సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ డిజిటల్ డోర్ నంబర్లు కేటాయించనున్నట్లు పురపా లకశాఖ సంచాలకులు టీకే శ్రీదేవి వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే సూర్యా పేట మున్సిపాలిటీలో దీన్ని ప్రారంభించామన్నారు.సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల క్రయావిక్రయాల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిపే సమయంలోనే స్థానిక మున్సిపాలిటీ రికార్డుల్లోనూ యజమాని పేరు మారేలా ఆటోమెటిక్ మ్యుటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అయితే కొన్ని ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న డోర్ నంబర్లతో ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రికార్డుల్లో ఒక నంబర్ ఉంటే క్షేత్రస్థాయిలో మరో నంబర్ ఉంటుండటంతో మ్యుటేషన్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కొత్తగా డిజిటల్ డోర్ నంబర్లు కేటాయిస్తున్నామన్నారు.
16 అంకెలతో డిజిటల్ డోర్ నంబర్లు...
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్‌ను పురపాలక శాఖ కేటాయించనుంది. ఈ 16 అంకెల్లో మూడు విభాగాలు ఉండనున్నాయి. నగరం/పట్టణాన్ని తెలిపేందుకు ఓ కోడ్, స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు మరో కోడ్ ఉండనుంది. ఈ మూడు కోడ్‌ల తర్వాత ప్రతి ఇంటికి ప్రత్యేక డోర్ నంబర్‌ను కేటాయించనున్నారు. డిజిటల్ డోర్ నంబర్ ఆధారంగా ఇళ్లు ఏ నగరం/పట్టణం, ఏ వార్డు/డివిజన్‌లో ఉన్నాయో తేలికగా కనుక్కునే విధంగా డిజిటల్ డోర్ నెంబర్ల సిరీస్ ఉండనుంది.
నిరాశ్రయులు, నిరుద్యోగుల కోసం రెండు యాప్‌లు
పురపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అర్బన్ దోస్త్, అర్బన్ జీనీ పేరుతో 2 కొత్త యాప్‌లను ప్రవేశపెట్టామని శ్రీదేవి వివరించారు. పట్టణాల్లో రోడ్లపై కనిపించే నిరాశ్రయులను గుర్తించి వారి ఫొటో, వివరాలను అర్బన్ దోస్త్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే స్థానిక మున్సిపాలిటీ అధికారులు అటువంటి వారికి ఆశ్రయం కల్పిస్తారన్నారు. జీవనోపాధి పథకాలు పొందాలనుకునే నిరుద్యోగులు అర్బన్ జీనీ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సాయం పొందవచ్చన్నారు.
23 రకాల పౌర సేవలు ఆన్‌లైన్‌లో...
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 23 రకాల పౌర సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని శ్రీదేవి తెలిపారు. 73 పురపాలికల పరిధి లో 12.5 లక్షల ఇళ్లను జియో ట్యాగింగ్ చేశామన్నారు. ఇంటి యజమాని ఎక్కడి నుంచైనా ఆస్తి పన్ను, ఇంటి ఫొటో తదితర వివరాలను పురపాలకశాఖ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. ఆస్తి న్యాయ వివాదంలో ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చని, ఆస్తుల క్రయవిక్రయాల సమయం లో ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. పట్టణాల్లో కొత్త వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ట్రేడ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను పూర్తిగా సరళీకృతం చేశామన్నారు. పురపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఆన్‌లైన్ దరఖాస్తుల వి ధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment