Bill and milinda Gates Foundation
-
పోలియోపై పోరుకు రూ.9.8 వేల కోట్ల విరాళం
బెర్లిన్: ప్రపంచ వ్యాప్తంగా పోలియో మహమ్మారిపై సాగే పోరాటానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.8 వేల కోట్ల)సాయం ప్రకటించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలను పోలియో రహితంగా మార్చేందుకు, వైరస్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని నివారణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. పోలీయో నిర్మూలన కోసం ఇప్పటి వరకు 5 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు వెల్లడించింది. పోలీయోపై పరిశోధనలు, కొత్త వేరియంట్ల గుర్తింపు సహా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఇటీవలే పాకిస్తాన్లో 20, అఫ్గానిస్తాన్‌లో 2 పోలీయో కేసులు నమోదైన క్రమంలో ఆయా దేశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. ప్రపంచం ఈ మహమ్మారిని అంతం చేస్తానని మాటిచ్చిందని, ఏ ఒక్కరు ఈ వ్యాధిపై భయంతో జీవించకూడదంటూ ట్వీట్ చేసింది బిల్ అండ్ మెలిండా గేట్స్. The world made a promise to #EndPolio for good. No one should live in fear of this preventable disease. The Gates Foundation is proud to commit $1.2B toward helping health workers stop all forms of this virus and protect children forever. https://t.co/oA7RNzcOIy — Gates Foundation (@gatesfoundation) October 16, 2022 ఇదీ చదవండి: Bill Gates: ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్! -
రానున్న 6 నెలలు ప్రమాదకరం: బిల్ గేట్స్
వాషింగ్టన్: రానున్న నాలుగు నుంచి ఆరు నెలలు కరోనా మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. గేట్స్‌కు సంబంధించిన ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ కోవిడ్–19 కు టీకా రూపొందించే కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది. ‘అమెరికాలో రానున్న 4 నుంచి 6 నెలలు కరోనా మహమ్మారి ముప్పు భారీగా పెరిగే ప్రమాదముంది. ఐహెచ్ఎంఈ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్) అధ్యయనం ప్రకారం అదనంగా 2 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు. అయితే, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలు పాటిస్తే ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’ అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇలాంటి మహమ్మారి ప్రమాదం పొంచి ఉందని బిల్ గేట్స్ 2015లోనే హెచ్చరించారు. 2015లో తాను అంచనా వేసిన దానికన్నా ఈ వైరస్ మరింత ప్రమాదకారి అని తేలిందని గేట్స్ ‘సీఎన్ఎన్’ వార్తాసంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా టీకా ప్రపంచంలోని అందరికీ అందాల్సి ఉందని, అందుకు అమెరికా సహాయపడాలని గేట్స్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అమెరికా స్వార్థంగా ఆలోచించకూడదన్నారు. టీకాపై ప్రజల విశ్వాసం పెంచేందుకు బహిరంగంగానే తాను వ్యాక్సీన్‌ను తీసుకుంటానన్నారు. -
ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తవు : బిల్ గేట్స్
వాషింగ్టన్ : ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం ఎటువంటి తస్కరణకు గురికాదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. అది కేవలం ఒక బయో గుర్తింపు కార్డు మాత్రమేనని అన్నారు. ఆధార్ సాంకేతికతను ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు చేపడుతున్న చర్యలను గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆధార్ కార్డుని పొందేందుకు మన వ్యక్తిగత సమాచారాన్ని అప్లికేషన్లో సమర్పిస్తాం. తద్వార ప్రతి భారతీయుడు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందుతాడు. వ్యక్తి ఆధార్ సంఖ్య ద్వారా అతని మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడి అవుతాయి. మరేయితర సమాచారం బహిర్గతం కాదని’ బిల్‌గేట్స్ తెలిపారు. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యతో ఎన్ని బ్యాంకు అకౌంట్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇది ఒక రకంగా సమాజానికి మేలు చేసే అంశమని.. జనాభా ఆర్థిక స్థితిగతులు, దేశం ఆర్థిక పరిస్థితి వంటివి ఆధార్‌తో అంచనా వెయొచ్చని తెలిపారు. తద్వార ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకొనే వీలుంటుందని చెప్పారు. మెరుగైన పాలన అందించేందుకు దోహదపడే ఆధార్‌వంటి సాంకేతికత అన్ని దేశాలు అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణ కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చిందని తెలిపారు. ఇప్పటికే భారత్ పొరుగు దేశాలు ఆధార్ సాంకేతికతను తమ దేశాల్లో అమలు చేయడానికి సుముఖంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకనిని ఆయా దేశాలు సంప్రదించాయని పేర్కొన్నారు. ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం అంగట్లో పెట్టినట్టేనని దుమారం చెలరేగింది కదా అనే ప్రశ్నకు.. ‘ఆధార్‌తో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఎందుకంటే అదొక బయో గుర్తింపు కార్డు మాత్రమేన’ని సమాధానమిచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఆధార్‌ను దుర్వినియోగం చేయడం మినహా.. ఒక గుర్తింపు కార్డుగా ఆధార్ కన్నా విశిష్టమైనది మరొకటి లేదని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలన కంటే ముందే ఆధార్ మొదలైనా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆధార్ సాంకేతికత ఉండడం శుభపరిణామం. విద్యా, ప్రభుత్వ పాలనలో సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు నందన్ నీలేకని చేసిన కృషి అభినందనీయ మన్నారు. -
పారిశుద్ధ్య ప్రాజెక్టుకు సహకారం
మరుగుదొడ్ల నిర్మాణానికి గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సాయం న్యూఢిల్లీ: దేశంలో యూజర్ ఫ్రెండ్లీ మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కలసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించడానికి కేంద్రం ఇటీవలే స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్, ట్రస్టీ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించడం, దానికి సాంకేతిక సహకారం అందించడంపై వీరు చర్చించారు. ప్రస్తుతం దేశంలో 1.20 కోట్ల ఆవాసాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని, 2019 నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మిస్తామని వెంకయ్య వివరించారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పారిశుద్ధ్య పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని, దీనికి గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించాలని కోరారు. కేంద్రం చేపడుతున్న పథకాలను ప్రశ ంసించిన గేట్స్.. పరిశోధన, సాంకేతికత విస్తరణలో సమర్థత కలిగిన తమ ఫౌండేషన్ భారత ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, గేట్స్ ఫౌండేషన్ మరుగుదొడ్లు, మురుగు నీటి నిర్వహణలో నవీన సాంకేతిక పరిజ్ఞానం, మురుగు నీటి పారుదలలో వికేంద్రీకరణ పద్ధతులు, పారిశుద్ధ్య రంగ నిర్వహణలో సామర్థ్య పెంపు, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచడం వంటి అంశాల్లో కలిసి పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వెంకయ్య ప్రశంసించారు. ప్రధాని మోదీతో బిల్ గేట్స్ భేటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్, ట్రస్టీ బిల్ గేట్స్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆయన చేస్తున్న కృషిని, పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేసేందుకు చేపట్టిన జన్‌ధన్ యోజన పథకాన్ని ఆయన ప్రశంసించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో ఓకే ఏడాదిలో మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారన్నారు. సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించి నాలుగు కొత్త వ్యాక్సిన్లను ప్రవేశపెట్టేందుకు భారత్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ రంగంలో భారత్‌తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. ప్రజాసేవ, దాతృత్వానికి సంబంధించి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. మురుగునీటి నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం తదితర అంశాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి తన భావాలను బిల్, మిలిండాలతో మోదీ పంచుకున్నారు.