ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం  | AIIB loan is part of the World Bank | Sakshi
Sakshi News home page

ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం 

Published Thu, Jul 25 2019 5:20 AM | Last Updated on Thu, Jul 25 2019 5:20 AM

AIIB loan is part of the World Bank - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు(ఏఐఐబీ) సంయుక్తంగా రుణం మంజూరుకు ప్రతిపాదించాయని, గత టీడీపీ సర్కారు రాజధానిలో సాగించిన అవినీతి, అక్రమాల వల్ల రుణ మంజూరును ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకోవడంతో అందులో భాగంగానే ఏఐఐబీ కూడా అదే బాటలో నడిచిందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అమరావతికి రుణం మంజూరు ప్రతిపాదనను ఏఐఐబీ ఉపసంహరించుకుందంటూ కొన్ని పత్రికలు, ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పాయి. ఉపసంహరించుకున్న రుణాన్ని మరో కొత్త ప్రాజెక్టుకు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ ఆసక్తి కనబరుస్తోందని, ఇప్పటికే ఈ విషయాన్ని రెండు బ్యాంకుల ప్రతినిధులు తెలియజేశారని గుర్తుచేశాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం...  

ల్యాండ్‌ పూలింగ్‌ పారదర్శకంగా జరగలేదు  
ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు కాకుండానే గత టీడీపీ సర్కారు అమరావతిలో రహదారులు, వరద నియంత్రణకు సంబంధించి ఏడు ప్యాకేజీలకు టెండర్లను ఖరారు చేసింది. ఆ టెండర్లలో పాల్గొన్న సంస్థలన్నీ కుమ్మక్కైనట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతోపాటు రాజధాని పేరుతో టీడీపీ సర్కారు చేసిన ల్యాండ్‌ పూలింగ్‌ పారదర్శకంగా జరగలేదని తేల్చారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను తీసుకోవడంతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అమరావతిలో వ్యవసాయ కూలీల జీవనోపాధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రపంచ బ్యాంకు స్వతంత్ర బృందం తనిఖీల్లో వెల్లడైంది. అమరావతి ప్రాజెక్టుపై మరింత లోతుగా తనిఖీలు నిర్వహించాలని ప్రపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌ ప్రపంచ బ్యాంకుకు సూచించింది. దీంతో ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.  

ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే...  
రుణం మంజూరు చేయకుండానే దేశంలో ఎక్కడా తనిఖీలు, దర్యాప్తులు జరగలేదని, ఇందుకు అనుమతిస్తే దేశంతో పాటు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు ప్రతిపాదనను మాత్రమే ఉపసంహరించుకోవాలని సూచించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులకు రుణం మంజూరు చేశాయని, ఆ రుణాన్ని ఖర్చు చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆ సంస్థల ప్రతినిధులు ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తామని కొత్త ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టులో భాగంగా 140 మిలియన్‌ డాలర్లను ఏఐఐబీ ఇదివరకే మంజూరు చేసిందని, గ్రామీణ రహదారులకు 400 మిలియన్‌ డాలర్లు, పట్టణాల్లో పారిశుధ్య ప్రాజెక్టుకు మరో 400 మిలియన్‌ డాలర్లు.. మొత్తం 940 మిలియన్‌ డాలర్ల మేర రుణాన్ని మంజూరు చేసిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేశాయి. 

కాంట్రాక్టు సంస్థల కుమ్మక్కుపై విచారణ
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు కొసాగిస్తామని ఏఐఐబీ ఉపాధ్యక్షుడు ఇప్పటికే హామీ ఇచ్చారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ సీఎం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, సంబంధిత రంగాలకు సంబంధించి రుణ ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని పేర్కొన్నాయి. 2031 నాటికి పట్టణ జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు సదుపాయాలు కల్పించాల్సి ఉందని, దీనిపై దృష్టి సారించామని అధికార వర్గాలు తెలియజేశాయి. అమరావతి ప్రాజెక్టులో భాగంగా ఏడు ప్యాకేజీ పనుల విషయంలో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement