
'సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తప్పవు'
రాజధాని అనేది అభివృద్ధి ఉన్న ప్రాంతంలోనే ఉంటుందని సీపీఎం పాలిటిబ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం, కంపెనీలు ఏర్పాటు ఎక్కడ ఉండాలన్నది రాజకీయ నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం నగరంలో సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో 'రాయలసీమకే రాజధాని హక్కు'పై సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో రాఘవులు మాట్లాడుతూ... రాష్ట్రానికి రాజకీయంగా న్యాయం జరగకుంటే ముక్కలైన తెలుగుజాతి మళ్లీ ఐక్యంగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తప్పవని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికలలో నగదు ఖర్చుపెట్టి గెలిపించిన వారి కోసమే ప్రభుత్వం పని చేస్తుందని... తప్ప వెనకబడిన ప్రాంతం అభివృద్ధి కోసం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. రాయలసీమలో ఇతర ప్రాంతాలవారే వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని రాఘవులు గుర్తు చేశారు.