మీ డీడీఎన్ ఎంత? అని ఇకపై ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. డీడీఎన్ అంటే ఏమిటబ్బా!! అని ఆశ్చర్యపోకండి. మీ ఇంటి డిజిటల్ డోర్ నంబరే సంక్షిప్తంగా డీడీఎన్. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ లాగే భవిష్యత్తులో డీడీఎన్ రాబోతోంది. ఓ వ్యక్తికి ఆధార్ నంబర్ ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ఓ ఇంటికి డీడీఎన్ కూడా అదే రీతిలో గుర్తింపు కల్పిస్తుందని పురపాలక శాఖ చెబుతోంది.
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇంటింటికీ డిజిటల్ డోర్ నంబర్లు (డీడీఎన్) కేటాయించే కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుడుతోంది. సూర్యాపేటలోని శ్రీరాంనగర్ కాలనీలో ఇంటింటికీ డీడీఎన్‌ల కేటాయింపు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని 72 నగరాలు, పట్టణాల్లోని 12 లక్షలకు పైగా ఇళ్లకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. ఐదు నెలల వ్యవధిలో డీడీఎన్‌లు కేటాయించేందుకు కాంట్రాక్టర్ల కోసం ప్రకటన జారీ చేసింది.
జియో ట్యాగింగ్..
ఇప్పటికే నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే జరిపి ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసిన పురపాలక శాఖ.. ఇళ్లకు కేటాయించే డీడీఎన్‌లతో జియో ట్యాగింగ్ నంబర్లను అనుసంధానం చేయనుంది. డీడీఎన్‌ను ఉపయోగించి గ్లోబల్ పోజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సహాయంతో సంబంధిత ఇంటిని గుర్తించి అక్కడికి చేరుకునేందుకు వెసులుబాటు కలగనుంది. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో లొకేషన్‌కు చేరుకునేందుకు ఉపయోగపడనుంది. క్యాబ్, ఫుడ్, కొరియర్ తదితరాల డెలివరీకి 30 శాతం వరకు సమయం ఆదా కానుంది. భవిష్యత్తులో డీడీఎన్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్యం, వంట గ్యాస్, తపాలా, అత్యవసర సేవలు అందించే అవకాశముంది.
డీడీఎన్ సెర్చ్ సదుపాయం
తెలంగాణ మునిసిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో పురపాలక శాఖ డీడీఎన్‌ల కేటాయింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంగ్ల అక్షరాలు, సంఖ్యల కలయికతో ప్రతి ఇంటికి నిర్దిష్టమైన డీడీఎన్‌ను కేటాయించనున్నారు. ఇంటింటికి సర్వే జరిపి పాత ఇంటి నంబర్, మైలు రాయి, వీధి పేరు, ప్రాంతం, నగరం పేరుతోపాటు ఇంటి ఫోటో, యజమాని ఫోన్ నంబర్‌ను సేకరించనున్నారు. ఈ వివరాలను ఆ ఇంటికి కేటాయించే డీడీఎన్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత పౌరులకు పురపాలక శాఖ ‘డీడీఎన్ సెర్చ్’అవకాశాన్ని కల్పించనుంది. అనంతరం పట్టణ ప్రాంతాల డిజిటల్ రోడ్ నెట్‌వర్క్‌ను కూడా రూపొందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment