ప్రభాస్‌ గుర్రం.. పరుగు తీస్తే పతకమే | Bahubali Prabhas Horse Win Competitions | Sakshi
Sakshi News home page

పరుగు తీస్తే పతకమే

Published Tue, May 7 2019 10:38 AM | Last Updated on Tue, May 7 2019 1:43 PM

Bahubali Prabhas Horse Win Competitions - Sakshi

సంధించిన బాణంలా దూసుకుపోతుంది. పరుగుల వేట ప్రారంభిస్తే పతకాలు కొల్లగొట్టి తీరుతుంది. అభినందనల నీరాజనాన్ని అందుకుంటుంది. ఆ పంచకల్యాణి కోసం జన సందోహం తరలి వస్తుంది. గుర్రాలంటే అమితాసక్తి ఉండేవారు కొందరు.. గుర్రాలను సాకుతూ పోటీల్లో విజేతగా నిలిచేవారు ఇంకొందరు. రెండో కోవకు చెందుతాడు అలమండ సంతకు చెందిన పి.శ్రీనివాసరాజు

పోటీకెళ్తే బహుమతి ఖాయం
చిన్నప్పటి నుంచి గుర్రాలంటే మక్కువ ఉన్న శ్రీనివాసరాజు.. వాటిని కొనుగోలు చేసి పెంచడం ప్రారంభించాడు. గుర్రాల స్వారీ కూడా నేర్చుకున్నాడు. గ్రామాల్లో జాతరలు, తీర్థాలు జరిగితే గుర్రాపు పందాలు నిర్వహిస్తున్నాడు. ఏ పందాలకు వెళ్లినా అతని గుర్రాలు మొదటి, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. గుర్రాలపై మక్కువతోనే రాజస్థాన్, కర్ణాటక, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లి గుర్రాలను కొని పెంచుతున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద 5 గుర్రాలున్నాయి.

బాహుబలి గుర్రం కొనుగోలు
బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ స్వారీ చేసిన గుర్రాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బాహుబలి గుర్రం కూడా అతని వద్దే ఉంది. ఒక్కొక్క గుర్రాన్ని రూ.లక్ష నుంచి రూ.లక్ష 50 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరలు, తీర్థ మహోత్సవాలు, గ్రామదేవత ఉత్సవాలకు గుర్రాపు పందాలపై ఆసక్తి పెరిగింది. దీంతో గుర్రపు పందాలను తిలకించడానికి భారీగా వస్తున్నారు. శ్రీనివాసరాజు గుర్రాలు ఏ పోటీలకు వెళ్లినా ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. అతని గుర్రాలు సుమారు 30 పోటీల్లో పాల్గొని విశాఖ, తూర్పుగోదావరి, విజయగనరం జిల్లాల్లో జరిగిన గుర్రపు పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద రాణి, చెర్రీ, బాహుబలి, విజిలి, బుల్లెట్‌రాజా పేర్లున్న గుర్రాలున్నాయి. గుర్రాలకు రోజూ ఉదయం, సాయంత్రం స్వారీపై తర్ఫీదు ఇస్తాడు. రోజు తప్పించి రోజు ఈత కొట్టిస్తాడు. ఎండాకాలంలో రోజూ చల్లని నీటితో స్నానం చేయిస్తాడు.

బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ వినియోగించిన గుర్రం

గుర్రాల ఆహారం
రోజూ గుర్రాలకు క్యారెట్, బీట్‌రూట్, నల్ల ఉలవలు, నువ్వులతో తయారుచేసిన అరిసెలు, కర్జూరం, తాటిబెల్లం, గోధుమలు, పచ్చగడ్డివి పెడతాడు. వాటితోపాటు కాల్షియం టానిక్‌ ఇస్తాడు. ప్రత్యేక గుర్రపు వైద్య నిపుణుడితో ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తాడు.           – జామి (శృంగవరపుకోట)

 బాల్యం నుంచి మక్కువ
చిన్నప్పటి నుంచి గుర్రాలంటే చాలా మక్కువ. ప్రస్తుతం నావద్ద అయిదు గుర్రాలున్నాయి. ఇటీవలే బాహుబలి చిత్రంలో ఉపయోగించిన గుర్రాన్ని కొనుగోలు చేశాను. వీటి పెంపకానికి అధిక వ్యయం అవుతుంది. ఒక్కొక్క గుర్రానికి నెలకు సుమారు రూ.8వేలు అవుతుంది. నా అభిరుచి పదిమందికి ఆనందాన్నివ్వడం సంతోషంగా ఉంది.        – పి.శ్రీనివాసరాజుఅలమండ సంత

గుర్రపు స్వారీలో నాకు సుమారు 15 ఏళ్ల అనుభవం ఉంది. గుర్రపుస్వారీలపై శిక్షణ కూడా ఇస్తాను. అనేక పందాలకు వెళ్లాను. స్వారీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్రపు స్వారిలో కళ్లెం అతి ప్రధానమైనది. వాహనాలకు గేర్లు మాదిరిగానే కళ్లెం పనిచేస్తుంది.– బద్రీనాథ్, గుర్రపుస్వారి శిక్షకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement