badi pilustondi
-
12 నుంచి ‘బడి పిలుస్తోంది’
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 19 దాకా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను జయప్రదం చేయాలని డిప్యూటీ డీఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులను విద్యాశాఖ అధికారి దేవరాజు, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి కోరారు. వారోత్సవాలు ఇలా... 12న ‘స్వాగతం’: ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహకారంతో పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, అలంకరించి పండుగ వాతావరణం కల్పించాలి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ‘బడిపిలుస్తోంది–వారోత్సవాల’ను ప్రారంభించాలి. 13న ‘సంబరం’: పిల్లలతో బొమ్మలు గీయించాలి. ఆహ్వాన పత్రికలు పిల్లలతో తయారు చేయించి తర్వాత రోజు ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించనున్న సామూహిక అక్షరాభ్యాసానికి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి. 6–10 తరగతుల్లో భాషలు, గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టుల్లోని ఆసక్తికరమైన విషయాలు, పజిల్స్ ప్రదర్శించాలి. మధ్యలో బడిమానేసిన పిల్లల వివరాలను ప్రదర్శించి వారి ఇళ్లకు వెళ్లి వారు మళ్లీ పాఠశాలకు వచ్చేలా మాట్లాడాలి. 14న ‘అక్షరం’ : ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్ఎంసీ సభ్యులు, దాతలు, గ్రామపెద్దలు, తల్లిదండ్రులను ఆహ్వానించి పాఠశాలల్లో ఘనంగా ‘అక్షరాభ్యాసం’ నిర్వహించాలి. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలందరినీ గ్రామంలో రచ్చబండ/దేవాలయం వద్దకు చేర్చి రంగురంగుల బెలూన్లు ఇచ్చి మేళతాళాలతో ఊరేగింపుగా సామూహిక అక్షరాభ్యాసానికి తీసుకురావాలి. చదువు ప్రాధాన్యతపై పాటలు, పదాలు, శ్లోకాలు పాడించాలి. దాతల సహకారంతో పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ చేయాలి. ప్రతి తరగతికి విద్యార్థి నాయకుడిని ఎంపిక చేయాలి. పాఠశాల విద్యార్థి నాయకుడిని (ఎస్పీఎల్) ఏకగ్రీవంగా/ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేయాలి. 15న ‘అభినయం’: విద్యార్థులతో అభినయ గేయాలు, పాటలు పాడించాలి. కథలు, జోక్స్ చెప్పించాలి. పాటలకు డ్యాన్సులు చేయించాలి. పిల్లలు, గ్రామస్తులు సేకరించిన పుస్తకాలతో ప్రదర్శన ఏర్పాటు చేయాలి. పిల్లలకు నచ్చిన పుస్తకాలు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి చదివి తిరిగి పాఠశాలకు అప్పగించేలా చూడాలి. డిజిటల్ తరగతి గదలున్నచోట వాటిలో చిత్రకథలను ప్రదర్శించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలకు చిన్నచిన్న పోటీలు నిర్వహించాలి. 17న ‘నందనం’: ‘నా ఊరు–నా చెట్టు’ కార్యక్రమంలో పాఠశాలల ఆవరణ, విద్యార్థుల ఇళ్ల వద్ద, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పిల్లలతో మొక్కలు నాటించాలి. 1, 6వ తరగతిలో చేరిన పిల్లలతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించి వాటిని దత్తత ఇవ్వాలి. పిల్లలు సేకరించిన విత్తనాలతో ‘గింజల ప్రదర్శన’ నిర్వహించాలి. ‘ప్రకృతి ప్రార్థన’ చేయించాలి. 18న ‘వందనం’: పాఠశాలలో బోధనాభ్యసన సామగ్రిని ప్రదర్శించాలి. మహిళాధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన వక్తలను ఆహ్వానించి మాట్లాడించాలి. పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, కూచిపూడి, భరతనాట్యం, సంప్రదాయనృత్యాలతో పాటు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వాలి. 19న ‘అభినందనం’: పదో తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాలలకు పిలిపించి స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సమక్షంలో సత్కరించాలి. పూర్వ విద్యార్థులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి. వక్తలను ఆహ్వానించి నైతిక విలువలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఉపన్యాసాలు ఇప్పించాలి. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలి. -
బతుకు భారమై.. బడికి దూరమై..
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని.. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేటట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ.. రామచంద్రపురానికి చెందిన ఇద్దరు బాలురు రాయవరంలో చెత్త ఏరుకుంటూ.. పెదపూడి మండలం పైన గ్రామానికి చెందిన బాలలు చెత్త ఏరుకోవడానికి రిక్షాపై వి.సావరం వెళ్తూ. ఇలా కనిపించారు. బతుకు భారమై.. బడిబాట పట్టాల్సిన బాల్యం చెత్తకుప్పలపాలవుతోంది. చట్టాలెన్ని ఉన్నా అక్కరకు రావడం లేదనడానికి ఇటువంటి చిత్రాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. - రాయవరం -
'పిల్లలందరూ చదుకోవాలన్నదే లక్ష్యం'
ఒంగోలు: పిల్లల భవిష్యత్ ను బంగారు భవిష్యత్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలందరూ చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రకాశం జిల్లాలో నాగులపాలెంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగారని తెలిపారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల... మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరారని చెప్పారు. నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధాని స్థాయికి వచ్చారని చంద్రబాబు అన్నారు. రాష్టాభివృద్ధికి పాటు పడుతున్నామన్నారు. -
మొక్కుబడిగా...
పార్వతీపురం : ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మొక్కుబడిగా సాగింది. వారం రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఉపాధ్యాయులు, అధికారులు ర్యాలీలకే పరిమితం చేశారు. ముఖ్యంగా పార్వతీపురం సబ్‌ప్లాన్‌లోని మండలాల్లో కొన్ని గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ బడి బయట చాలామంది పిల్లలు ఉన్నారన్నది సత్యం. ఎనిమిది మండలాల్లో సుమారు 700 వరకు డ్రాపౌట్స్ ఉన్నట్టు సమాచారం. వీరిలో కనీసం 50 శాతం మందిని కూడా అధికారులు పాఠశాలల్లో చేర్చలేకపోయూరు. గత ఏడాది 673 మంది వరకు బడిబయట పిల్లలను గుర్తించి ఆ మేరకు పాఠశాలల్లో చేర్పించకపోవడంతో వారంతా పశువులు కాపర్లుగా, బాల కార్మికులుగా మిగి లారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. పార్వతీపురం మండలంలో 56 పాఠ శాలలుండగా, 35 మంది బడిబయట ఉన్న పిల్లలున్నారు. వీరిలో 25 మంది జాయిన్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 188 పాఠశాలలుండగా దాదాపు 137మంది వరకు బడిబయట ఉన్న పిల్లలున్నారు. వీరిలో 83మందిని చేర్పించారు. గరుగుబిల్లి మండలంలో 35మంది పిల్లలు డ్రాపౌట్స్ ఉండగా, 9 మంది మాత్రమే చేరారు. అలాగే బలిజిపేట మండలంలోని 38 మంది డ్రాపౌట్స్ ఉండగా 9 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. ఇలా కనీసం 50 శాతం కూడా బడిబయట ఉన్న పిల్లల్ని బడిలోకి చేర్చకుండా మొక్కు బడిగా ర్యాలీలు, సహపంక్తి భోజనాలతో ‘బడి పిలుస్తోంది’ని మ మ అనిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మంత్రి ఇలాకాలో మొక్కుబడి
చీపురుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతా న్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమం సాక్షాత్తు జిల్లా మంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో మొక్కుబడిగా సాగుతోంది. మంత్రి కిమిడి మృణాళిని పట్టణంలోనే ఉన్నప్పటికీ బడి పిలుస్తోంది కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం అమలు చేసేందుకు మండల కమిటీ ఉన్నప్పటికీ వారు వెళ్లిన చోట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇతర పాఠశాలల పరిధిలో ఎవరూ పట్టించుకోవడం లేదు. బడిపిలుస్తోంది కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రతి పాఠశాల పరిధిలోనూ ర్యాలీ నిర్వహించాలి, అంతేకాకుండా పాఠశాలల పరిధిలో స్థానికులు, ప్రజాప్రతినిధులతో గ్రామసభ నిర్వహించి బడిబయట పిల్లలు ఉండకూడదని అవగాహన కల్పించాలి. చీపురుపల్లి మేజర్ పంచాయతీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు దాదాపు పది వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఎక్కడా ర్యాలీ గానీ, గ్రామసభ గానీ జరగలేదు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలైన అలజంగి, పేరిపి, కరకాం, పి.కె.పాలవలస, రామ లింగాపురం, వంగపల్లిపేట పాఠశాలలు మినహాయిస్తే మిగతా చోట్ల బడిపిలుస్తోంది ర్యాలీలు, గ్రామసభలు జరిగిన దాఖలాలు లేవు. బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలోను పండగలా చేయాలని కలెక్టర్ ఎంఎం.నాయక్ ఆదేశించినప్పటికీ స్థానిక ఉపాధ్యాయులు కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ జరుగుతోంది. మండల కమిటీలో ఉన్న ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ, ఎంఈఓలు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి షెడ్యూల్ అమలు చేయని పాఠశాలలపై చర్య లు చేపట్టాల్సింది పోయి ముందుగా సిద్ధం చేసుకున్న పాఠశాలలకు మాత్రమే వెళ్లి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రో జుల పాటు నిర్వహించాల్సిన బడిపిలుస్తోంది కార్యక్రమంలో రెండో రోజు షెడ్యూల్ అమలు కాకపోతే ఇక మిగిలిన రోజుల కార్యక్రమాలు ఏం జరుగుతాయంటూ పలువురు సందే హం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మంత్రి మృణాళిని చీపురుపల్లి పట్టణంలో శనివారం వధ్యాహ్నం 12.15 గంటల నుంచి సాయంత్రంవరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడిపిలుస్తోంది కార్యక్రమం అంతంతమాత్రంగా నిర్వహించడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’
కర్నూలు విద్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు ఆఫీసర్ మురళీధర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ ఏడాది మే నెల వరకు జిల్లాలో 5,192 మంది బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని గుర్తించామన్నారు. 2014-5 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచి ఆయా శాఖల అధికారుల సహకారంతో ఈనెల 19వ తేదీ వరకు 4,548 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించామన్నారు. మిగిలిన 644 మంది పిల్లలను బడి పిలుస్తోందిలో భాగంగా ఈనెల 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రోజు వారీ ప్రత్యేక కార్యక్రమాలతో పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి శుక్రవారం సునయన ఆడిటోరియంలో ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుందన్నారు. చైర్మన్‌గా జిల్లాలోని సీనియర్ మంత్రి, వైఎస్ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, డీఈఓ, అసిస్టెంట్ లేబర్ అధికారి.. కన్వీనర్‌గా సర్వశిక్ష అభియాన్ పీఓ వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో ఎంఈఓ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.