థైరాయిడ్‌ టెర్రర్‌ | Awareness on Thyroid Disease | Sakshi
Sakshi News home page

థైరాయిడ్‌ టెర్రర్‌

Published Sat, May 25 2019 9:00 AM | Last Updated on Sat, May 25 2019 9:32 AM

Awareness on Thyroid Disease - Sakshi

బిడ్డకు ఐదేళ్ల వయస్సు వచ్చినా మరీ చిన్నపిల్ల వాడిలాగా కనిపించడం.. ఎంత తిన్నా లావు అవ్వడం లేదని భావించిన గుంటూరు అరండల్‌పేటకు చెందిన కిశోర్, సుజాత దంపతులు ఇటీవల వైద్యుల్ని సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు  థైరాయిడ్‌ వ్యాధికి గురైనట్లు నిర్ధారణ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఒక్కగానొక్క బిడ్డకు ఈ వ్యాధి ఎలా వచ్చిందో అర్థంగాక తలలు పట్టుకున్నారు.

తుళ్లూరుకు చెందిన రజనీకి ఏడాది కిందట పెళ్లయింది. ఇటీవల గర్భం ధరించడంతో బరువు పెరగసాగింది. కడుపులో బిడ్డ ఉండటం వల్ల, అధికంగా పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతూ ఉండొచ్చని తల్లిదండ్రులు భావించారు. కాన్పు సమయంలో గుంటూరులోని స్పెషాలిటీ వైద్యుల్ని సంప్రదించగా    థైరాయిడ్‌ వ్యాధికి గురైనట్లు రిపోర్టు రావడంతో గాబరా పడ్డారు.

ఇలాంటి బాధలతో ఎంతో మంది ప్రతి రోజూ వైద్యం కోసం వస్తున్నారని, థైరాయిడ్‌ గ్రంథిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోలేక అవస్థలు పడుతున్నట్లు ఎండోక్రైనాలజిస్ట్‌లు తెలిపారు.   శరీర జీవక్రియల్ని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్‌. మనిషి వికాస క్రమంలో థైరాక్సిన్‌ హార్మోన్‌ పాత్ర ఎంతో కీలకమైంది. అయితే, ప్రస్తుతం పుట్టిన బిడ్డ నుంచి తొంభై ఏళ్ల వయస్సు వారికి సైతం థైరాయిడ్‌ వ్యాధి సోకుతూ టెర్రర్‌ పుట్టిస్తోంది. మనిషిని మానసికంగా, శారీరకంగా కుంగదీసే ఈ వ్యాధిపై సమగ్ర అవగాహన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. సంపూర్ణ అవగాహన, అప్రమత్తతతో థైరాయిడ్‌ వ్యాధిని జయించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్న మాట. మే 25వ తేదీ ‘వరల్డ్‌ థైరాయిడ్‌ డే’ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.    

గుంటూరు మెడికల్‌ : గుంటూరు జిల్లాలో ఆరు వరకు ఎండోక్రైనాలజీ ఆస్పత్రులు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి ప్రతి రోజూ 20 నుంచి 25 మంది థైరాయిడ్‌ వ్యాధి బాధితులు వస్తున్నారు. రోజుకు సుమారు 80 మంది చికిత్స కోసం ఎండోక్రైనాలజిస్టుల్ని సంప్రదిస్తున్నారు. జనరల్‌ ఫిజీషియన్‌తో పాటుగా ఇతర వైద్య నిపుణుల్ని రోజూ సంప్రదిస్తున్న బాధితుల సంఖ్య 300 మందికి పైగా ఉంటుంది. జీజీహెచ్‌కు జనరల్‌ మెడిసిన్‌ వైద్య విభాగానికి రోజూ వైద్యం కోసం వచ్చే వారిలో 250 మందిలో 40 మంది థైరాయిడ్‌ వ్యాధి బాధితులే ఉంటున్నారు.

థైరాయిడ్‌ గ్రంథి చేసే పనులు
గొంతు ముందు భాగంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా గులాబీ రంగులో ఇంచుమించు సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్‌ గ్రంథి ఉంటుంది. ఇది మెదడులోని పిట్యూటరీ గ్రంథి స్రవించే థైరాయిడ్‌ స్టిమ్యూలేటింగ్‌ హార్మోన్‌ (టీఎస్‌హెచ్‌) ద్వారా టి–3, టి–4 అనే హార్మోన్లను ఉత్తత్పి చేస్తుంది. టి–4 అనగా థైరాక్సిన్‌. ఇది 20 గ్రాముల బరువు ఉండి శరీరంలోని చాలా జీవక్రియల్ని నియంత్రిస్తుంది. శరరీ పెరుగుదల, ఎముకల పెరుగుదల, శరీర ఉష్ణోగ్రత, మానసిక వికాసాన్ని అదుపు చేస్తుంది. వివిధ కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ హార్మోన్‌ ఉత్పత్తికి మన శరీరంలో తగినంత అయోడిన్‌ అవసరం. రోజుకు 150 మైక్రో గ్రాముల (గుండుసూది తలంత) అయోడిన్‌ శరీరానికి అవసరం. థైరాక్సిన్‌లో 65 శాతం అయోడిన్‌ ఉంటుంది. అయోడిన్‌ పెరుగుదలకు, శక్తి రావడానికి తోడ్పడుతుంది.

థైరాయిడ్‌ లోపం ఏర్పడితే?..
ఈ వ్యాధి లక్షణాలు ఒక్కసారిగా కాక నిదానంగా కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో హుషారు తగ్గి, అంతకు ముందులేని మందకొడితనం చోటుచేసుకుంటుంది. విపరీతమైన అలసట, నడవాలన్నా, పనిచేయాలన్నా ఓపిక ఉండదు. చర్మంలో తడి, నునుపుతనం తగ్గి, ఎండిపోయినట్లు ఉంటుంది. కండరాలు ఉబ్బుతాయి. దానివల్ల ఒళ్లు ఉబ్బుగా కనిపిస్తుంది. ఒళ్లు ఉబ్బరం వల్ల ఉబ్బు కామెర్లుగా భ్రమపడే అవకాశం ఉంది. మలబద్ధకం, కండరాలు పట్టివేసినట్లు ఉండటం, చర్మం కింద కొవ్వు చేరి బరువు పెరుగుతారు. గొంతు బొంగురుగా మారడం, ముఖం గుండ్రంగా కనపడటం, మనిషి మందమతిగా మారతాడు. జీవక్రియ రేటు విపరీతంగా పెరిగి శరీరంలోని అన్ని శక్తి వనరులు ఖాళీ అవుతాయి. ఎముకల్లో కాల్షియం తక్కువై పెళుసుబారతాయి. తలమీద వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. పిల్లలో పెరుగుదల ఉండదు. పిచ్చితనం వస్తుంది. లావు అవ్వడం, బరువు పెరగడం, మత్తు, నిద్ర, ఒళ్లునొప్పులు, మలబద్ధకం, స్త్రీలలో రుతుచక్రంలో మార్పులు రావడం, గర్భం రావడం ఆలస్యం కావడం, తరచుగా గర్భస్రావాలు జరగడం తదితర లక్షణాలు ఉంటాయి.

వ్యాధి నిర్ధారణ
రక్తంలో టి–3, టి–4, టీఎస్‌హెచ్‌ అనే హార్మోన్లు ఎంతున్నాయో పరీక్షలు చేస్తారు. దీన్నే థైరాయిడ్‌ ప్రొఫైల్‌ అంటారు. ఈ పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధి ఉందా? లేదా? నిర్ధారణ చేస్తారు.

పుట్టిన బిడ్డకు పరీక్షలు చేయించాలి
ఈ వ్యాధి అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి వస్తుంది. మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా సమస్య తలెత్తుతుంది. ఆడవారిలో 80 శాతం మందికి ఉంటే మగవారిలో 20 శాతం మందికి వస్తుంది. జన్యుపర లోపాల వల్ల, తల్లికి ఉంటే బిడ్డకు, వంశపారంపర్యంగా వ్యాధి వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు థైరాయిడ్‌ ఉందో లేదో నిర్ధారణ పరీక్ష చేయించడం చాలా ఉత్తమం. –డాక్టర్‌ పతకమూరి పద్మలత, ఎండోక్రైనాలజిస్ట్,  జీజీహెచ్, గుంటూరు    

ముందే తెలుసుకోవచ్చు
యాంటీబాడీ టెస్ట్‌ చేయించుకోవడం ద్వారా థైరాయిడ్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? లేదా? ముందుగానే తెలుసుకోవచ్చు. ఆహారంలో అయోడిన్‌ లోపం లేకుండా చూసుకోవడం వల్ల కొంత వరకు థైరాయిడ్‌ బారినపడకుండా కాపాడుకోవచ్చు. వ్యాధి నియంత్రణే తప్పా నివారణ లేదు. దీనికి జీవితాంతం మందులు వాడాలి. గర్భిణులకు వచ్చే థైరాయిడ్‌ ప్రసవం అనంతరం తగ్గిపోతుంది. వ్యాధి సోకిన వారికి ప్రత్యేకంగా లక్షణాలు కనిపించవు. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి.–డాక్టర్‌ బెల్లం భరణి,ఎండోక్రైనాలజిస్ట్, గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement