చీరాల రూరల్ : రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మంగళవారం చీరాల కొత్తపేట బైపాస్ రోడ్డులోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు.. చీరాల మండలం బుర్లవారిపాలెంకు చెందిన దేవరపల్లి హకిల్ (24) కుటుంబం వీఆర్‌ఎస్‌అండ్‌వైఆర్‌ఎన్ కళాశాల ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటోంది. హకిల్ వేటపాలెం సమీపంలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో హకిల్ కాలేజీలో పరీక్షలు రాసి తన స్నేహితుడైన చందుతో కలిసి ద్విచక్రవాహనంపై సాయంత్రం సమయంలో ఇంటికి బయలుదేరాడు. కొత్తపేట బైపాస్ రోడ్డులోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో వీరి వాహనం రాగా ముందుగా వెళుతున్న లారీ ఒక్కసారిగా కొత్తపేట గ్రామంవైపు మలుపు తిరిగింది. ఇదే సమయంలో ఈపురుపాలెం నుంచి వస్తున్న ద్విచక్రవాహనం హకిల్ వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో హకిల్ తీవ్ర గాయాలు కాగా చందుకు కూడా దెబ్బలు తగిలాయి. ఈపూరుపాలెం నుంచి బైకుపై వస్తున్న గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన కొత్తపాటి గౌతం, పొన్నూరుకు చెందిన గద్దెపూడి నిహాల్ చౌదరిలకు కూడా గాయాలయ్యాయి.
వీరిద్దరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షత గాత్రులను హుటాహుటిన 108 వాహన సహాయంతో చీరాల ప్రభుత్వాసుపత్రికి, మరి కొందరిని పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తీవ్ర రక్త గాయాలైన హకిల్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. గౌతం కూడా తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. దీంతో బాధితుణ్ణి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఇదే సంఘటనలో రోడ్డు పక్కగా నుంచుని ఐస్‌క్రీమ్ బండిపై ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్న జాండ్రపేటకు చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. సంఘటన జరిగిన సమయంలో క్షతగాత్రులు ఇతనిపై పడడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఒక్కగానొక్కడు
హకిల్ తండ్రి డేవిడ్ పాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డేవిడ్‌కు హకిల్‌తో పాటు మరో ఇద్దరు కుమారైలున్నారు. వారికి వివాహాలు అయ్యాయి. ఒక్కగానొక్కడు హకిల్‌ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. హకిల్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కాలేజీకి వెళ్లేందుకు గాను స్వగ్రామం బుర్లవారిపాలెం అయినప్పటికీ చదువు రీత్యా వీఆర్‌ఎస్‌అండ్‌వైఆర్‌ఎన్ కాలేజీ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చదువులో ముందుంటూ అందరితో కలివిడిగా ఉండే హకిల్ మృతి చెందడంతో బుర్లవారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అప్పటి వరకు అందరితో ఎంతో సంతోషంగా గడిపిన స్నేహితుడు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో హకిల్ స్నేహితులు తల్లడిల్లారు. మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున హకిల్ స్నేహితులు, పాస్టర్లు చేరుకున్నారు. హకిల్ తల్లి దండ్రులు డేవిడ్, ప్రశాంతిలు శోక సంద్రంలో మునిగిపోయారు. చదువులు పూర్తయ్యి చేతికి అందివస్తాడనుకుంటున్న తరణంలో విధి చేతిలో హతమయ్యావా అంటూ వారు చేసిన ఆర్తనాదాలు చూపరులకు కంటతడి పెట్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment