
జీజీహెచ్‌లో శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యంవల్లేనని బంధువుల ఆందోళన
గుంటూరు మెడికల్/సాక్షి, హైదరాబాద్: ‘‘పుట్టగానే సక్రమంగా పరీక్షించకుండా మా బిడ్డ చనిపోయాడని నిర్ధారించి మూటగట్టి ఇచ్చారు. పైగా మరణ ధ్రువీకరణ పత్రం కూడా చేతిలో పెట్టారు. ఇంటికి తీసుకెళుతుండగా మా అదృష్టంకొద్దీ బాబులో చలనం రావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఇంత జరిగినా వైద్యులు నిర్లక్ష్యాన్ని వీడలేదు. సరైన వైద్యం అందించకుండా ఈసారి మా బిడ్డను నిజంగానే చంపేశారు..’’ అంటూ గుంటూరుకు చెందిన జగన్నాథం నాగబాబు, భవాని దంపతులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్) వైద్యుల ఎదుట బుధవారం ఆవేదన వెలిబుచ్చారు.
జీజీహెచ్‌లో మంగళవారం కాన్పు జరిగిన భవానికి పుట్టిన బిడ్డను బతికుండగానే చనిపోయినట్లు నిర్ధారించి అందజేయడం.. తర్వాత శిశువులో కదలికలను గమనించిన తల్లిదండ్రులు తిరిగి ఆస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు వెంటనే ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స చేపట్టడం తెలిసిందే. అయితే ఎన్‌ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ శిశువు మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటలకు చనిపోయాడు. ఈ నేపథ్యంలో బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. కాగా ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు వైద్యవిద్యా సంచాలకులు డా.ఎన్.సుబ్బారావు వెల్లడించారు.చివరికి శిశువు మృతికి జూనియర్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థినే కారణమని విచారణ కమిటీ తేల్చింది.