సునీల్‌రెడ్డిని అక్రమంగా ఇరికించారు : శ్రీరామ్‌ | Sunilreddy's illegally framed in Emmar case : Lawyer Sriram | Sakshi
Sakshi News home page

సునీల్‌రెడ్డిని అక్రమంగా ఇరికించారు : శ్రీరామ్‌

Published Wed, Oct 2 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

సునీల్‌రెడ్డిని అక్రమంగా ఇరికించారు : శ్రీరామ్‌

సునీల్‌రెడ్డిని అక్రమంగా ఇరికించారు : శ్రీరామ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో సహ నిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌రెడ్డిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్‌ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మార్‌ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించారు. సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్‌ వాదిస్తూ.. ఐపీసీ సెక్షన్‌ 409 (ప్రభుత్వ ఉద్యోగి/బ్యాంకరు/వ్యాపారి/ఏజెంట్‌ నమ్మకద్రోహానికి పాల్పడడం) సునీల్‌రెడ్డికి వర్తించదని.. ఏపీఐఐసీ వ్యవహారాల్లో, ఎమ్మార్‌తో జరిగిన ఒప్పందంలో ఎక్కడా ఆయన పాత్ర లేదని తెలిపారు. ఒకవేళ సహ నిందితుడు రంగారావు వాంగ్మూలం ఆధారంగా అభియోగాలు మోపాల్సి వచ్చినా.. ఐపీసీ సెక్షన్‌ 405 (ప్రైవేటు వ్యక్తుల నమ్మకద్రోహం) మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.

ఈ కేసులో గతేడాది జనవరి 25న సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారని, అప్పట్నుంచీ ఆయన జ్యుడీషియల్‌ రిమాం డ్‌లో ఉన్నారని... ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారితోపాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్‌ మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ సీబీఐ ఇప్పటికే సీజ్‌ చేసిందని, ఈ నేపథ్యంలో ఆధారాలను మాయం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సునీల్‌రెడ్డికి వ్యతిరేకంగా రంగారావు మాత్రమే సాక్ష్యం ఇచ్చారని.. అయితే, ఆయనకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదించి నిందితుడిగా తొలగించి సాక్షిగా మార్చిందని తెలిపారు. ఒకవేళ రంగారావు.. సునీల్‌రెడ్డికి అనుకూలంగా సాక్ష్యమిస్తే తిరిగి నిందితుడిగా పరిగణించబడతారని... అందువల్ల ఆయన ప్రభావితమయ్యే అవకాశమే ఉండదని చెప్పారు.

పారదర్శకంగా తుదివిచారణ జరగాలంటే, నిందితులు సమర్థంగా తమ వాదన వినిపించుకోవాలంటే వారికి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దర్యాప్తు పూర్తికాలేదన్న కారణంతో గతంలో కోర్టు సునీల్‌రెడ్డికి బెయిల్‌ను నిరాకరించిందని, ప్రస్తుతం దర్యాప్తు పూర్తయినందున బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సునీల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే, సునీల్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వాదనకు గడువు కావాలని సీబీఐ డిప్యూటీ లీగల్‌ అడ్వయిజర్‌ బళ్లా రవీంద్రనాథ్‌ విజ్ఞప్తి చేయడంతో విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement