చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాల ఘటనలతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కఠిన శిక్షల అమలుకు కేంద్రం నడుం బిగించింది. కఠువా, సూరత్‌లో బాలికలపై అత్యాచారం, హత్యల పరంపరతోపాటు ఉన్నావ్‌లో బాలికపై అత్యాచార ఘటన నేపథ్యంలో మానవ మృగాళ్లకు మరణ దండనే ఖాయంగా అత్యవసర ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అయినా గంటల వ్యవధిలో జిల్లాలో దారుణాలు జరిగాయి. జరుగుతున్నాయి. చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షలపై ముఖ్యంగా యువకుల తల్లిదండ్రులు, యువతను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని జనాభిప్రాయం వ్యక్తమవుతోంది.
గూడూరు: 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడికడితే.. వారికి మరణ శిక్ష విధించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఇలా ఆ ఆర్డినెన్స్ జారీ అయిన కొన్ని గంటల్లోనే గూడూరు మండలం చెన్నూరులో ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు టీవీల్లో వార్తలు రావడంతో జిల్లాతో పాటు రాష్ట్రం ఉలిక్కి పడింది. ఆ ఆరేళ్ల చిన్నారి ఇంటికి సమీపంలో ఓ టీచర్ ట్యూషన్ చెబుతోంది. రోజూ ఆ చిన్నారి ఆ టీచర్ వద్దకు ట్యూషన్ చెప్పించుకునేందుకు వెళ్లే ది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 21వ తేదీన ట్యూషన్‌కు వెళ్లడం, ఆ సమయంలో టీచర్ లేకపోవడంతో, అక్కడే ఉన్న బీటెక్ చదువుతున్న ఆమె కుమారుడు ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన యువకుడికి మరణ దండన ఖాయమని అందరూ నిర్ధారణకు వచ్చారు. నిందితుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. దీంతో అతని వయస్సును సర్టిఫికెట్ల ఆధారంగా పరిశీలించగా, 17 ఏళ్ల 6 నెలలుగా నిర్ధారించారు. దీంతో ఈ ఘటనను హీనస్ క్రైంగా తీసుకుని జువైనల్ కోర్టులో నిందితుడి హాజరు పరిచారు. అయితే ఈ కేసులో నిందితుడిపై ఎలాంటి చర్య తీసుకుంటారో ఆర్డినేషన్స్ నిబంధనలను అనుసరించి ఉంటాయి.
అత్యాచారం కేసులపై చట్టంలో చేసిన మార్పులు
తాజా ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే కనిష్టంగా 20 ఏళ్లు జైలు, గరిష్టంగా మరణించే వరకూ జైలు లేదా మరణ శిక్ష అమలు చేసేలా చట్టంలో మార్పు చేశారు. 12 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడితే మరణించే వరకూ జైలు శిక్ష, లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనిష్టంగా 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు శిక్ష పెంపు. గరిష్టంగా మరణించే వరకూ జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగితే మరణించే వరకూ జైలు శిక్షే. మహిళలపై అత్యాచారానికి 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు శిక్ష పెంపు, లేదా గరిష్టంగా జీవిత ఖైదు కూడా. దర్యాప్తు పూర్తి చేసేందుకు 2 నెలలు, కోర్టు విచారణకు 2 నెలలు, శిక్షపై అప్పీళ్ల పరిష్కారానికి 6 నెలలు.
అవగాహన సదస్సుల ఆవశ్యకత
సభ్య సమాజం తలదించుకునేలా పసికూనలపై అత్యాచారాలకు ఒడిగడుతున్న మృగాలపై చట్టం తీసుకునే కఠిన చర్యలపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. ఘటన జరిగిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుం టామని, అవగాహనతోనే ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టొచ్చని అధికారులు ఉపన్యాసాలు ఇస్తున్నారేగానీ ఆ దిశగా కార్యరూపం దాల్చిన పరిస్థితి కానరావట్లేదని ఆరోపణలు సైతం లేకపోలేదు.
మైనర్ అయితే జీవిత ఖైదు!
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు (17) కన్నేశాడు. గత నెల 30వ తేదీ ఆడుకుంటూ తన ఇంటికి వచ్చిన చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని నమ్మబలికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తెరవడంతో నిందితుడు పరారయ్యా డు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 5వ తేదీ నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడూ మైనర్ కావడంతో జువైనల్ కోర్టుకు తరలించారు. అక్కడ నుంచి రెండు వారాల రిమాండ్ విధించడంతో హోంలో ఉన్నాడు. తాజాగా అత్యాచారాల ఘటనపై కేంద్ర జారీ చేసిన ఆర్డి నెన్స్ తర్వాత జరిగిన ఈ కేసు కావడంతో నిందితుడికి ఎటువంటి శిక్ష విధిస్తారోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై మేజర్లు అయితే మరణశిక్ష, మైనర్లు అయితే జీవిత ఖైదు విధిస్తారని సమాచారం. అయితే మైనర్లకు విధించి శిక్షపై స్పష్టంగా తెలియదని పోలీస్ అధికారులే చెబుతున్నారు.
జువైనల్ కోర్టుకు తరలించాం
మైనర్‌పై అత్యాచారం చేసిన బాలుడిని జువైనల్ కోర్టుకు తరలిం చాం. రెండు వారా ల రిమాండ్ విధించారు. జువైనల్ హోంలో ఉన్నాడు. కోర్టులో కేసు విచారణ ముగిసే సమయంలో తీర్పు ప్రకారం మరణ శిక్ష విధించవచ్చు లేదా జీవితఖైదు వేయవచ్చు. – టీవీ సుబ్బారావు, సీఐ, బుచ్చిరెడ్డిపాళెం
కఠిన శిక్షలపై సదస్సులు ఏర్పాటు చేస్తాం
కఠినమైన ఫోక్స్ యాక్ట్ చట్టాలపై అవగాహన కల్పించే దిశగా కళాశాల్లో త్వరలో సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఇటీవల ముఖ్య పట్టణాల్లో ర్యాలీ కూడా నిర్వహించాం. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఆ చట్టాలు, కఠిన శిక్షల తీవ్రతను చెబుతూ వారికి అవగాహన కల్పించాలి.
–వీఎస్ రాంబాబు, డీఎస్పీ, గూడూరు
Comments
Please login to add a commentAdd a comment