
సాక్షి, గజపతినగరం రూరల్: ఏ తల్లి కన్నదో ఆ బిడ్డను. నవమాసాలు మోసి... ప్రసవవేదన అనుభవించి... చివరకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ వారికి బరువైందో... మృతశిశువును కన్నదో... పుట్టిన బిడ్డ ఊపిరాగిందో... లేక ఏ ప్రబుద్ధుడి మోసానికి బలై అన్యాయంగా తల్లిగా మారిందో... కానీ ఓ మగబిడ్డను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన కాలువలో పడేశారు. నీటిలో తేలియాడితూ పసికందు మృతదేహం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద చిన్న పాటిగా ఉన్న లోతట్టు ప్రాంతంలోని నీటిలో తేలియాడుతున్న ఆ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి మధుపాడ వీఆర్‌ఓ దాసరి అప్పలరాజుకు సమాచారం అందించారు. ఆయన గజపతినగరం పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడంతో సీఐ విద్యాసాగర్, ఎస్‌ఐ సన్యాసినాయుడు అక్కడకు చేరుకొని మృతశిశువును పరిశీలించారు. అనంతరం ఆ మృతశిశువును శవపంచనామాకోసం తరలించారు. అయితే ఆ బిడ్డ మృతి చెంది మూడు లేదా నాలుగు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా ఆస్పత్రిలో పరిశీలించిన గజపతినగరం సూపరింటెండెంట్ డాక్టర్ అరుణా దేవి తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment