అవార్డు అందుకుంటున్న పార్వతీపురం ఏఎస్పీ దీపికా పాటిల్
విజయనగరం టౌన్: కేసుల దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వహించే దర్యాప్తు అధికారులకు రాష్ట్ర డీజీపీ ఇచ్చే ‘ఏబీసీడీ’ ( అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్) అవార్డులు విజయనగరం ఎస్పీ జి.పాలరాజు, పార్వతీపురం ఏఎస్పీ ఎమ్.దీపికా పాటిల్, పార్వతీపురం సీఐ జి.రాంబాబు, మక్కువ ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్, కానిస్టేబుల్ శంకరరావులకు లభించాయి.
శాంతిభద్రతలను పరిరక్షించడంలో సమయానుకూలంగా స్పందించిన విజయనగరం రూరల్ ఎస్‌ఐ పి.రామకృష్ణ, పాచిపెంట ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడులకు పురస్కారాలు లభించాయి. డీజీపీ ఎమ్.మాలకొండయ్య చేతుల మీదుగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఈ అవార్డులను జిల్లా పోలీస్ అధికారులు గురువారం స్వీకరించారు.
పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకంగా భావించే ఏబీసీడీ అవార్డులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసినందుకు మరో రెండు అవార్డులుతో మొత్తం ఏడు అవార్డులు రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లాకు మాత్రమే లభించడం విశేషం.
అవార్డుకు ఎంపికైన వివరాలిలా...
2018 ఏప్రిల్ ఏడో తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో గరుగుబిల్లి మండలం ఐటీడీఎ పార్కు సమీపంలో బంగారు ఆభరణాల కోసం తన భర్త యామక గౌరీశంకరరావును గుర్తు తెలియని దుండగలు హత్య చేసి, బంగారు ఆభరణాలు దోచుకుని పోయినట్లుగా యామక సరస్వతి అనే వివాహిత ఫిర్యాదు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్పీ జి.పాలరాజు, పార్వతీపురం ఎఎస్పీ ఎమ్.దీపికా పాటిల్, పార్వతీపురం సీఐ జి.రాంబాబులను రాష్ట్ర డీజీపీ ఎమ్.మాలకొండయ్య ఏబీసీడీ అవార్డులకు ఎంపిక చేశారు.
2017 సెప్టెంబరు 18న చిటికిల రమణమ్మ అనే వివాహిత కనిపించడం లేదని ఆమె భర్త చిటికిల నర్సింహనాయుడు మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదైంది. ఈ కేసు మిస్టరీని చేధించిన మక్కువ ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్, అతనికి సహాయకారిగా వ్యవహరించిన కానిస్టేబుల్ శంకరరావులను ఏబీసీడీ అవార్డుకు ఎంపిక చేశారు.
∙పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో శాంతిభద్రతలు నెలకొనడంలో కృషి చేసిన పాచిపెంట ఎస్‌ఐ సన్యాసినాయుడుకు ప్రశంసాపత్రం, నగదు రివార్డును అందజేశారు.
విజయనగరం మండలం కోరుకొండ గ్రామంలో 2018 మార్చి 25న ఎస్సీలు, బీసీల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో సమాచారం అందుకొని తక్షణమే చేరుకొని శాంతిభద్రతలను కాపాడినందుకు విజయనగరం రూరల్ ఎస్‌ఐ పి.రామకృష్ణకు ప్రశంసాపత్రాన్ని, నగదు రివార్డును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment