భద్రాద్రి మాదే | Badrachalam a part of telangana said hareesh rao | Sakshi
Sakshi News home page

భద్రాద్రి మాదే

Published Tue, Nov 19 2013 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

Badrachalam a part of telangana said hareesh rao

ఖమ్మం/భద్రాచలం, న్యూస్‌లైన్: ‘భద్రాచలం డివిజన్ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమే.... భద్రాద్రి రాముడికి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది... దీనిని ఈ ప్రాంతం నుంచి వేరు చేయడం సరికాదు’ అని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. భద్రాద్రి మాదే అంటూ నిరసనలు, ఆందోళనలు, దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, కేశవరావు జిల్లాలో పర్యటించి ఆందోళనలకు సంఘీభావం ప్రకటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 భద్రాచలంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు  టీఎన్‌జీవో ఆధ్వర్యంలో  దీక్షలు  సోమవారం కొనసాగాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు, టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. అదేవిధంగా జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు దీక్ష చేపట్టారు.  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు నిమ్మరసం ఇచ్చి ఈదీక్షలను విరమింపచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయ, విద్య, వైద్యం  ఏ ప్రాతిపదికన చూసినా భద్రాచలం తెలంగాణాలో అంతర్భాగమే అని అన్నారు. తెలంగాణ నుంచి భద్రాచలం డివిజన్‌ను విడదీస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా,  భద్రాచలం ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉంచాలని జిల్లా జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మంగళవారం జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అనుబంధ మహిళా సంఘం పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు.
 భద్రాచలంలో తొమ్మిదోరోజుకు దీక్షలు
 టీజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో చేపట్టిన  రిలే నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చే రాయి. సోమవారం నాటి దీక్షల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన  డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కురిచేటి రా మచంద్రమూర్తి,  డివిజన్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, నల్లపు దుర్గాప్రసాద్, ముత్యాల వీరభద్రం, నక్కా ప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, భూక్యా రంగా, తాండ్ర నర్సింహారావు, సరెళ్ల నరేష్, కేతినేని లలిత, రాజేష్, రాంబాబు తదితరులు  కూర్చొన్నారు.  డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు దీక్షాశిబిరాన్ని సంద ర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న భద్రాచలాన్ని వేరు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలన్నా రు.  భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. కాంగ్రెస్‌పార్టీ  జిల్లా జాయింట్ సెక్రటరీ బుడగం శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి తొమ్మిదో రోజు దీక్షలను విరమింపజేశారు.   
 తెలంగాణలో ఉంటేనే అభివృద్ధి :
 భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రైవేటు పాఠశాల కరస్పాడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాగంటి సూర్యం అన్నారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన, గిరిజనేతరులకు ఉన్నత విద్యావకాశాలు తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉంటాయన్నారు. భద్రాచలం ను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టబోయే కార్యక్ర మాలకు ప్రైవేటు పాఠశాలల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు  చెప్పారు.
 న్యాయవాదుల జలదీక్ష :
 భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డి మాండ్‌తో భద్రాచలం న్యాయవాదుల జాయిం ట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో  సోమవారం గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చారిత్రాత్మకమైన భద్రాచలం ప్రాంతాన్ని జలసమాధి చేయాలనే కుట్రలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు  జేఏసీ నాయకులు తెలిపారు. సుమారు గంటపాటు జలదీక్షను చేపట్టారు. కార్యక్రమంలో న్యాయవాదులు పీ కృష్ణమోహన్, ఎంవీ రమణారావు, కొడాలి శ్రీనివాసన్, సాల్మాన్‌రాజు, వసంతరావు, దాగం ఆదినారాయణ, శ్రీనివాస్, పడవల శ్రీనివాస్, తిరుమలరావు, మహిళా న్యాయవాదులు లలిత, నర్మద, కిరణ్మయి, శుభశ్రీ, కవిత, తరుణి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నిర్విహ ంచే అఖిల పక్షాల బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
 సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలి : గుమ్మడి నర్సయ్య
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలంను ముంచాలనే సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. భద్రాచలం టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు ఆయన  సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలంను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదన్నారు. ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దమేనన్నారు. ఇందుకోసం భద్రాచలం డివిజన్‌లోని ప్రజానీకమంతా పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్  మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి గౌసుద్ధీన్, సోమశేఖర్, వెక్కిరాల, ఈశ్వర్, కుంజా సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement