Published
Tue, Feb 7 2017 11:17 AM
| Last Updated on Sat, Jul 28 2018 6:51 PM
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర‍్గంలో తలెత్తిన రాజీనామా రాజకీయాలపై సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ఆరాతీశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష‍్ణ, ముఖ‍్యమంత్రి తనయుడు లోకేష్ ఇద‍్దరూ మంగళవారం సీఎంతో భేటీ అయ్యారు. హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష‍్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ‍్యమంత్రి ఆదేశించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత‍్సహించరాదని, అందరూ ఏకతాటిపై నడవాలని, గ్రూపు రాజకీయాలకు కారణమైన ఎవరినీ పార్టీ క్షమించదని చంద్రబాబు హెచ‍్చరించారు.
హిందూపురం టీడీపీలో కొద్దిరోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ ఆ పార్టీ అధిష్ఠానాన్ని తాకింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగిస్తూ హిందూపురం వదిలి వెళ్లిపోవాలని సోమవారం రాత్రే ఆదేశించారు. దీంతో సోమవారం అర్ధరాత్రి హిందూపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బాలకృష్ణ పీఏ శేఖర్ రెండున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతూ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తూ అక్రమార్జనకు తెర లేపారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమావేశపరచి శేఖర్ వ్యతిరేకులను ఏకంచేశారు. అతన్ని తొలగించకపోతే తాము రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. అన్నట్లుగానే లేపాక్షి, చిలమత్తూరు మండల జడ్పీటీసీ సభ్యులతో రాజీనామాలు కూడా చేయించారు.
ఆపై వారం రోజులు సమయమిచ్చి తాడోపేడో తేల్చుకోవాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, అలాగే హిందూపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరహార దీక్షలు చేస్తామని పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో బాలకృష్ణతో పాటు పార్టీ అధిష్ఠానం దిగి రావాల్సి వచ్చింది. ''పార్టీలో ఎవరు తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తప్పవు.. అది నేనైనా, బంధువైనా, పార్టీనాయకులైనా'' అని బాలకృష్ణ ఇటీవల నిమ్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం బాలకృష‍్ణ, నారా లోకేష్ ముఖ‍్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. పీఏని వెంటనే తొలగిస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ముఖ‍్యమంత్రి అధికారులను ఆదేశించారు.