త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని జిల్లాలో ముస్లిం సోదరులు బుధవారం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక నమాజ్ చేశారు. కడప నగరంలోని బిల్టప్ వద్ద నిర్వహించిన ప్రార్థనలకు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఏకేశ్వరుడైన అల్లాహ్‌ను భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.మత గురువులు పండుగ విశిష్టతను వివరించారు.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే పండుగల్లో ఒకటైన బక్రీద్‌ను బుధవారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాలు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. కడప నగరంలోని దాదాపు 70 మసీదుల్లో ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప నగర పరిధిలోని బిల్టప్ వద్ద జిల్లా వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు సయ్యద్‌షా ముఫ్తి మహ్మద్ న్యాయమతుల్లా ఆధ్వర్యంలో కొనసాగాయి.
ఈ సందర్భంగా ఆయన పండుగ సందేశాన్ని ఇస్తూ బక్రీద్ పండుగ త్యాగం గొప్పతనాన్ని వివరిస్తుందని తెలిపారు. భక్తుని త్యాగం దైవాన్ని ఎంతగా ఆకట్టుకుంటుందో ఆయన వివరించారు. భక్తుడు పవిత్రమైన మనస్సును సమర్పిస్తే చాలు అని, ఎన్ని ‘జుబా’లు కూడా దానికి సాటిరావని దైవం బోధించారన్నారు. మానవుడు తన విధి నిర్వహణతోపాటు నిరంతరం దైవ నామస్మరణతో,నైతిక విలువలతో జీవించాలని తెలిపారు. భక్తుడు తన పవిత్రమైన ఆత్మను దైవానికి త్రికరణ శుద్ధిగా అర్పించాలని, అప్పుడే ఆయన మన బలిదానాలను స్వీకరిస్తాడని తెలిపారు.
అనంతరం ఆయన భక్తులతో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ప్రార్థనలకు భారీ స్థాయిలో హాజరైన ముస్లిం సోదరులు ప్రార్థనలనంతరం ఒకరినొకరు గాఢంగా హత్తుకుని ‘ఈద్ ముబారక్’చెప్పుకున్నారు. మత గురువులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా కార్యక్రమానికి నగర ప్రముఖులు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించారు. పోలీసులు ట్రాఫిక్‌ను ముందే నియంత్రించడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. ప్రార్థనల్లో నగర ప్రముఖులు అమీర్‌బాబు, సుబాన్‌బాష, పెద్దదర్గా ప్రతినిధులు అమీర్, మయానా ఆరీఫ్, మున్నా, ఇంకా పలువురు పాల్గొన్నారు.
ఘనంగా బక్రీద్
Published Thu, Oct 17 2013 2:00 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement