భుక్తిపోరు
ఎర్రగుంట్ల:
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో 600 మెగావాట్ల ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు సోమవారం ఆర్టీపీపీని ముట్టడించారు. తమకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కదలి వచ్చారు.
ప్రాజెక్టు గేటు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గేట్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య, వైస్ ఛైర్మన్ సుభాష్‌రెడ్డిలతో పాటు కౌన్సిలర్లు కూడా ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సీఐ పీటీ కేశవరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి ఏపీ జెన్‌కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు భూ నిర్వాసితులు, నాయకులు కొందరు రావాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ డెరెక్టర్, సీఈ ఇక్కడికే వచ్చి నేరుగా భూ నిర్వాసితులతో చర్చలు జరపాలని కోరారు. ఎస్‌ఈ శేషారెడ్డి వచ్చి భూ నిర్వాసితులు చర్చలకు రావాలని విన్నవించడంతో సీఈ ఛాంబర్‌లో చర్చలు జరిపారు.
ఏపీ జెన్‌కో డెరైక్టర్‌తో చర్చలు
ఏపీ జెన్‌కో డెరైక్టర్‌తో జరిగిన చర్చల్లో సుధీర్‌రెడ్డి, శివనారాయణరెడ్డిలతో పాటు భూ నిర్వాసితులు, మహిళలు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన వారిందరికి ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన భూ నిర్వాసితులకు 95 ఉద్యోగాలు ఇస్తామని డెరైక్టర్ వైవీ రావు హామీ ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు.
పది రోజుల్లో జాబితాను విడుదల చేస్తామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. మళ్లీ నిరసనలు చేయమని భూ నిర్వాసితులు హామీ ఇవ్వాలని డెరైక్టర్ కోరారు. కాగా తమకు చెప్పిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని, మాట తప్పితే మళ్లీ ఉద్యమ బాట పడతామని భూ నిర్వాసితులు హెచ్చరించారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా..
‘ఆర్టీపీపీ అధికారులు మా భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం అడుక్కునే పరిస్థితి కల్పించారు’ అని భూ నిర్వాసితుడు సునీల్ వాపోయారు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తుండగా అక్కడున్న వారు అడ్డుకున్నారు.
తిప్పుకుంటున్నారు..
‘మొదట్లో భూములు తీసుకునేటప్పుడు మమ్మల్ని నమ్మించారు. ఇప్పుడేమో మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు’ అని భూ నిర్వాసిత మహిళ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీపీపీ అధికారులు భూములు తీసుకుని తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇవ్వడం దారుణమన్నారు.