ఉద్యమాన్ని నీరుగార్చేలా సీఎం వ్యవహరిస్తున్నారు: ఎం.వి.మైసూరా రెడ్డి
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చేలా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వి.మైసూరా రెడ్డి విమర్శించారు. 74 రోజుల నుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని అన్నారు. సమైక్యవాదినని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి ఉద్యోగుల ఆందోళనల్ని పట్టించుకోవడంలేదని మైసూరా రెడ్డి చెప్పారు. కిరణ్కుమార్ రెడ్డి తీరు ఏమాత్రం బాగాలేదని ఆక్షేపించారు.
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని మైసూరా రెడ్డి ఆరోపించారు. ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'సమైక్య శంఖారావం' సభను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించినా హైకోర్టు మంజూరు చేసింది.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్లో సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు సమన్యాయం పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం రమేష్ ఢిల్లీలో పథక రచన చేశారని, అందులో భాగంగానే సమన్యాయం అంటూ ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీక్ష చేశారని మైసూరా రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు కూడా ఢిల్లీ పెద్దల ఆదేశాలమేరకే నడుచుకుంటున్నారని విమర్శించారు.