అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 19 దాకా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను జయప్రదం చేయాలని డిప్యూటీ డీఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులను విద్యాశాఖ అధికారి దేవరాజు, ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి కోరారు.
వారోత్సవాలు ఇలా...
12న ‘స్వాగతం’: ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహకారంతో పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, అలంకరించి పండుగ వాతావరణం కల్పించాలి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ‘బడిపిలుస్తోంది–వారోత్సవాల’ను ప్రారంభించాలి.
13న ‘సంబరం’: పిల్లలతో బొమ్మలు గీయించాలి. ఆహ్వాన పత్రికలు పిల్లలతో తయారు చేయించి తర్వాత రోజు ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించనున్న సామూహిక అక్షరాభ్యాసానికి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి. 6–10 తరగతుల్లో భాషలు, గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టుల్లోని ఆసక్తికరమైన విషయాలు, పజిల్స్ ప్రదర్శించాలి. మధ్యలో బడిమానేసిన పిల్లల వివరాలను ప్రదర్శించి వారి ఇళ్లకు వెళ్లి వారు మళ్లీ పాఠశాలకు వచ్చేలా మాట్లాడాలి.
14న ‘అక్షరం’ : ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్‌ఎంసీ సభ్యులు, దాతలు, గ్రామపెద్దలు, తల్లిదండ్రులను ఆహ్వానించి పాఠశాలల్లో ఘనంగా ‘అక్షరాభ్యాసం’ నిర్వహించాలి. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలందరినీ గ్రామంలో రచ్చబండ/దేవాలయం వద్దకు చేర్చి రంగురంగుల బెలూన్లు ఇచ్చి మేళతాళాలతో ఊరేగింపుగా సామూహిక అక్షరాభ్యాసానికి తీసుకురావాలి. చదువు ప్రాధాన్యతపై పాటలు, పదాలు, శ్లోకాలు పాడించాలి. దాతల సహకారంతో పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ చేయాలి. ప్రతి తరగతికి విద్యార్థి నాయకుడిని ఎంపిక చేయాలి. పాఠశాల విద్యార్థి నాయకుడిని (ఎస్‌పీఎల్) ఏకగ్రీవంగా/ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేయాలి.
15న ‘అభినయం’: విద్యార్థులతో అభినయ గేయాలు, పాటలు పాడించాలి. కథలు, జోక్స్ చెప్పించాలి. పాటలకు డ్యాన్సులు చేయించాలి. పిల్లలు, గ్రామస్తులు సేకరించిన పుస్తకాలతో ప్రదర్శన ఏర్పాటు చేయాలి. పిల్లలకు నచ్చిన పుస్తకాలు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి చదివి తిరిగి పాఠశాలకు అప్పగించేలా చూడాలి. డిజిటల్ తరగతి గదలున్నచోట వాటిలో చిత్రకథలను ప్రదర్శించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలకు చిన్నచిన్న పోటీలు నిర్వహించాలి.
17న ‘నందనం’: ‘నా ఊరు–నా చెట్టు’ కార్యక్రమంలో పాఠశాలల ఆవరణ, విద్యార్థుల ఇళ్ల వద్ద, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పిల్లలతో మొక్కలు నాటించాలి. 1, 6వ తరగతిలో చేరిన పిల్లలతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించి వాటిని దత్తత ఇవ్వాలి. పిల్లలు సేకరించిన విత్తనాలతో ‘గింజల ప్రదర్శన’ నిర్వహించాలి. ‘ప్రకృతి ప్రార్థన’ చేయించాలి.
18న ‘వందనం’: పాఠశాలలో బోధనాభ్యసన సామగ్రిని ప్రదర్శించాలి. మహిళాధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన వక్తలను ఆహ్వానించి మాట్లాడించాలి. పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, కూచిపూడి, భరతనాట్యం, సంప్రదాయనృత్యాలతో పాటు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వాలి.
19న ‘అభినందనం’: పదో తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాలలకు పిలిపించి స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సమక్షంలో సత్కరించాలి. పూర్వ విద్యార్థులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి. వక్తలను ఆహ్వానించి నైతిక విలువలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఉపన్యాసాలు ఇప్పించాలి. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment