మారుతున్న జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడంతో మహిళలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతకాలంలో ఎక్కువ మంది మహిళలు ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యల్లో అత్యంత ప్రధానమైనది రొమ్ముక్యాన్సర్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏటా 4 వేల మందివ్యాధితో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అంటున్నవైద్యులు అప్రమత్తతో వ్యాధిని జయించవచ్చని సూచిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ అప్రమత్తతా మాసం సందర్భంగా ప్రత్యేక కథనం..
లబ్బీపేట(విజయవాడతూర్పు): రొమ్ము క్యాన్సర్ బా«ధితులు ఏటా పెరుగుతున్నారు. గ్రామీణ మహిళల కంటే పట్టణాల్లో ఉండే మహిళలే అత్య«ధికంగా వ్యాధి బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తొలిదశలో గుర్తిస్తుండగా, 70 శాతం మంది, 2, 3 దశల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్స కోసం వస్తున్నారు. అందుకు వ్యాధి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏటా 4వేల మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. వ్యాధి లక్షణాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.
వీరికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ..
సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, పిల్లలు పుట్టాక పాలు ఇవ్వని వారికి ఎక్కువుగా వస్తుంది. కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఉన్నా, ఎక్కువ వత్తిళ్లకు గురయ్యే వారికి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, నెలసరి ఆగడం, 55 ఏళ్ల వరకూ నెలసరి ఉండటం వంటివి కారణాలు. ధూమపానం, ఆల్కాహాల్ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో వచ్చే అవకాశం ఉంది.
వ్యాధి లక్షణాలు..
రొమ్ము క్యాన్సర్ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు ఏమైనా వచ్చాయా, రొమ్ము పై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను పరిశీలించాలి. రొమ్ము భాగంలో నొప్పిగా ఉన్నా, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి.
మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ..
రొమ్ము క్యాన్సర్‌ను మమ్మోగ్రామ్ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ నిర్ధారణకు ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. 3డీ మమ్మోగ్రామ్ అందుబాటులో ఉంది. దీని ద్వారా వ్యాధి సూక్ష్మదశలో ఉన్నప్పుడే గుర్తించే అవకాశం ఉంది. రొమ్ము భాగంలో పౌడర్‌లా ఏదైనా చల్లినట్లు ఉన్నా కనిపెట్టేస్తుంది. వయస్సు 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి.
మరణాల రేటు అధికమే..
రాష్ట్రంలో ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే దేశంలో క్యాన్సర్‌తో మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతో తొలిదశలో గుర్తించ లేక పోతున్నారు. మూడోదశలో చికిత్సకోసం వచ్చిన వారిలో కూడా మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
అప్రమత్తతే మందు
రొమ్ము క్యాన్సర్‌కు ముందుచూపే మందు. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు దాటిన మహిళల్లో ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంది. లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, బిడ్డలకు పాలివ్వని వారికి ఎక్కువుగా వస్తుంది. తొలిదశలోనే గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్తే అత్యాధునిక పరికరాలతో వ్యాధిని నిర్ధారించి చికిత్స పొందవచ్చు. రోజు వారీ వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవడం, కొవ్వు, నూనె ఉన్న పదార్థాలు తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువుగా తీసుకుంటే మంచిది.– డాక్టర్ ఎన్.సుబ్బారావు, మెడికల్ అంకాలజిస్ట్, అనీల క్యాన్సర్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment