విశ్వనగరమే లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మారుస్తాం. అదే మా లక్ష్యం. ఇందుకోసం అడుగులు వేయడం ప్రారంభించాం. ఇప్పటికే పలు కార్యక్రమాలు ఊపందుకున్నాయి కూడా...’ అని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
మంగళవారం అసెంబ్లీలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ఇప్పటికే డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక బస్‌షెల్టర్లు, పబ్లిక్ టాయ్‌లెట్లు తదితర అంశాల్లో మెరుగైన ప్రమాణాల కోసం అస్కిని, జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్ అంశాల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రముఖ కన్సల్టెంట్లను సంప్రదించినట్లు పేర్కొన్నారు. నగరాభివృద్ధి విషయంలో మంత్రి ప్రస్తావించిన మరికొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
జీహెచ్‌ఎంసీలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కట్టుబడి ఉన్నాం. 45 ప్రాంతాల్లో 19,577 ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. ఈ అంశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో భూ లభ్యతను సూచించాల్సిందిగా కోరాం. వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రూ.338.72 కోట్ల రుణానికి జీహెచ్‌ఎంసీకి అనుమతించాం.
పారిశుధ్య ప్రమాణాలు పెంచడం మా మొదటి ప్రాధాన్యం. అందులో భాగంగా 44 లక్షల చెత్తడబ్బాల పంపిణీ చేపట్టాం. 13 ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లకు అదనంగా మరో 12 స్టేషన్లు ఏర్పాటయ్యాయి. అదనపు వాహనాల వల్ల గతంలో 3300 మెట్రిక్ టన్నుల చెత్త స్థానే ప్రస్తుతం 4500 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు సాధ్యమవుతోంది. భవనిర్మాణ వ్యర్థాల సేకరణకు నాలుగు డంపింగ్ యార్డుల ఏర్పాటు. సీ అండ్ డీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.
ఎస్సార్‌డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్) పనుల్లో భాగంగా రూ. 2,631 కోట్లతో 20 జంక్షన్ల అభివృద్ధిపనులు. వీటిల్లో 18 పనులకు టెండర్లు పూర్తయి, 11 జంక్షన్ల పనులు జరుగుతున్నాయి. ఎనిమిది సిగ్నల్ ఫ్రీ కారిడార్ల నిర్మాణం, 100 కి.మీ.ల మేర ఫ్లై ఓవర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్లతో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం చేపడుతున్నాం.