'సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కు సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించారు.
ఈ సందర్బంగా వైఎస్ జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ఇక్కడ నీళ్లు ఇస్తానంటాడు.. అక్కడ నీళ్లు ఇస్తానంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సీమ ప్రజల కష్టాలు తీరుస్తానంటూ బాబు చెప్పే మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. గాలేరు - నగరి ప్రాజెక్టు గోవింద అవుతుదేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు నిరర్థక ఆస్తులగా మారతాయని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం ఉండదన్నారు.
పట్టిసీమ ప్రాజెక్ట్ను గోదావరి, కృష్ణా డెల్టా రైతులు వ్యతిరేకిస్తున్నారని మైసూరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేయాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టులన్నీ చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పోలవరం కట్టండి... పట్టిసీమను ఆపండి... రాయలసీమను ఆదుకోండి అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.