వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. పొలాలలో పచ్చిక మొలకేస్తోంది. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ చెట్ల మధ్యన ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఏ గట్టుపై ఏ పాము కాటేస్తుందో తెలియదు. అందుకే రైతులు పాముల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి కొంత అవగాహన పెంచుకోవాలి. ఇంకొంత ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడు పాము కాటేసినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
అదెలాగో చూద్దాం.
పిడుగురాళ్ల రూరల్: వర్షాకాలంలో సర్పల బెడద ఎక్కువగా ఉంటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అరకొర సాగు చేసిన పంటలకు నీరు పెట్టడానికి రాత్రి పూట వెళ్లాలంటే ప్రాణసంకటంగా మారుతోంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాములు ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి బారి నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.
అన్ని సర్పాలు ప్రమాదం కాదు
కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్ల పాము, నాగు పాము వంటి వాటితో ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణంగా 50 శాతంపైగా విషరహితమైన పాములు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చని తెలిపారు.
కట్ల పాము
ఈ పాము కరిచిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణపాయం ఎక్కువగా ఉంటుంది. పాము కాటేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలి. విషం రక్తంలోకి ప్రవహించక ముందే చికిత్స అందిస్తే ప్రాణపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.
రక్త పింజర
ఇది అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కాటేసిన రెండు గంటల తరువాత విషం శరీరానికి ఎక్కుతుంది. కాటేసిన వెంటనే ప్రాథమిక చికిత్స అవపరం. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదమే.
నాగు పాము
ఈ పాముకాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కువగా ఎక్కుతుంది. ప్రాథమికంగా పాము కాటువేసిన చోట గాయాన్ని తొలగించాలి. దీని విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
జెర్రిపోతు
ఈ రకం పాములు కాటు వేసినా ఏమీకాదు. ఈ పాములకు విషం ఉండదు. పాము కాటుకు గురైనవారు ఎక్కువ మంది భయంతోనే గుండెపోటుకు గురవుతారు. ప్రాథమిక చికిత్స అందిస్తే సరిపోతుంది..
ప్రథమ చికిత్స ఇలా
⇔ రైతులు రాత్రి పూట పొలాలకు వెళ్లేటప్పుడు కాళ్లకు చెప్పులు ధరించాలి. టార్చిలైట్లతోపాటు శబ్దం చేసే పరికరాన్ని వెంట తీసుకెళ్లాలి.
⇔ పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్ర ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదముంది.
⇔ కాటేసిన ప్రాంతాన్ని సబ్బుతో రుద్ది నీళ్లతో శుభ్రంగా కడగాలి.
⇔ పసరు వైద్యం, మంత్రాలు అంటూ ఆలస్యం చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే.
⇔ పాము కాటు వేయగానే గాయానికిపై భాగంలో కట్టు కట్టాలి. కొత్త బ్లేడుతో కాటు వేసిన చోట కొద్దిగా చర్మం తొలగించి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటిలో గాయాలు ఉన్నవారు ఇలా చేయకూడదు.
⇔ పాము కాటుకు గురైన వ్యక్తిని నడిపించడం ఏ మాత్రం మంచిది కాదు. వెంటనే అతడ్ని పడుకోబెట్టి తల, గుండె ఎక్కువ ఎత్తులో ఉండేలా చూడాలి.
⇔ ఏ పాము కాటు వేసిందో తెలుసుకుని యాంటీ వీనమ్ (విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
మందులు అందుబాటులో ఉన్నాయి
పాము కాటు వేస్తే ఆందోళన అవసరం లేదు. అప్రమత్తతతో సమస్యను అధిగమించవచ్చు. యాంటీ వీనమ్ మందులు అందుబాటులో ఉన్నాయి. కాటు వేసినప్పుడు శరీరంలో మార్పులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి.– కాసర్ల వెంకటరెడ్డి,పిడుగురాళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment