
సాక్షి, విజయవాడ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంపై మంగళవారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పీడబ్ల్యూ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్లాస్టిక్ నిషేందించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని, ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరాలు, పట్టణాలు, కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించామని తెలిపారు. ప్రజల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ను నిషేదించాలని సూచించారు.. మానవ జీవితంలో ఒక భాగంగా మారిన ప్లాస్టిక్ అనేక సమస్యలకు కారణం అవుతుందని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ నినాదంతో గాంధీ జయంతిని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు నగర పాలక సంస్థ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment