ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా షరతు విధించింది.
ఎమ్మార్ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు మంగళవారం, గురువారం విచారించింది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌రెడ్డిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని సునీల్ రెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి/బ్యాంకరు/వ్యాపారి/ఏజెంట్ నమ్మకద్రోహానికి పాల్పడడం) సునీల్‌రెడ్డికి వర్తించదని కోర్టుకు వివరించారు. ఏపీఐఐసీ వ్యవహారాల్లో, ఎమ్మార్‌తో జరిగిన ఒప్పందంలో ఎక్కడా ఆయన పాత్ర లేదని తెలిపారు.
ఈ కేసులో గతేడాది జనవరి 25న సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారు. అప్పట్నుంచీ ఆయన జ్యుడీషియల్ రిమాం డ్‌లో ఉన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారితోపాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని శ్రీరామ్ కోర్టుకు గుర్తుచేశారు. అయితే, సునీల్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు ముగిసిన తరువాత సునీల్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.