Digital Door numbering
-
మీ డీడీఎన్ ఎంత ?
మీ డీడీఎన్ ఎంత? అని ఇకపై ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. డీడీఎన్ అంటే ఏమిటబ్బా!! అని ఆశ్చర్యపోకండి. మీ ఇంటి డిజిటల్ డోర్ నంబరే సంక్షిప్తంగా డీడీఎన్. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ లాగే భవిష్యత్తులో డీడీఎన్ రాబోతోంది. ఓ వ్యక్తికి ఆధార్ నంబర్ ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ఓ ఇంటికి డీడీఎన్ కూడా అదే రీతిలో గుర్తింపు కల్పిస్తుందని పురపాలక శాఖ చెబుతోంది. సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇంటింటికీ డిజిటల్ డోర్ నంబర్లు (డీడీఎన్) కేటాయించే కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుడుతోంది. సూర్యాపేటలోని శ్రీరాంనగర్ కాలనీలో ఇంటింటికీ డీడీఎన్ల కేటాయింపు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని 72 నగరాలు, పట్టణాల్లోని 12 లక్షలకు పైగా ఇళ్లకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. ఐదు నెలల వ్యవధిలో డీడీఎన్లు కేటాయించేందుకు కాంట్రాక్టర్ల కోసం ప్రకటన జారీ చేసింది. జియో ట్యాగింగ్.. ఇప్పటికే నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే జరిపి ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసిన పురపాలక శాఖ.. ఇళ్లకు కేటాయించే డీడీఎన్లతో జియో ట్యాగింగ్ నంబర్లను అనుసంధానం చేయనుంది. డీడీఎన్ను ఉపయోగించి గ్లోబల్ పోజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సహాయంతో సంబంధిత ఇంటిని గుర్తించి అక్కడికి చేరుకునేందుకు వెసులుబాటు కలగనుంది. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో లొకేషన్‌కు చేరుకునేందుకు ఉపయోగపడనుంది. క్యాబ్, ఫుడ్, కొరియర్ తదితరాల డెలివరీకి 30 శాతం వరకు సమయం ఆదా కానుంది. భవిష్యత్తులో డీడీఎన్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్యం, వంట గ్యాస్, తపాలా, అత్యవసర సేవలు అందించే అవకాశముంది. డీడీఎన్ సెర్చ్ సదుపాయం తెలంగాణ మునిసిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో పురపాలక శాఖ డీడీఎన్ల కేటాయింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంగ్ల అక్షరాలు, సంఖ్యల కలయికతో ప్రతి ఇంటికి నిర్దిష్టమైన డీడీఎన్ను కేటాయించనున్నారు. ఇంటింటికి సర్వే జరిపి పాత ఇంటి నంబర్, మైలు రాయి, వీధి పేరు, ప్రాంతం, నగరం పేరుతోపాటు ఇంటి ఫోటో, యజమాని ఫోన్ నంబర్‌ను సేకరించనున్నారు. ఈ వివరాలను ఆ ఇంటికి కేటాయించే డీడీఎన్తో అనుసంధానం చేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత పౌరులకు పురపాలక శాఖ ‘డీడీఎన్ సెర్చ్’అవకాశాన్ని కల్పించనుంది. అనంతరం పట్టణ ప్రాంతాల డిజిటల్ రోడ్ నెట్‌వర్క్‌ను కూడా రూపొందించనుంది. -
ఇంటి నంబర్లు ఇక డిజిటల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ డిజిటల్ డోర్ నంబర్లు కేటాయించనున్నట్లు పురపా లకశాఖ సంచాలకులు టీకే శ్రీదేవి వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే సూర్యా పేట మున్సిపాలిటీలో దీన్ని ప్రారంభించామన్నారు.సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల క్రయావిక్రయాల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిపే సమయంలోనే స్థానిక మున్సిపాలిటీ రికార్డుల్లోనూ యజమాని పేరు మారేలా ఆటోమెటిక్ మ్యుటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అయితే కొన్ని ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న డోర్ నంబర్లతో ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రికార్డుల్లో ఒక నంబర్ ఉంటే క్షేత్రస్థాయిలో మరో నంబర్ ఉంటుండటంతో మ్యుటేషన్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కొత్తగా డిజిటల్ డోర్ నంబర్లు కేటాయిస్తున్నామన్నారు. 16 అంకెలతో డిజిటల్ డోర్ నంబర్లు... రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్‌ను పురపాలక శాఖ కేటాయించనుంది. ఈ 16 అంకెల్లో మూడు విభాగాలు ఉండనున్నాయి. నగరం/పట్టణాన్ని తెలిపేందుకు ఓ కోడ్, స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు మరో కోడ్ ఉండనుంది. ఈ మూడు కోడ్ల తర్వాత ప్రతి ఇంటికి ప్రత్యేక డోర్ నంబర్‌ను కేటాయించనున్నారు. డిజిటల్ డోర్ నంబర్ ఆధారంగా ఇళ్లు ఏ నగరం/పట్టణం, ఏ వార్డు/డివిజన్లో ఉన్నాయో తేలికగా కనుక్కునే విధంగా డిజిటల్ డోర్ నెంబర్ల సిరీస్ ఉండనుంది. నిరాశ్రయులు, నిరుద్యోగుల కోసం రెండు యాప్‌లు పురపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అర్బన్ దోస్త్, అర్బన్ జీనీ పేరుతో 2 కొత్త యాప్‌లను ప్రవేశపెట్టామని శ్రీదేవి వివరించారు. పట్టణాల్లో రోడ్లపై కనిపించే నిరాశ్రయులను గుర్తించి వారి ఫొటో, వివరాలను అర్బన్ దోస్త్ యాప్‌లో అప్లోడ్ చేస్తే స్థానిక మున్సిపాలిటీ అధికారులు అటువంటి వారికి ఆశ్రయం కల్పిస్తారన్నారు. జీవనోపాధి పథకాలు పొందాలనుకునే నిరుద్యోగులు అర్బన్ జీనీ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సాయం పొందవచ్చన్నారు. 23 రకాల పౌర సేవలు ఆన్లైన్లో... రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 23 రకాల పౌర సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నామని శ్రీదేవి తెలిపారు. 73 పురపాలికల పరిధి లో 12.5 లక్షల ఇళ్లను జియో ట్యాగింగ్ చేశామన్నారు. ఇంటి యజమాని ఎక్కడి నుంచైనా ఆస్తి పన్ను, ఇంటి ఫొటో తదితర వివరాలను పురపాలకశాఖ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఆస్తి న్యాయ వివాదంలో ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చని, ఆస్తుల క్రయవిక్రయాల సమయం లో ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. పట్టణాల్లో కొత్త వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ట్రేడ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను పూర్తిగా సరళీకృతం చేశామన్నారు. పురపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఆన్లైన్ దరఖాస్తుల వి ధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
విశ్వనగరమే లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మారుస్తాం. అదే మా లక్ష్యం. ఇందుకోసం అడుగులు వేయడం ప్రారంభించాం. ఇప్పటికే పలు కార్యక్రమాలు ఊపందుకున్నాయి కూడా...’ అని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ఇప్పటికే డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక బస్షెల్టర్లు, పబ్లిక్ టాయ్లెట్లు తదితర అంశాల్లో మెరుగైన ప్రమాణాల కోసం అస్కిని, జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్ అంశాల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రముఖ కన్సల్టెంట్లను సంప్రదించినట్లు పేర్కొన్నారు. నగరాభివృద్ధి విషయంలో మంత్రి ప్రస్తావించిన మరికొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కట్టుబడి ఉన్నాం. 45 ప్రాంతాల్లో 19,577 ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. ఈ అంశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో భూ లభ్యతను సూచించాల్సిందిగా కోరాం. వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రూ.338.72 కోట్ల రుణానికి జీహెచ్ఎంసీకి అనుమతించాం. పారిశుధ్య ప్రమాణాలు పెంచడం మా మొదటి ప్రాధాన్యం. అందులో భాగంగా 44 లక్షల చెత్తడబ్బాల పంపిణీ చేపట్టాం. 13 ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లకు అదనంగా మరో 12 స్టేషన్లు ఏర్పాటయ్యాయి. అదనపు వాహనాల వల్ల గతంలో 3300 మెట్రిక్ టన్నుల చెత్త స్థానే ప్రస్తుతం 4500 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు సాధ్యమవుతోంది. భవనిర్మాణ వ్యర్థాల సేకరణకు నాలుగు డంపింగ్ యార్డుల ఏర్పాటు. సీ అండ్ డీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఎస్సార్డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్) పనుల్లో భాగంగా రూ. 2,631 కోట్లతో 20 జంక్షన్ల అభివృద్ధిపనులు. వీటిల్లో 18 పనులకు టెండర్లు పూర్తయి, 11 జంక్షన్ల పనులు జరుగుతున్నాయి. ఎనిమిది సిగ్నల్ ఫ్రీ కారిడార్ల నిర్మాణం, 100 కి.మీ.ల మేర ఫ్లై ఓవర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్లతో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం చేపడుతున్నాం.