సాక్షి, హైదరాబాద్ : రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి, మాజీమంత్రి పార్థసారధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల వద్ద నుంచి వేల ఎకరాలు భూములు తీసుకుని ఇంతవరకూ ఎలాంటి నిర్మాణాలు చేయలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వడానికి నిరాకరించిన రైతుపై టీడీపీ నేతలు, అధికారులు, పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంజమన్న ఆయన ... కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందనే సంగతి మీకు తెలియదా చంద్రబాబూ అని ప్రశ్నించారు.
రైతు గద్దె మీరాప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు దాన్ని ఉల్లంఘించారన్నారు. నిర్మాణాలను అడ్డుకోవడానికి వెళ్లిన రైతు బట్టలు ఊడదీసి దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుతం రాక్షస పాలన కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పాలన అయితే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సేకరించిన 33 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిల్లో 2,3 వందల్లో మాత్రమే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టారన్నారు. మిగిలిన భూముల్లో టీడీపీ ఎమ్మెల్యే లారీల్లో తన గేదెలను తీసుకువచ్చి మేపుకున్న దుస్థితి నెలకొందన్నారు.
చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు మంత్రులు అండతో ప్రజలపై హింసకు దిగుతున్నారని పార్థసారధి మండిపడ్డారు. తమ భూమి ఇవ్వనని స్పష్టంగా చెప్పిన రైతుపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసులు, నిర్మాణాలు చేపట్టిన అధికారులు, వారి వెనుక ఉన్నవారిపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment