సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సుస్థిర మౌలిక వసతుల ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదనను భారత ప్రభుత్వమే విరమించుకుందని, దాంతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకోలేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం చేసిన వినతి మేరకే ఈ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గినట్లు పేర్కొంది. రాజధాని ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకపోయినా ఏపీలో కొత్త ప్రభుత్వానికి అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రిన్సిపల్ కమ్యూనికేషన్ అధికారి సుదీప్ మొజుందర్ పేరిట ఆదివారం బ్యాంకు వెబ్‌సైట్‌లో పత్రికా ప్రకటన విడుదలైంది.
ఏపీ ప్రభుత్వంతో సుదీర్ఘమైన భాగస్వామ్యం
అమరావతి ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలన్న విజ్ఞప్తిని ఈ నెల 15 తేదీన భారత ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఈ నేపథ్యంలో దీనిపై తాము ముందుకు వెళ్లలేమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు తెలిపిందని సుదీప్ మొజుందర్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తుల నిర్వహణ రంగాలను కవర్ చేసే ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. గత నెల 27వ తేదీన ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్య రంగంలో 328 మిలియన్ డాలర్ల కొత్త ఆర్థిక సహాయం కూడా ఇందులో కలిసి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో ప్రపంచ బ్యాంకుకు సుదీర్ఘమైన, ఫలవంతమైన భాగస్వామ్యం ఉందని ఆ ప్రకటనలో వివరించారు. వినూత్నమైన ఆవిష్కరణలు చేయడంలో ఏపీ ముందుందని ప్రశంసించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం రూపొందించుకున్న ప్రాధామ్యాలకు అనుగుణంగా వారికి కావాల్సిన సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం విజ్ఞప్తికి లోబడి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమరావతికి రుణం ఇచ్చే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకోలేదని, కేంద్ర ప్రభుత్వమే రుణ విజ్ఞప్తిని విరమించుకుందని సుదీప్ మొజుందర్ ‘సాక్షి’కి తెలిపారు.
రాజధానిలో ఉల్లంఘనల వల్లే ఆగిన రుణం
తమను చూసి రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఇదే పాట అందుకున్నారు. కానీ, స్వయంగా ప్రపంచ బ్యాంకే దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వడంతో చంద్రబాబు, ఆయన పరివారం చేస్తున్న ప్రచారంలోని డొల్లతనం తేటతెల్లమైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలిన ఎల్లో గ్యాంగ్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. వాస్తవానికి ఈ రుణం మంజూరు వ్యవహారం మూడేళ్లుగా పరిశీలన దశలోనే ఉంది. రుణం కచ్చితంగా వస్తుందనే గ్యారంటీ ఏ దశలోనూ లేకుండా పోయింది. చంద్రబాబు హాయంలో రాజధాని అమరావతి నిర్మాణంలో లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు జరిగాయని అక్కడి రైతులు, పర్యావరణవేత్తలు, మేధావులు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. వాటిపై ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందాలతో పలుమార్లు విచారణ జరిపించింది. ఉల్లంఘనలు నిజమేనని తన వెబ్‌సైట్‌లో తనిఖీ బృందం నివేదికలను ఉంచింది. చంద్రబాబు పాలనలో రాజధాని పేరిట జరిగిన అరాచకం వల్లే ఈ రుణం రావడం లేదని అప్పట్లోనే స్పష్టమైంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన హయాంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ మరచిపోయి ప్రపంచ బ్యాంకు రుణం రాకపోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ నిందలు వేయడం గమనార్హం.
రుణం వద్దన్నది భారత ప్రభుత్వమే
Published Mon, Jul 22 2019 2:59 AM | Last Updated on Mon, Jul 22 2019 8:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment