తుఫాన్ షెల్టర్లు సిద్ధం
- రూ.16.24 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో 16 భవనాల నిర్మాణం
- పూర్తి చేసిన భవనాలు తహశీల్దార్లకు అప్పగింత
- ప్రతి షెల్టర్‌కు సొసైటీ తప్పనిసరి
ఒంగోలు టూటౌన్ : జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తుఫాన్ షెల్టర్ల నిర్మాణం పూర్తయింది. తుఫాన్ల నుంచి తీరప్రాంత గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆధునిక వసతులతో వీటిని నిర్మించారు. రెండు దశల్లో తుఫాన్ షెల్టర్లు జిల్లాకు మంజూరయ్యాయి. 2011-13 ఆర్ధిక సంవత్సరంలో మొదటి దశ (ఫేజ్-1) మూడు తుఫాన్ షెల్టర్లు మంజూరవగా..2014-15 లో ఉలవపాడు మండలంలో ఐదు, కొత్తపట్నం మండలంలో ఆరు, చీరాల మండలంలో ఒక తుఫాన్ షెల్టర్‌తో కలిపి మొత్తం 12 మంజూరుయ్యాయి.
జాతీయ తుఫాన్ విపత్తు నివారణ పథకం కింద ప్రపంచ బ్యాంకు నిధులతో తుఫాన్ షెల్టర్ల నిర్మాణం పీఆర్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో చేపట్టారు. భవనం అంచనాలను బట్టి రూ.90 లక్షల నుంచి రూ.కోటి 10 లక్షల వరకు ఒక్కొక్క భవనానికి నిధులు కేటాయించారు. మొదటి విడతలో మంజూరైన తుఫాన్ షెల్టర్లు చాకిచర్ల, కనపర్తి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. పాకలలోతుఫాన్ షెల్టర్ ఇటీవల పూర్తయింది. రెండో విడతలో మంజూరైన చీరాల ఓడరేవు, కొత్తపట్నం మండలంలో కె. పల్లెపాలెం, మోటుమాల, పాదర్తి, రంగాయపాలెం, గవళ్లపాలెం, మడనూరు గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు పూర్తయ్యాయి.
అదే విధంగా ఉలవపాడు మండలంలో కరేడు గ్రామ పరిధిలో పెద్దపల్లెపాలెం, అలగాయపాలెం, కొత్తపల్లెపాలెం, గుడ్లూరు మండలంలోని మండవవారిపాలెం, సాలిపేట గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. సింగరాయకొండలోని పోతయ్యగారి పట్టపుపాలెంలో నిర్మించతలపెట్టిన తుఫాన్ షెల్టర్ మాత్రం స్థలం లేకపోవడం వలన ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం దానికి గ్రామస్తుల చొరవతో స్థల సేకరణ జరిగి..రెండు రోజుల క్రితం బిల్డింగ్ నిర్మాణానికి సిద్ధమైందని ఇంజినీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 16 తుఫాన్ షెల్టర్లలో 15 పూర్తయ్యాయి. ఒక్కటి మాత్రం ప్రస్తుతం పునాదులు పడే దశలో ఉంది. పూర్తయిన అన్ని తుఫాన్ షెల్టర్లను ఆయా మండలాల తహశీల్దార్లకు అప్పగించామని పీఐయు (పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ) ఈఈ యం.వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. మొత్తం తీర ప్రాంత గ్రామాల్లో 54 తుఫాన్ షెల్టర్లు ఉండగా వాటిలో కేవలం 24 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి.
సొసైటీలు ఏర్పాటులో నిర్లక్ష్యం
గ్రామస్తుల శుభకార్యాలకు నిత్యం ఉపయోగపడే లా ఆధునిక వసతులతో నగరాల్లో అపార్ట్‌మెంట్‌లను తలదన్నేలా కొత్త తుఫాన్ షెల్టర్లను నిర్మించారు. భవనం కింద ఖాళీ స్థలం, చుట్టూ కాంపౌండ్ వాల్, పార్కింగ్ వంటి సౌకర్యాలు ఉండేలా రూపకల్పన చేశారు. మనుషులకే కాకుండా పశువులు, మేకలు, గొర్రెలను రక్షించుకునేందుకు అనువుగా ఈ తుఫాన్ షెల్టర్ల నిర్మాణం జరిగింది.
ప్రతి తుఫాన్ షెల్టర్‌కు ఒక సొసైటీ ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. సొసైటీల ఏర్పాటు ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. గతంలో ఏర్పాటు చేసిన తుఫాన్ షెల్టర్లు నిత్యం వాడుకలో లేక నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుతుండటంతో ఈసారి కొత్త పంథాను ఎంచుకొని నిర్మించారు. ప్రతి తుఫాన్ షెల్టర్‌కు గ్రామస్థాయిలో సొసైటీ ఏర్పాటు చేయాలి. ఆ బాధ్యత ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. అయితే ఇప్పటి వరకు చాలా తుఫాన్ షెల్టర్లకు సొసైటీలు ఏర్పాటు చేయలేదని సమాచారం.