Emaar case
-
నాపై కేసు కొట్టేయండి...
హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసిన లేఖను పిల్‌గా భావించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదే శించిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి విజిలెన్స్ నివేదికలో పిటిషనర్‌కు వ్యతిరేకంగా ప్రస్తావన లేదన్నారు. అప్పటి ఏపీ ఐఐసీ ఎండీగా పిటిషనర్ వ్యవహరించి నప్పటికీ, ఎమ్మార్‌కు భూకేటాయింపులు, ధర నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదేనని, ఆయన వివరించారు. -
రూ.96 కోట్ల ‘ఎమ్మార్’ ఆస్తుల అటాచ్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) రూ.96 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇందులో సౌత్ఎండ్ ప్రాజెక్టుకు చెందిన రూ.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇందూ ప్రాజెక్ట్స్ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన రూ.10 ముఖవిలువ కలిగిన 2.52 కోట్ల షేర్లు, రంగారెడ్డి జిల్లా మర్పల్లె మండలంలో ఉన్న కోనేరు ప్రదీప్‌కు చెందిన 36.14 ఎకరాల భూమి, ఈహెచ్‌టీపీఎల్‌కు చెందిన విక్రయించని 14 ప్లాట్లు, స్టైలిష్‌హోం పేరుతో గచ్చిబౌలిలో ఉన్న 2,057 గజాల భూమి, ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్ పేరుతో నానక్‌రామ్‌గూడలో ఉన్న 4.80 ఎకరాల భూమి ఉన్నాయి. -
ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా షరతు విధించింది. ఎమ్మార్ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు మంగళవారం, గురువారం విచారించింది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌రెడ్డిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని సునీల్ రెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి/బ్యాంకరు/వ్యాపారి/ఏజెంట్ నమ్మకద్రోహానికి పాల్పడడం) సునీల్‌రెడ్డికి వర్తించదని కోర్టుకు వివరించారు. ఏపీఐఐసీ వ్యవహారాల్లో, ఎమ్మార్‌తో జరిగిన ఒప్పందంలో ఎక్కడా ఆయన పాత్ర లేదని తెలిపారు. ఈ కేసులో గతేడాది జనవరి 25న సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారు. అప్పట్నుంచీ ఆయన జ్యుడీషియల్ రిమాం డ్లో ఉన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారితోపాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని శ్రీరామ్ కోర్టుకు గుర్తుచేశారు. అయితే, సునీల్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు ముగిసిన తరువాత సునీల్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
సునీల్‌రెడ్డిని అక్రమంగా ఇరికించారు : శ్రీరామ్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సహ నిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌రెడ్డిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మార్ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించారు. సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్ వాదిస్తూ.. ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి/బ్యాంకరు/వ్యాపారి/ఏజెంట్ నమ్మకద్రోహానికి పాల్పడడం) సునీల్‌రెడ్డికి వర్తించదని.. ఏపీఐఐసీ వ్యవహారాల్లో, ఎమ్మార్‌తో జరిగిన ఒప్పందంలో ఎక్కడా ఆయన పాత్ర లేదని తెలిపారు. ఒకవేళ సహ నిందితుడు రంగారావు వాంగ్మూలం ఆధారంగా అభియోగాలు మోపాల్సి వచ్చినా.. ఐపీసీ సెక్షన్ 405 (ప్రైవేటు వ్యక్తుల నమ్మకద్రోహం) మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఈ కేసులో గతేడాది జనవరి 25న సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారని, అప్పట్నుంచీ ఆయన జ్యుడీషియల్ రిమాం డ్లో ఉన్నారని... ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారితోపాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ సీబీఐ ఇప్పటికే సీజ్ చేసిందని, ఈ నేపథ్యంలో ఆధారాలను మాయం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సునీల్‌రెడ్డికి వ్యతిరేకంగా రంగారావు మాత్రమే సాక్ష్యం ఇచ్చారని.. అయితే, ఆయనకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదించి నిందితుడిగా తొలగించి సాక్షిగా మార్చిందని తెలిపారు. ఒకవేళ రంగారావు.. సునీల్‌రెడ్డికి అనుకూలంగా సాక్ష్యమిస్తే తిరిగి నిందితుడిగా పరిగణించబడతారని... అందువల్ల ఆయన ప్రభావితమయ్యే అవకాశమే ఉండదని చెప్పారు. పారదర్శకంగా తుదివిచారణ జరగాలంటే, నిందితులు సమర్థంగా తమ వాదన వినిపించుకోవాలంటే వారికి బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దర్యాప్తు పూర్తికాలేదన్న కారణంతో గతంలో కోర్టు సునీల్‌రెడ్డికి బెయిల్‌ను నిరాకరించిందని, ప్రస్తుతం దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సునీల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే, సునీల్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వాదనకు గడువు కావాలని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేయడంతో విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. -
ఎమ్మార్ ఆస్తులపై ఈడీ కొరడా
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ఆస్తులపై ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌లోని ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 25,810 చదరపు అడుగుల నివాస స్థలాన్ని అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002లోని సెక్షన్ 5(1) కింద ఈ ఆస్తుల అటాచ్మెంట్ జరిగినట్టు హైదరాబాద్‌లోని ఈడీ సంయుక్త సంచాలకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్థలాలు గచ్చిబౌలి, మణికొండ, బౌల్డర్ హిల్స్ కమ్యూనిటీ ప్రాంతాల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. అటాచ్మెంట్ అయినందున ఆయా స్థలాల కొనుగోలు, అమ్మకం, బదిలీ వంటివి చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక నానక్‌రాంగూడ ఐటీజోన్ పరిధిలోని ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఉన్న 19 విల్లాలకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు నోటీసులు అంటించారు. మూడు కారుల్లో ఇక్కడికి చేరుకున్న అధికారులు విల్లాలను, స్థలాలను పరిశీలించారు. అనంతరం ఈడీ ప్రాంతీయ జేడీ శ్రీధర్ సంతకంతో ఉన్న నోటీ సులను వాటికి అంటించి విషయాన్ని ఎమ్మార్ ప్రాపర్టీస్ జీఎం నళినీకాంత్‌కు వివరించారు. విల్లాలు కొనుగోలు చేసిన వారి నుంచి ఎక్కువ ధర వసూలు చేసిన ఎమ్మార్.. తక్కువ ధరకు అమ్మినట్టు చూపడంతో దాదాపు రూ.48 కోట్లు తేడా వచ్చిన విషయం సీబీఐ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. -
విజయరాఘవ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం
ఎమ్మార్ కేసులో నింతునిగా ఉన్న ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణ భారత ఇన్చార్జ్ విజయరాఘవ ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఈనెల 25 నుంచి అక్టోబరు 25 వరకు తన బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోనే ఉందని, ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న వారంతా కంపెనీ ఉద్యోగులేనని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయరాఘవ సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. తన బెయిల్ షరతులు సడిలించాలని కోరుతూ విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం విచారించారు. ఢిల్లీకి వెళ్లేందుకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరు, కొచ్చి, ముంబాయి వెళ్లేందుకైనా అనుమతించాలని విజయరాఘవ తరఫు న్యాయవాది నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.