ఈ పోరాటం ఆగదు: వైఎస్ జగన్
చిత్తూరు: టి. బిల్లును ఢిల్లీకి తిప్పిపంపినా విభజనపై పోరాటం ఆగిపోదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిస్తూ చేపట్టిన సమైక్య శంఖారావంలో భాగంగా చంద్రగిరి సభలో ప్రసంగించిన జగన్.. విభజన బిల్లుపై అసెంబ్లీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ పోరాటమే కారణమన్నారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని జగన్ తెలిపారు. పార్లమెంటుకు బిల్లు పంపొద్దని ఆయన్ను కోరతామని వైఎస్ జగన్ అన్నారు.
రాష్ట్రపతిని ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాబోయో ఎన్నికల్లో మనమంతా ఒక్కటై 30 స్థానాలు తెచ్చుకున్నాక రాష్ట్రాన్ని విభజించే దమ్ము, ధైర్యం ఎవ్వరికి ఉండదన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడతామని అన్నారు. సోనియా గాంధీతో చంద్రబాబు కుమ్మక్కై ప్యాకేజీ లు అడుగుతున్నారని జగన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా ఓడించాలని వైఎస్ జగన్ చెప్పారు.