‘ఓట్ ఫర్ జగన్’
మొబైల్ యాప్ ఆవిష్కరణ
12 అంశాలతో అధునాతన అప్లికేషన్
హైదరాబాద్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైఎస్సార్‌సీపీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లకు ప్రత్యేకమైన అప్లికేషన్‌ను రూపొందించింది. ఆ పార్టీ ఐటీ విభాగం రూపొందించిన ‘ఓట్ ఫర్ జగన్’ మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి బుధవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ అప్లికేషన్‌లో పార్టీ మేనిఫెస్టోతో పాటు వైఎస్‌ఆర్ సీపీ రూల్స్, పర్యటనల ప్రణాళిక, అభ్యర్థుల ప్రొఫైల్స్, వీడియోలు, రింగ్‌టోన్లు, వాల్‌పేపర్లు, సభ్యత్వ నమోదు, ఈవీఎం డెమో, ఫేస్‌బుక్, సూచనలు, పార్టీని సంప్రదించడం లాంటి మొత్తం 12 అంశాలను పొందుపరిచారు.
ఈ అప్లికేషన్‌ను ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా పార్టీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఫేస్‌బుక్, వీడియోలు, టూర్ షెడ్యూల్ మినహా మిగతా అంశాలను ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన మాచినేని కిరణ్‌కుమార్‌ను మైసూరారెడ్డి అభినందించారు. పార్టీ లక్ష్యాలను మరింత విస్తృతంగా గడప గడపకు తీసుకెళ్లడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మైసూరా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, నారు మహేష్, దేవేంద్ర, జయరామ్, హర్షవర్ధన్‌రెడ్డి, కేతు మాల్యాద్రి, గోపినాథ్, ఆదిత్య, బ్రహ్మారెడ్డి, శ్రీవర్ధన్, కోటిరెడ్డి, పలువురు ఐటీ నిపుణులు పాల్గొన్నారు.