‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు  | TDP government irregularities also In the poor people houses | Sakshi
Sakshi News home page

అవినీతి ‘అడుగు’లు

Published Sun, Sep 29 2019 3:56 AM | Last Updated on Sun, Sep 29 2019 10:14 AM

TDP government irregularities also In the poor people houses - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా పోలవరం నుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో ఎలా దోపిడీకి పాల్పడ్డారో ‘రివర్స్‌’ టెండరింగ్‌ ద్వారా రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే చూశారు. అన్నిట్లోనూ అందినకాడికి కాజేసిన టీడీపీ పెద్దలు పేదల ఇళ్లను కూడా వదల్లేదు. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.650కి మించని పట్టణ పేదల ఇళ్లను కమీషన్ల కోసం రూ.2,000కిపైగా పెంచేయడంతో ఖజానాకు రూ.4,930 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. ప్రతి చ.అడుగులో రూ.1,350 చొప్పున కాజేసినట్లు తేటతెల్లమవుతోంది. విశాఖ జిల్లాలో హుద్‌ హుద్‌ బాధితుల కోసం 800 ఇళ్ల నిర్మాణానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1,06,687 చొప్పున టెండర్లు పిలవగా టీడీపీ హయాంలో అంతే విస్తీర్ణంలోని ఇవే గృహాలకు ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6.40 లక్షల నుంచి రూ.8.70 లక్షలుగా నిర్థారించడం గమనార్హం. ఇంత భారీ వ్యత్యాసం ఉండటాన్ని బట్టి పేదల ఇళ్ల నిర్మాణాల్లో గత సర్కారు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఖజానాకు ఆదా...పేదలకు గృహ యోగం
పేదల గృహ నిర్మాణం పేరుతో గత సర్కారు చదరపు అడుగు వ్యయం రూ.2,000కిపైగా నిర్ణయించగా ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అంతే విస్తీర్ణానికి కేవలం రూ.650 చొప్పున ధర ఖరారు చేసి టెండర్లు కూడా అహ్వానించడం గమనార్హం. అంటే ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి ధరలో ఉన్న వ్యత్యాసం రూ.1,350కిపైనే. ఖజానాకు డబ్బులు ఆదా కావడంతోపాటు పేదలకు ఉచితంగా ఇళ్లు అందుతాయి. ఇక్కడ గమనించాల్సిన మరో కీలక అంశం.. నిర్మాణ విధానంలో మార్పులేదు, విస్తీర్ణంలో తేడా లేదు. ఉన్న తేడా అంతా ఒక్కటే... ప్రభుత్వం మారడం.  

‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు 
విశాఖపట్టణంలో ఐదేళ్ల క్రితం హుద్‌హుద్‌ తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులకు చంద్రబాబు సర్కారు నాలుగున్నరేళ్లలో పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బాధితుల కోసం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గత సర్కారు షేర్‌వాల్‌ టెక్నాలజీ పేరుతో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేయడమే కాకుండా ఒక్కో పేద కుటుంబంపై రూ. మూడు లక్షలకుపైగా అప్పుల భారాన్ని మోపింది. చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.2,000కిపైగా పెంచేసింది. తద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో టీడీపీ సర్కారు దోపిడీని గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు సర్కారు మోపిన అప్పుల భారం నుంచి పేదలను బయటపడేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలు, అవినీతిని నిపుణుల కమిటీ ఇటీవల వెల్లడించింది. పట్టణ పేదల ఇళ్లలో ఏకంగా రూ.4,930 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు నిపుణుల కమిటీ తేల్చింది.

పేదలపై రూ.17,730.88 కోట్ల భారం
టీడీపీ సర్కారు హయాంలో షేర్‌వాల్‌ టెక్నాలజీ పేరుతో పట్టణ ప్రాంత పేదల ఇళ్ల నిర్మాణాన్ని చదరపు అడుగుకు రూ.2,000కిపైగా నిర్ణయించి అంచనాలను భారీగా పెంచేశారు. 300 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయం రూ.6.40 లక్షలుగా నిర్ణయించారు. 365 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.7.60 లక్షలుగా పేర్కొన్నారు. 430 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.8.70 లక్షలుగా గత సర్కారు ఖరారు చేసింది. జీ ప్లస్‌ 3 పేరుతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పట్టణ పేదల ఇళ్ల లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల అప్పుల భారాన్ని చంద్రబాబు సర్కారు మోపింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు హామీ ఇచ్చిన ప్రకారం వారిని అప్పుల నుంచి బయటపడేసింది.

నాడు రూ.8.70 లక్షలు.. నేడు రూ.1,06,687
విశాఖ జిల్లాలో హుదూద్‌ బాధితుల కోసం కమ్మాడిలో సర్వే నెంబర్‌ 83లో 608 ఇళ్లను జీ ప్లస్‌ 3 విధానంలో 354 చదరపు అడుగుల్లో నిర్మించాలని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జిల్లాలోని పరదేశిపాలెంలో సర్వే నెంబర్‌ 21లో జీ ప్లస్‌ 3 విధానంలో 192 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించింది. మొత్తం 800 ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 8,53,50,387 గా నిర్ధారించారు. చదరపు అడుగుకు నిర్మాణ వ్యయాన్ని రూ.650 చొప్పున నిర్ణయించారు. ఒక్కోఇంటి నిర్మాణ వ్యయం రూ.1,06,687గా పేర్కొన్నారు. గత సర్కారు ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6.40 లక్షల నుంచి రూ.8.70 లక్షలుగా నిర్ణయిస్తే ఇప్పుడు అంతే విస్తీర్ణంలో ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.1,06,687గా నిర్ధారించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement