పారిశుద్ధ్య ప్రాజెక్టుకు సహకారం
మరుగుదొడ్ల నిర్మాణానికి గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సాయం
న్యూఢిల్లీ: దేశంలో యూజర్ ఫ్రెండ్లీ మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కలసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించడానికి కేంద్రం ఇటీవలే స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్, ట్రస్టీ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించడం, దానికి సాంకేతిక సహకారం అందించడంపై వీరు చర్చించారు. ప్రస్తుతం దేశంలో 1.20 కోట్ల ఆవాసాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని, 2019 నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మిస్తామని వెంకయ్య వివరించారు.
దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పారిశుద్ధ్య పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని, దీనికి గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించాలని కోరారు. కేంద్రం చేపడుతున్న పథకాలను ప్రశ ంసించిన గేట్స్.. పరిశోధన, సాంకేతికత విస్తరణలో సమర్థత కలిగిన తమ ఫౌండేషన్ భారత ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, గేట్స్ ఫౌండేషన్ మరుగుదొడ్లు, మురుగు నీటి నిర్వహణలో నవీన సాంకేతిక పరిజ్ఞానం, మురుగు నీటి పారుదలలో వికేంద్రీకరణ పద్ధతులు, పారిశుద్ధ్య రంగ నిర్వహణలో సామర్థ్య పెంపు, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచడం వంటి అంశాల్లో కలిసి పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వెంకయ్య ప్రశంసించారు.
ప్రధాని మోదీతో బిల్ గేట్స్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్, ట్రస్టీ బిల్ గేట్స్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆయన చేస్తున్న కృషిని, పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేసేందుకు చేపట్టిన జన్‌ధన్ యోజన పథకాన్ని ఆయన ప్రశంసించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో ఓకే ఏడాదిలో మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారన్నారు. సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించి నాలుగు కొత్త వ్యాక్సిన్లను ప్రవేశపెట్టేందుకు భారత్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ రంగంలో భారత్‌తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. ప్రజాసేవ, దాతృత్వానికి సంబంధించి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. మురుగునీటి నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం తదితర అంశాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి తన భావాలను బిల్, మిలిండాలతో మోదీ పంచుకున్నారు.