సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి అవసరమయ్యే నెయ్యిని తిరుపతిలోని బాలాజీ డెయిరీ నుంచి కొనుగోలు చేసేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి అంగీకరించింది. ఆదివారం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ విలేకరులకు వివరాలను వెల్లడించారు. అవి...
శ్రీవారి ఆలయంలో నిత్యం 2.5 లక్షల లడ్డూలు, నిత్యాన్న ప్రసాదాల తయారీ కోసం రోజుకు 9 వేల కిలోలనెయ్యి వాడతారు. ఇందుకుగాను రెండు నెలలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలి నుంచి రోజుకు ఓ ట్యాంకర్ (10 వేల కిలోలు) నెయ్యిని కిలో రూ. 273.95 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసమే అన్నట్టుగా రాజకీయ ఒత్తిళ్లతో నెయ్యి కాంట్రాక్టును బరేలీ డెయిరీకి అప్పగించారని టీటీడీపై విమర్శలొచ్చాయి. అంతేగాక నెయ్యి లో నాణ్యత లోపించిందని ఇటీవల 2 ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఈ క్రమంలో విమర్శలు ఎక్కువకావడంతో, సహకార వ్యవస్థలోని తిరుపతి బాలాజీ డెయిరీ నుంచి కూడా తిరుమలకు అవసరమయ్యే నెయ్యిలో నాలుగో వంతును కొనుగోలు చేస్తారు. అవసరాన్నిబట్టి కొనుగోలును పెంచుతారు. బరేలీ డెయిరీతో కుదుర్చుకున్న ఏడాది నెయ్యి కాంట్రాక్టు యథావిధిగా కొనసాగుతుంది.
మరికొన్ని తీర్మానాలు..
తిరుమలలో పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు 1,520 వాహనాలకు సరిపోయే విధంగా రూ. 50 కోట్ల అంచనాతో రెండు భారీ మల్టిపుల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నారు.
శ్రీవారికి ప్రతి శుక్రవారం వస్త్రాలంకార సేవ కోసం రూ. 50 వేలతో కొనుగోలు చేసే మేల్‌చాట్ వస్త్రాన్ని ఇకపై భక్తుల నుంచే విరాళంగా స్వీకరిస్తారు.
రూ. 5.59 కోట్లతో 81 వేల కిలోల చక్కెర, రూ. 5 కోట్లతో 37వేల డబ్బాల సూర్యకాంతి నూనె, రూ. 2.20 కోట్లతో 22 లక్షల కొబ్బరికాయలు, రూ. 2.57 కోట్లతో 20 వేల కిలోల యాలకులు, సుమారు రూ. 3 కోట్లతో రూ. 2 కోట్ల లడ్డూ పాలీథిన్ సంచులు కొనుగోలు చేస్తారు.
శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వక్షస్థల లక్ష్మికి రూ. 64 లక్షల ఖర్చుతో నూతన బంగారు గొడుగులు అమర్చనున్నారు.
తలనీలాలను భద్రపరిచేందుకు రూ.6 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్ నిర్మిస్తారు. నల్గొండ జిల్లా మట్టపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ. 1.40 కోట్లతో యాత్రీసదన్ నిర్మించనున్నారు.
రూ. 3 కోట్ల పైబడిన టెండర్ల షెడ్యూల్డ్‌లను జాతీయ స్థాయిలో మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని కోటపల్లెలోని వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం రూ. 65 లక్షల గ్రాంటుకు ఆమోదించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం సెలవుదినం కావటంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,346 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనంకోసం 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న రూ.300 టికెట్ల వారికి 3 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో ఉన్నా రు. వీరికి సుమారు 5 గంటల సమయం పడుతోంది.