
వాషింగ్టన్: రానున్న నాలుగు నుంచి ఆరు నెలలు కరోనా మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. గేట్స్‌కు సంబంధించిన ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ కోవిడ్–19 కు టీకా రూపొందించే కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది. ‘అమెరికాలో రానున్న 4 నుంచి 6 నెలలు కరోనా మహమ్మారి ముప్పు భారీగా పెరిగే ప్రమాదముంది. ఐహెచ్‌ఎంఈ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్) అధ్యయనం ప్రకారం అదనంగా 2 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు.
అయితే, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలు పాటిస్తే ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’ అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇలాంటి మహమ్మారి ప్రమాదం పొంచి ఉందని బిల్ గేట్స్ 2015లోనే హెచ్చరించారు. 2015లో తాను అంచనా వేసిన దానికన్నా ఈ వైరస్ మరింత ప్రమాదకారి అని తేలిందని గేట్స్ ‘సీఎన్‌ఎన్’ వార్తాసంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా టీకా ప్రపంచంలోని అందరికీ అందాల్సి ఉందని, అందుకు అమెరికా సహాయపడాలని గేట్స్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అమెరికా స్వార్థంగా ఆలోచించకూడదన్నారు. టీకాపై ప్రజల విశ్వాసం పెంచేందుకు బహిరంగంగానే తాను వ్యాక్సీన్‌ను తీసుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment