షామియానా వేసినందుకు వేధిస్తున్నారు!
గుంటూరు జిల్లా మల్కాపురం గ్రామంలో తన పర్యటన సందర్భంగా తన పొలంలో షామియానా, కుర్చీలు వేసినందుకు బాధిత రైతు గద్దె చంద్రశేఖర్ పోలీసు వేధింపులకు గురవుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన మేనల్లుడిని డీఎస్పీ పిలిచారంటూ కొందరు కానిస్టేబుళ్లు వచ్చి జీపు ఎక్కాలంటున్నారని స్వయంగా రైతు చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లాలో రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం గ్రామంలో జరిగిన సభకు గద్దె చంద్రశేఖర్ వచ్చి తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, వైఎస్ జగన్ ఏం మాట్లాడారో చూద్దాం..
చంద్రశేఖర్: మా మేనల్లుడు సురేష్ అక్కడే మల్కాపురం పొలం దగ్గరే ఉన్నాడు. కానిస్టేబుళ్లు వచ్చి డీఎస్పీగారు తీసుకురమ్మన్నారని, జీపు ఎక్కాలని అంటున్నారు
వైఎస్ జగన్: డీఎస్పీ ఎందుకు రమ్మని అడిగారు? మీరు చేసిన తప్పల్లా.. వాళ్లు తగలబెట్టిన మీ పొలంలో షామియానా వేసి, జరిగిన అన్యాయాన్ని తెలియజేయడమే.. ఆ అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడమే. మీ పొలంలో మీరు షామియానా వేసుకోవడం కంటే ఏమీ చేయలేదు. కానీ డీఎస్పీ మాత్రం స్టేషన్‌కు పిలిపిస్తున్నారు.
చంద్రశేఖర్: షామియానాలు వేసినవాళ్లు, కుర్చీలు వేసినవాళ్లను తీసుకురమ్మన్నారు. గతంలోకూడా ఇలాగే జరిగింది.. పోలీసులు రెండెకరాలు ఉన్న ఓ వ్యక్తిని నరసరావుపేట వరకు తీసుకెళ్లి కేసులు పెట్టి నానా గొడవ చేశారు. అదే ప్రతాపం మా మీద కూడా చూపించబోతున్నారు
వైఎస్ జగన్: ఇంతకన్నా అన్యాయం ఇంతకన్నా ఏమైనా ఉంటుందా? గద్దె చంద్రశేఖర్ తండ్రి రత్తయ్య గారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి వ్యక్తి పరిస్థితే ఇంత దారుణంగా ఉంది. ఆయన చేతికి అందిన చెరుకు పంట రాకుండా చేశారు. అన్యాయం జరిగిందని చెప్పినందుకు ఇలా అంటున్నారు. చంద్రశేఖర్‌తో పాటు, భూములు పోగొట్టుకున్న వాళ్లందరి ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. వీళ్లందరి తరఫున తప్పకుండా పోరాడదాం.. డీఎస్పీ మీద కూడా పరువు నష్టం దావా వేస్తాం
చంద్రశేఖర్: మీకు ఓటు వేయకపోయినా.. వచ్చినందుకు, సాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు