.
ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యతో ఎన్ని బ్యాంకు అకౌంట్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇది ఒక రకంగా సమాజానికి మేలు చేసే అంశమని.. జనాభా ఆర్థిక స్థితిగతులు, దేశం ఆర్థిక పరిస్థితి వంటివి ఆధార్‌తో అంచనా వెయొచ్చని తెలిపారు. తద్వార ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకొనే వీలుంటుందని చెప్పారు. మెరుగైన పాలన అందించేందుకు దోహదపడే ఆధార్‌వంటి సాంకేతికత అన్ని దేశాలు అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రపంచ బ్యాంకు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణ కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చిందని తెలిపారు. ఇప్పటికే భారత్ పొరుగు దేశాలు ఆధార్ సాంకేతికతను తమ దేశాల్లో అమలు చేయడానికి సుముఖంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకనిని ఆయా దేశాలు సంప్రదించాయని పేర్కొన్నారు.
ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం అంగట్లో పెట్టినట్టేనని దుమారం చెలరేగింది కదా అనే ప్రశ్నకు.. ‘ఆధార్‌తో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఎందుకంటే అదొక బయో గుర్తింపు కార్డు మాత్రమేన’ని సమాధానమిచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఆధార్‌ను దుర్వినియోగం చేయడం మినహా.. ఒక గుర్తింపు కార్డుగా ఆధార్ కన్నా విశిష్టమైనది మరొకటి లేదని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలన కంటే ముందే ఆధార్ మొదలైనా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆధార్ సాంకేతికత ఉండడం శుభపరిణామం. విద్యా, ప్రభుత్వ పాలనలో సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు నందన్ నీలేకని చేసిన కృషి అభినందనీయ మన్నారు.
Comments
Please login to add a commentAdd a comment