రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాల్సిందే | commercial plots have to be given to farmers, demands mla rk | Sakshi
Sakshi News home page

రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాల్సిందే

Published Wed, Jun 22 2016 1:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాల్సిందే - Sakshi

రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వాణిజ్య, నివాస ప్లాట్లు ఇస్తామని అప్పట్లో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్న 1500 ఎకరాలలో రాజధానికి భూములిచ్చిన రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇస్తున్నారో లేదో చెప్పాలని, కచ్చితంగా కేటాయించి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టి, తెల్ల కాగితాల మీద నెంబర్లు వేసి తూతూమంత్రంగా కొంతమందికి ఇచ్చారని, తర్వాత వర్షం వస్తోందని వాయిదా వేశామంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే మాయమాటలను అందరూ నమ్మి మోసపోయారని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం - ప్రైవేటు భాగస్వామ్యం లాంటి ఒప్పందాలు జరిగితే హక్కుదారుడికి ఎక్కువ వాటా, వ్యాపారులకు తక్కువ వాటా ఇస్తారని.. కానీ ఇక్కడ మాత్రం 58 శాతం విదేశీ కంపెనీలకు, కేవలం 42 శాతం మాత్రం సీఆర్డీఏ వాళ్లకు ఇస్తామంటున్నారని, ఇలా జరగడం ఏంటని ప్రశ్నించారు. ఆ 58 శాతంలో కొంత మళ్లీ వాళ్లు ఎప్పుడైనా, ఎవరికైనా ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చని కొత్త సిద్ధాంతం చెబుతున్నారని... ఇలాంటిది ఎక్కడా లేదని తెలిపారు.

ఇక చంద్రబాబు పదే పదే చెబుతున్న స్విస్ ఛాలెంజ్ ఏంటనేది ఎవరికీ తెలియట్లేదని ఆర్కే అన్నారు. 2015 డిసెంబర్ నెలలో కేంద్రం ఈ స్విస్ చాలెంజ్ మీద కేల్కర్ కమిటీ వేసిందని, ఆ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించి చాలా స్పష్టంగా కేంద్రానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. స్విస్ చాలెంజ్ పద్ధతి సరికాదని, అలా ఎవరూ చేయొద్దని అది దేశానికి, రాష్ట్రానికి, అందరికీ నష్టమేనని కేల్కర్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే చంద్రబాబు ఆదేశాలిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం స్విస్ ఛాలెంజ్ ఒప్పందాల మీద సంతకం చేయలేదని ఆర్కే అన్నారు.

ఇక చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెరతీశారని, సాధారణంగా కింద నుంచి పైకి ఫైళ్లు వెళ్లాలి కానీ, ఈయనే ముందు సంతకం చేసి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపుతున్నారని, ఆమాత్రం దానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు.. అన్నిపోస్టులూ ఆయనే తీసుకుంటే పోలా అని ఎద్దేవా చేశారు. ఎన్నో శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం.. రాజధాని మీద కూడా శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములు ఇవ్వని రైతుల మీద కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని, వాళ్ల పొలాలను టార్గెట్ గా చేసుకుని ఎక్స్ప్రెస్ హైవేను డిజైన్ చేశారని, ఇది ఎంతమాత్రం తగదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement