
కాలువలో బీటెక్ విద్యార్థిని మృతదేహం
తణుకు క్రైం/పెనుమంట్ర : తణుకులో ఈ నెల మూడో తేదీన అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని ముత్యవతి ఆదివారం కాలువలో మృతదేహమై కనిపించింది. గోస్తనీ కాలువలో కొట్టుకువచ్చిన ఆమె మృతదేహాన్ని పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామం సెంటర్‌లో వంతెన వద్ద పోలీసులు వెలికితీశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకులో టీటీడీ కల్యాణ మండపం ప్రాంతంలో నివసిస్తున్న ఎలుబూడి నరసన్న కుమార్తె ముత్యవతి (20) భీమవరం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతోంది.
ఈనెల 1న స్నేహితులతో టూర్‌కు వెళ్లి 3వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. అప్పటినుంచి ఆమె ముభావంగా ఉండడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించగా మనసు బాగోలేదని, చర్చిలో విన్న ప్రార్థన బాగోలేదని చెప్పింది. అనంతరం కాసేపటికి ముత్యవతి కనిపించకపోవడంతో ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో 4న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడో తేదీ రాత్రి కాలువలో ఎవరిదో మృతదేహం కొట్టుకుంటూ వెళ్లిందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గోస్తనీ కాలువ వెంబడి వెతక గా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు వంతెన ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం పోలీసులు తణుకు ఏరియా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే ముత్యవతి మృతి చెందడానికి గల కారణాలు వెలుగులోకి రాలేదు. తణుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదువులో చురుకైంది
పేద కుటుంబానికి చెందిన ముత్యవతి చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ప్రాథమిక పాఠశాల నుంచే తరగతిలో ఇతర విద్యార్థుల కంటే ప్రతిభ కనపరిచేదని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెబుతున్నారు. బీటెక్ పూర్తయిన తరువాత ఉద్యో గం సంపాదించి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటానని చెప్పేదని కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలికి తల్లిదండ్రులతోపాటు ఒక అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.