
బేకరీలో పేలిన గ్యాస్ సిలిండర్
- మూడంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు
- 10 లక్షల ఆస్తి నష్టం
నగరం నడిబొడ్డున.. నిత్యం రద్దీగా ఉండే శ్రీనివాస థియేటర్ సమీపంలోని ఓ బేకరీలో శనివారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మూడంతస్తులపైకి వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల దుకాణాలను మూసేశారు. భయంతో జనం పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టమూ కలగలేదు.
తిరుపతి క్రైం,న్యూస్‌లైన్ : తిరుపతిలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని సాయిబాబా గుడికి ఎదురుగా న్యూ బెంగళూరు బేకరీ ఉంది. దీన్ని హెచ్‌డీ శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. బేకరీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. మొదటి అంతస్తులో బేకరీకి సంబంధించిన ఐటమ్స్,ఫుడ్‌ఐటమ్స్‌ను తయారు చేస్తారు. ఇక్కడ కొన్ని మిషన్లు కూడా ఉన్నాయి. బేకరీలో ఆరుగురు వర్కర్లు పనిచేస్తున్నారు. బేకరీకి కుడివైపున పసుపర్తి సూపర్‌మార్కె ట్, ఎడమవైపున శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, గ్రామీణ బ్యాంక్ శాఖతో పాటు ఇతర కార్యాలయాలు ఉన్నా యి.
ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బేకరీ ఉన్న మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మొదటి అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వ్యాపించాయి. సిలిండర్ పేలడంతో చుట్టుపక్కల ఉన్న దుకాణాలను మూసేశారు. జనం పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.
సిలిండర్ పేలిన సమయంలో మొదటి అంతస్తులో వర్కర్లు లేక పోవడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఆ సమయంలో బేకరీ యజమాని శ్రీనివాస్ భోజనానికి ఇంటికి వెళ్లారు. వర్కర్లు బేకరీలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొదటి అంతస్తులో 60 లీటర్ల డీజిల్ ఉన్నట్టు తెలిసింది. ఉదయం నుంచీ శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా లేదు.
స్పందించిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది
బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక అధికారి రమణయ్య సిబ్బంది తో కలసి రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలు పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. వెస్ట్,ఈస్ట్ ఎస్‌ఐలు వినోద్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు ఈశ్వర్, రామయ్య, రవితేజ,దేవ సకాలంలో స్పందించి గ్యాస్ సిలిండర్ పేలిన ప్రాంతంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు. వాహనదారులను, ప్రజలను అటువైపు రాకుండా కట్టడి చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మంటల ను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిం చారు. 10 లక్షల రూపాయలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బేకరీ యజమాని శ్రీనివాస్ ఈస్ట్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన కేసు దర్యాప్తు చేస్తున్నారు.