జిల్లాలో ఇటీవల రెండ్రోజుల పాటు జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కేవలం టీడీపీ రోడ్‌షో మాదిరిగా సాగిందని, దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అనకాపల్లి...
అనకాపల్లి : జిల్లాలో ఇటీవల రెండ్రోజుల పాటు జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కేవలం టీడీపీ రోడ్‌షో మాదిరిగా సాగిందని, దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అనకాపల్లి నియోజక వర్గ వైఎస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జ్ కొణతాల రఘునాథ్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటన ప్రజా సమస్యలపై సమీక్ష జరిపినట్లు లేదని, ఆ పార్టీ సొంత కార్యక్రమంలా సాగిందని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా తిరిగి వెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
తుమ్మపాల చక్కెర కర్మాగారానికి నిధులు కుమ్మరిస్తారని హడావుడి చేశాక, ఇప్పుడు మూడు నెలల పాటు నిపుణులతో కమిటీ వేసి, ఆ నివేదిక మేరకు న్యాయం చేస్తానని చెప్పడం ఎంత వరకూ సమంజసమని రఘునాథ్ ప్రశ్నించారు. తుమ్మపాల సుగర్స్‌లో చెరకు రైతుల బకాయిలు, ఉద్యోగుల జీతాల బకాయిలపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం పర్యటన వల్ల ఏం న్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వందేళ్లు నిండిన ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధనా స్థానం వేడుకలకూ నిధులు మంజూరు చేయకుండా వట్టి చేతులతో వెళ్లిపోయిన సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యుత్ వినియోగదారుల మన్ననలు పొందిన కశింకోట ఆర్‌ఈసీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పడం బాబు మార్కు పాలనకు నిదర్శనమని, అయినా అదేమీ నామినేటెడ్ పాలకవర్గం కాదన్న విషయం సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు భరోసా ఇవ్వకుండా, చిర్రుబుర్రులాడుతూ రాజకీయ కక్షసాధింపు రీతిలో సాగిన చంద్రబాబు పర్యటన వల్ల అధికారుల విలువైన సమయం, లక్షలాది రూపాయిలు వృథా అయ్యాయని రఘునాథ్ మండిపడ్డారు.