pa sekhar
-
పంచాయితీ నేడే!
– హిందూపురం విభేదాల నేపథ్యంలో నేడు బాలయ్య రాక! – పీఏ శేఖర్‌తో పాటు అసమ్మతి వర్గంతో చర్చలు..ఏకతాటిపైకి తెచ్చే యత్నం – శేఖర్ తొలగింపు మినహా మరో చర్చకు ఒప్పుకోబోమంటున్న వ్యతిరేకవర్గం – వ్యతిరేక వర్గం వెనుక ఎవరున్నారని జిల్లాపార్టీతో పాటు రాష్ట్ర పార్టీలోనూ తీవ్ర చర్చ – నేను జోక్యం చేసుకోను.. బాలయ్యతోనే తేల్చుకోండన్న సీఎం (సాక్షిప్రతినిధి, అనంతపురం) హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను తొలగించాలని కొద్దిరోజులుగా నడుస్తోన్న పోరు ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై టీడీపీలో కూడా పలు రకాలుగా ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి ‘పవర్‌సెంటర్’ బాలయ్య. మరి ఆయన పీఏనే తొలగించాలని ఉద్యమిస్తున్నారంటే వీరి వెనుక అంతకంటే పెద్ద ‘పవర్’ ఉండి కథ నడిపిస్తోందా? వ్యతిరేకవర్గం టార్గెట్ పీఏనా? లేదంటే బాలయ్యపై అవినీతి మరక అంటించి నియోజకవర్గంలో బలహీనపరిచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పురంపై బాలయ్య నిర్లక్ష్యమే ప్రధాన కారణం బాలకృష్ణ పీఏ శేఖర్‌పై ఆదినుంచి ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జన్మభూమి ఇప్పటి వరకూ నాలుగు దఫాలు జరిగితే, ఒక్కరోజూ హాజరుకాని ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో బాలకృష్ణ ఒక్కరే! ఈ ఒక్క ఉదాహరణ చాలు నియోజకవర్గాన్ని బాలయ్య ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో! ప్రజా సమస్యలపైనా ఎంత చులకన భావం ఉందో ఇట్టే తెలుస్తోంది. పైగా జన్మభూమిలో ఆయన పీఏ శేఖర్ అధికారులతో ప్రభుత్వ వేదికను పంచుకున్నారు. అధికారులు కూడా శేఖర్‌ను ఎమ్మెల్యేలా భావించి కార్యక్రమాన్ని నడిపించారు. జన్మభూమితో పాటు చాలా అధికారిక కార్యక్రమాల్లో శేఖర్ పాల్గొన్నారు. దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. బాలకృష్ణ కూడా శేఖర్‌ను మందలించకుండా మద్దతుగా నిలుస్తూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరించారని పార్టీనేతలు చెబుతున్నారు. అధికారుల బదిలీలు, ఇతరత్రా వ్యవహారాలను కూడా శేఖరే చూస్తున్నారనేది బహిరంగ సత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూపురానికి అనధికారిక ఎమ్మెల్యేగా శేఖర్ ఇన్నిరోజులూ వ్యవహరించారు. ఇది బాలకృష్ణకూ తెలుసు. హిందూపురం నియోజకవర్గంలో ప్రధాన ఆదాయవనరులైన కొడికొండ చెక్‌పోస్టు, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ఆర్టీఏతో పాటు పలు కీలకశాఖల నుంచి ప్రతినెలా రూ.70 లక్షలు వసూలు చేసి బాలకృష్ణకు పంపుతారనే భావన హిందూపురం అధికారులతో పాటు ప్రజల్లోనూ ఉంది. నెలవారీ మామూళ్లు తక్కువగా ఇచ్చిన వారితో ‘నేనేం ఇంటికి తీసుకెళుతున్నానా? తక్కువైతే వసుంధర మేడం వాయించేస్తుంది’ అని బాలయ్య సతీమణి పేరు చెప్పేవాడని కొందరు అధికారులు అంటున్నారు. రీచ్‌లు ఉన్నప్పుడు ఇసుక మాఫియానే ప్రతినెలా రూ.50 లక్షలు ఇచ్చేదని తెలుస్తోంది. ఈ లెక్కన 32 నెలల్లో ఎంత వసూలైంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ డబ్బు బాలకృష్ణ భార్యకు ఇచ్చారా? లేదంటే వారి పేరుతో శేఖర్ స్వాహా చేశాడా? అనే అనుమానాలు ‘పురం’ టీడీపీ నేతలతో పాటు అందరిలోనూ ఉన్నాయి. ఇకపోతే ఇన్నిరోజులై మౌనంగా ఉండి, ఇప్పుడు శేఖర్ అవినీతికి పాల్పడుతున్నారు, తొలగించాల్సిందేనంటూ పార్టీనేతలు సీసీ వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ ఉద్యమించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వ్యతిరేక వర్గం వెనుక ఎవరున్నట్లు! బాలకృష్ణ పీఏపై ఉద్యమించడమంటే ఒకరకంగా బాలయ్యపై ఉద్యమించడమే! ఎప్పుడు, ఎలా ఉంటారో తెలీని బాలయ్య ‘నా పీఏను తొలగించాలని ఉద్యమిస్తారా?’అని వ్యతిరేకవర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించేందుకూ వెనుకాడరు. ఇవన్నీ తెలిసి, వీటికి తెగించి శేఖర్‌పై పోరాటం చేస్తున్నారంటే వీరి వెనుక ఎవరున్నారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. చంద్రబాబుకు తెలిసే ఈ తంతు నడుస్తోందనే అనుమానాలు ఉన్నాయని, ఇది ఎందుకు చేస్తున్నారనే దానిపై పూర్తి స్పష్టత రాలేదని టీడీపీ నేత ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ఇదిలావుండగా, శేఖర్ కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది. ఇతన్ని తప్పనిసరిగా తొలగించే పరిస్థితిని కల్పించింది. ఆడియో విషయాన్ని వ్యతిరేకవర్గం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలయ్యకు సంబంధించిన అంశం కావడంతో ఆయనతోనే తేల్చుకోవాలంటూ సీఎం బంతిని బాలయ్య కోర్టులోనే వేసినట్లు తెలిసింది. బాలయ్య మంగళవారం ఉదయం సీఎంను కలిసిన సందర్భంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విభేదాలు లేకుండా చూడాలని బాలయ్యకు సీఎం సూచించారు. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా మీడియాతో చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా నేడు హిందుపురానికి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీఏను తొలగిస్తే ఇన్నిరోజులూ చేసిన వసూళ్లకు బాలయ్యే కారణమని శేఖర్ కుండబద్దలు కొట్టే అవకాశముంది. తొలగించకపోతే అవినీతిని, అరాచకాన్ని బాలయ్య వెనుకేసుకొచ్చినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇరువర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలని బాలయ్య ఉన్నారు. అయితే అతన్ని తొలగింపు మినహా మరే సర్దుబాటుకూ ఒప్పుకునేది లేదని అసమ్మతి నేత అంబికా లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో స్పష్టం చేశారు. అన్నింటికీ తెగించే ఉద్యమిస్తున్నామని, పార్టీ పరువు నిలవాలంటే శేఖర్‌ను తప్పించాలని, ఈ విషయంలో ఎంత వరకైనా ముందడుగు వేస్తామని అన్నారు. ఈక్రమంలో నేటి పంచాయితీలో బాలయ్య తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే! -
బాలకృష్ణ పీఏ శేఖర్ తొలగింపు: సీఎం ఆదేశం
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తలెత్తిన రాజీనామా రాజకీయాలపై సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ఆరాతీశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఇద్దరూ మంగళవారం సీఎంతో భేటీ అయ్యారు. హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించరాదని, అందరూ ఏకతాటిపై నడవాలని, గ్రూపు రాజకీయాలకు కారణమైన ఎవరినీ పార్టీ క్షమించదని చంద్రబాబు హెచ్చరించారు. హిందూపురం టీడీపీలో కొద్దిరోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ ఆ పార్టీ అధిష్ఠానాన్ని తాకింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగిస్తూ హిందూపురం వదిలి వెళ్లిపోవాలని సోమవారం రాత్రే ఆదేశించారు. దీంతో సోమవారం అర్ధరాత్రి హిందూపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బాలకృష్ణ పీఏ శేఖర్ రెండున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతూ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తూ అక్రమార్జనకు తెర లేపారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమావేశపరచి శేఖర్ వ్యతిరేకులను ఏకంచేశారు. అతన్ని తొలగించకపోతే తాము రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. అన్నట్లుగానే లేపాక్షి, చిలమత్తూరు మండల జడ్పీటీసీ సభ్యులతో రాజీనామాలు కూడా చేయించారు. ఆపై వారం రోజులు సమయమిచ్చి తాడోపేడో తేల్చుకోవాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, అలాగే హిందూపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరహార దీక్షలు చేస్తామని పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో బాలకృష్ణతో పాటు పార్టీ అధిష్ఠానం దిగి రావాల్సి వచ్చింది. ''పార్టీలో ఎవరు తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తప్పవు.. అది నేనైనా, బంధువైనా, పార్టీనాయకులైనా'' అని బాలకృష్ణ ఇటీవల నిమ్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం బాలకృష్ణ, నారా లోకేష్ ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. పీఏని వెంటనే తొలగిస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. -
పీఏ కావాలో.. పార్టీ నేతలు కావాలో తేల్చుకో!
-
పీఏ కావాలో.. పార్టీ నేతలు కావాలో తేల్చుకో!
► వారం రోజులే డెడ్‌లైన్ ► బాలకృష్ణకు తేల్చిచెప్పిన హిందూపురం టీడీపీ నేతలు చిలమత్తూరు: ‘‘వారం రోజులే డెడ్‌లైన్.. ఆలో పు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వ్యక్తి గత కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయ డంతో పాటు హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్ర హం ఎదుటే నిరాహార దీక్ష చేస్తాం.. పీఏ కావాలో పార్టీ నేతలు కావాలో బాలకృష్ణనే నిర్ణయించుకోవాలి’’ అని అనంతపురం జిల్లాల హిందూపురం టీడీపీ అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఎమ్మె ల్యే పీఏ, ఆయన వర్గీయులకు వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, నాయకులు అంబికా లక్ష్మీ నారా యణ తదితర నేతలు చిలమత్తూరులో భారీ సమావేశం, ర్యాలీ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే బాలకృష్ణ పీఏ శేఖర్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసులతో 144 సెక్షన్, 30 యాక్టు అమలు చేయించారు. దీంతో మండలంలోని 11 పంచాయతీల వారీగా 40 మంది పోలీసు అధికారుల పర్యవేక్షణలో సుమారు 450 పోలీసులు మోహరించారు. వెనక్కు తగ్గని అసమ్మతి నాయకులు చిలమత్తూరులో పోలీసులు మోహరింపు నేపథ్యంలో అసమ్మతి నాయకులు మండలానికి సరిహద్దు ప్రాంతమైన బాగేపల్లి షాదీమహల్ వద్ద సమావేశం నిర్వహించా లనుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అక్కడి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారంతా సమీపంలోని సుంకులమ్మ ఆలయం వద్ద సమావేశమయ్యారు. అయినప్పటికీ బాగేపల్లి ఎస్ఐ వెంకటేశులు, సిబ్బంది అడ్డు చెప్పడంలో ఆలయ సమీపం లోని బాబురెడ్డి తోటలో సమావేశం నిర్వహించారు. అవినీతి శేఖర్‌ను తరుముదాం.. నియంత పాలన చేస్తున్న ఎమ్మెల్యే పీఏ శేఖర్, ఆయన వర్గీయులను పంపేవరకు పోరాటం ఆగదని మాజీ ఎమ్మె ల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ తేల్చిచె ప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే సమావేశాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. శేఖర్‌ను ఇక్కడి నుంచి పంపిస్తేనే టీడీపీ బతుకు తుందని స్పష్టం చేశారు. అవినీతి శేఖర్‌ను తరుముదాం.. పార్టీని బలోపేతం చేద్దామని నినదించారు. కార్యక్రమంలో మాజీ సర్పం చ్‌లు, మాజీ ఎంపీపీలు, కన్వీనర్లు, సుమారు 1,500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాలకృష్ణకు టీడీపీ నేతల అల్టిమేటం
-
బాలకృష్ణకు టీడీపీ నేతల అల్టిమేటం
అనంతపురం: సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తీవ్రమైంది. వారం రోజుల్లోగా ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగించాలని అసంతృప్త టీడీపీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శేఖర్‌ను తొలగించకపోతే హిందూపురంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహారదీక్షలు చేస్తామని చెప్పారు. ఆదివారం హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరులో టీడీపీ అసంతృప్త నాయకులు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు చిలమత్తూరులో 144 సెక్షన్ విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పొరుగునే ఉన్న కర్ణాటకలోని బాగేపల్లిలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. శేఖర్ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ రాజీనామా చేశారు. అసంతృప్త నేతలు, శేఖర్ వర్గీయులు నియోజకవర్గంలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. -
బాలయ్య ఇలాకాలోలో టెన్షన్..టెన్షన్
► హిందూపురంలో మిన్నంటిన ‘అసమ్మతి’ రాగం ► ఎమ్మెల్యే పీఏను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం తీవ్ర ప్రయత్నాలు ► ఉనికిని కాపాడుకునేందుకు పీఏ శేఖర్ పాట్లు హిందూపురం : టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉంటున్న హిందూపురంలో ‘తమ్ముళ్ల’ మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఒకవైపు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ వర్గీయులు, మరోవైపు అసమ్మతిని లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు, బలనిరూపణలతో ‘పురం’ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వీరి కుమ్ములాటలతో పార్టీ కంచుకోటకు బీటలు కూడా వారాయి. ‘చూడు ఒక వైపే చూడు.. రెండో వైపు చూడొద్దు.. తట్టుకోలేవు’ అని సినిమా డైలాగులతో హూంకరించే ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ వైపు చూస్తారోనన్న ఆసక్తి నెలకొంది. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక్కడి పెత్తనమంతా పీఏ శేఖర్‌కు అప్పగించారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన అవినీతికి తెరలేపారని, భారీఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. పీఏను ఇక్కడి నుంచి పంపించకపోతే తాము రాజీనామా చేస్తామని అల్టివేటం ఇచ్చారు. అందులో భాగంగానే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ శనివారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా అసమ్మతినేతలు చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి నాయకులను కూడగడుతున్నారు. పోటాపోటీగా బలప్రదర్శన ర్యాలీలు.. అసమ్మతి నాయకులు నాలుగురోజులుగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ర్యాలీలు చేపట్టారు. ర్యాలీలు, సమావేశాలు చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని, సస్పెండ్ చేస్తుందని హెచ్చరిస్తూ వచ్చిన పీఏశేఖర్ వర్గీయులు కూడా తమకు బలం ఉందని నిరూపించుకోవడానికి శుక్రవారం లేపాక్షి మండలకేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అయితే.. వందమంది కూడా లేక అభాసుపాలయ్యారు. కొన్ని గ్రామాలకు వాహనాలు పంపినా కార్యకర్తలు రాలేదని సమాచారం. లేపాక్షి నంది విగ్రహం నుంచి మొదలైన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పీఏ శేఖర్, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరుకు చెందిన కొందరు నాయకులు మాత్రమే పాల్గొన్నారు. చిలమత్తూరులో హైటెన్షన్.. చిలమత్తూరులో ఆదివారం భారీ ర్యాలీతో పాటు సమావేశం నిర్వహించి తీరుతామని అసమ్మతి నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, సీసీవెంకటరాముడు తదితరులు చెబుతున్నారు. అవసరమైతే కర్ణాటక సరిహద్దులో చేస్తామంటున్నారు. పోలీసులతో అడ్డుకుంటే నిరాహారదీక్షలు చేస్తామని, అరెస్టులు చేస్తే జైలులో కూడా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే.. సమావేశం ఎలా జరుగుతుందో చూస్తామని ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులు సవాల్ చేస్తున్నారు. కాగా.. చిలమత్తూరులో భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. 144సెక్షన్‌తో పాటు 30యాక్ట్ అమలు చేశారు. సభలు, సమావేశాలు చేయరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. అసమ్మతి నేతలతో బీకే, కాలవ చర్చలు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగా అసమ్మతి లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చర్చలు జరిపారు. పరిగి జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ కుమారుడి వివాహం శనివారం రాత్రి సోమందేపల్లిలో జరిగింది. ఈ వేడుకకు హాజరైన బీకే, కాలవ స్థానిక వెంకటేశ్వర కల్యాణ మంటపంలో అసమ్మతి నేతలతో అరగంట పాటు చర్చించారు. అయితే.. పీఏ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. -
బాలయ్య ఇలాకాలోలో టెన్షన్..టెన్షన్
-
బాలకృష్ణ పీఏ తిట్లపురాణం
♦ హిందూపురం నియోజకవర్గంలో శేఖర్ ఇష్టారాజ్యం ♦ సభ్యసమాజం తలదించుకునే రీతిలో కాంట్రాక్టర్‌కు తిట్లు ♦ వాట్సప్‌లో హల్చల్ చేస్తుతున్న ఆడియో సంభాషణలు ♦ బాలకృష్ణ దన్నుతోనే శేఖర్ అరాచకాలంటున్న టీడీపీ నేతలు సాక్షి, అమరావతి/ సాక్షిప్రతినిధి, అనంతపురం/ హిందూపురం అర్బన్: సినీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు శేఖర్ హల్చల్ చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో టెండర్లలో షెడ్యూలు దాఖలు చేసిన అనంతపురం నగరానికి ఓ కాంట్రాక్టర్‌ను ‘ఫోన్’లో తీవ్ర స్థాయిలో బెదిరించారు. పత్రికలో రాయడానికి వీలులేని భాషలో.. సభ్య సమాజం తలదించుకునే రీతిలో బూతు పురాణం అందుకున్నారు. పీఏ శేఖర్ ఫోన్ బెదిరింపుల వ్యవహారం వాట్సప్‌లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. రెండున్నరేళ్ల నుంచి పీఏ శేఖర్ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని.. బాలకృష్ణ దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. శేఖర్ దోపిడీ, అరాచకాలకు బాలకృష్ణ అండదండలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఏ పనులకు టెండర్లు నిర్వహించినా.. పీఏ శేఖర్ అక్కడికి వాలిపోయి తనకు కమీషన్లు ఇచ్చేవారికే పనులు అప్పగించేలా అధికారులపై ఒత్తిడి తెస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనను కాదని టెండర్లలో ఎవరైనా పాల్గొంటే.. తీవ్ర స్థాయిలో బెదిరించి, పోలీసులను ఉసిగొలిపి పారిపోయేలా చేస్తారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ హిందూపురం మున్సిపాల్టీ పరిధిలో ఒక టెండర్లో షెడ్యూలు దాఖలు చేశారు. తనను కాదని షెడ్యూలు దాఖలు చేసిన వ్యక్తిని ఆదిలోనే బెదిరించిన పీఏ శేఖర్.. తన కార్యాలయానికి వచ్చి కలవాలని హుకుం జారీ చేశారు. దాంతో కాంట్రాక్టర్ పీఏ శేఖర్ కార్యాలయానికి వెళ్లారు. కానీ.. కార్యాలయంలో అప్పటికే చాలామంది ఉండటంతో ఏమీ మాట్లాడకుండానే కాంట్రాక్టర్‌ను పంపేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు పీఏ శేఖర్ ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో బెదిరించిన ఆడియో వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ బెదిరింపు ఘటన తర్వాత కాంట్రాక్టర్.. శేఖర్‌ను కలిసి చర్చించి గుడ్‌విల్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. విభేదాలతో వెలుగులోకి ఆడియో హిందూపురం నియోజకవర్గ నాయకుల్లో నెలకొన్న ముసలంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శేఖర్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ బాహాటంగానే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ.. శేఖర్ తీరుకు నిరసనగా రాజీనామా కూడా చేశారు. ఇదే క్రమంలో శేఖర్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు కాంట్రాక్టర్ బెదిరింపు ఆడియోను వాట్సాప్‌లో పోస్టు చేశారు. మరోవైపు బల ప్రదర్శన కోసం శేఖర్ శనివారం లేపాక్షి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీకి అనుకున్నస్థాయిలో కార్యకర్తలు హాజరు కాలేదు. మొత్తం 10 వేల మందితో చేయాలని నిర్ణయించినా.. కేవలం 100 మంది మాత్రమే హాజరయ్యారు. బాలకృష్ణ పీఏ శేఖర్ ఆడియో సారాంశం.. పీఏ శేఖర్: ఏమిటి విశేషాలు? కాంట్రాక్టర్: ఏమీ లేవన్నా. మీరే చెప్పాలన్నా. పీఏ శేఖర్: ఏమీ..? కాంట్రాక్టర్: విశేషాలు ఏమీ లేవన్నా.. మీరే చెప్పాలన్నా. పీఏ శేఖర్: ఏమేమీ..? కాంట్రాక్టర్: పొద్దున మీ దగ్గరికి వచ్చాను. చాలామంది ఉంటే మాట్లాడలేదు. మున్సిపాల్టీలో లెస్(తక్కువ ధర)కు టెండర్లు వేశాను. పీఏ శేఖర్: (రాయడానికి వీలు లేని భాషలో బూతుపురాణం.. ఆ తర్వాత మాట్లాడుతూ) నిన్నెవడ్రా నా కొడకా హిందూపురంలో టెండర్ వేయమన్నది? చెప్పుతో కొడతా నాకొడకా.. హిందూపురంలో కన్పిస్తే తాట తీస్తా నా కొడకా. కాంట్రాక్టర్: అన్నా.. మీతో ఇప్పటికే మాట్లాడాను. బాలాజీ కూడా ఉన్నారు. మీతో మాట్లాడే టెండర్లు వేశా. పీఏ శేఖర్: బాలాజీ ఎవడ్రా నాకొడకా.. వాణ్నీ నిన్నూ ఇద్దర్నీ చెప్పుతో కొడతా. వానితో ఏమాట్లాడినావ్ రా నాకొడకా. కాంట్రాక్టర్:అన్నా.. నేను ఏమీ దొంగను కాదు. మేం పనులు చేసుకుంటేనే బతికేది. పూలకుంటలో ఇప్పటికే పనులు చేస్తున్నా. అందుకే టెండర్లు వేశా. తప్పు ఏమీ చేయలేదు. పీఏ శేఖర్: చెప్పుతో కొడతా నాకొడకా.. అనంతపురానికి నా మనుషులను పంపి స్తా. పనులు ఇప్పించరా నాకొడకా. కాంట్రాక్టర్: అన్నా.. నేను కాంట్రాక్టర్‌ను.. ఎక్కడైనా టెండర్లు వేసుకుంటా.. పనులు చేసుకుంటా. పీఏ శేఖర్: చెప్పుతో కొడతా నాకొడకా.. ధైర్యం ఉంటే హిందూపురం రారా నా కొడకా.. నువ్ రారా హిందూపురం. (బూతుపురాణం) కాంట్రాక్టర్: అన్నా.. పనులు చేసుకుంటేనే కదా మేం బతికేది. పీఏ శేఖర్: నీకొకడికేనేమిరా తెలివి నా కొడకా.. హిందూపురం రారా నాకొడకా నీ తాట తీస్తా. -
బాలయ్యకు షాకిచ్చిన తమ్ముళ్లు
-
బాలయ్యకు షాకిచ్చిన తమ్ముళ్లు
అనంతపురం: ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి పోరు తీవ్రమైంది. బాలకృష్ణ పీఏ శేఖర్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపిస్తూ నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలు రాజీనామా చేశారు. అలాగే ఆదివారం హిందూపురంలో టీడీపీ అసంతృప్త నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. బాలకృష్ణకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా ఉన్న చంద్రశేఖర్ (శేఖర్) నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సైతం లంచాలు తీసుకుని అవినీతిలో కూరుకుపోయాడని ఆరోపిస్తూ, లంచగొండి పీఏను తరిమికొట్టాలని స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు.. శేఖర్ మితిమీరిన జోక్యానికి చెక్‌పెట్టేలా చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ ప్రాంతాల్లో అసమ్మతి సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారోనని స్థానిక నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంబంధిత వార్తలు చదవండి బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు బాలకృష్ణ పీఏను తరిమేద్దాం -
బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు
హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ మద్దతుదారులు ఒక వర్గంగా, అసమ్మతి నాయకులైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, వారి అనుచరులు మరో వర్గంగా ఏర్పడి సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నారు. పరస్పరం ప్రదర్శనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. హిందూపురం : కొన్ని రోజులుగా ఎమ్మెల్యే పీఏ శేఖర్‌పై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు ఆయన మితిమీరిన జోక్యానికి చెక్‌పెట్టేలా చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ ప్రాంతాల్లో అసమ్మతి సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో ఆత్మరక్షణలో పడిన శేఖర్ వర్గీయులు బలప్రదర్శన ర్యాలీలు, బహిరంగ సభలకు దిగారు. (చదవండి : బాలకృష్ణ పీఏను తరిమేద్దాం ) ఇందులో భాగంగా గురువారం చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబాను వర్గీయులు బలప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. బీసీ కాలనీలోని షాదీమహల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ పార్టీలో గ్రూపులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వారు చిలమత్తూరులో 5వ తేదీ సమావేశం ఎలా నిర్వహిస్తారో చూస్తామని, వారిని ఇక్కడ అడుగుపెట్టనివ్వబోమని ఎంపీపీ భర్త మన్సూర్, నాయకులు అన్సార్, అంజినప్ప సవాల్ చేశారు. ర్యాలీకి లబ్ధిదారులు.. సభకు సంఘాల మహిళలు చిలమత్తూరు మండలంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 502 మందినీ పింఛన్లు ఇస్తామని చెప్పి మండల కార్యాలయానికి పిలిపించారు. తమతో వస్తేనే పింఛన్ ఇస్తామని చెప్పి శేఖర్ అనుకూల వర్గీయులు వారిని గురువారం ర్యాలీకి తీసుకెళ్లారు. అలాగే దేమకేతేపల్లి, గాడ్రాళ్లపల్లి, బ్రహ్మేశ్వరంపల్లి, తదితర గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు సమావేశం ఉందని చెప్పి పిలిపించి ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొనేలా చూశారు. మూకుమ్మడి రాజీనామాలకు సై విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ముఖ్యనాయకులు అసమ్మతివాదుల వైపు చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తాము కూడా మూక్ముడిగా రాజీనామాలు చేస్తామని మున్సిపల్ వైస్‌చైర్మన్ రాము, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఆర్ఎంఎస్ షఫీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సీసీ వెంకటరాముడు ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయగా నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. చైర్పర్సన్ లక్ష్మీ అనుకూలురైన కౌన్సిలర్లు కూడా అసమ్మతివాదులతో చేరిపోయారు. శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపడానికి ఒక పథకం ప్రకారం ఇదంతా జరుగుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని నాయకులందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ తన ముఖ్య అనుచరుడి వైపు మొగ్గుచూపుతారా? నాయకుల ఒత్తిడికి తలవంచుతారా? అనేది వేచి చూడాల్సిందే. -
బాలకృష్ణ పీఏను తరిమేద్దాం
► పీఏకు ఏజెంట్‌గా లేపాక్షి ఎంపీపీ ► ఆత్మీయ సమావేశంలో ‘తమ్ముళ్ల’ ఫైర్ ► అసమ్మతివాదులపై వేటుకు రంగం సిద్ధం! లేపాక్షి : ‘హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా ఉన్న చంద్రశేఖర్ (శేఖర్) నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సైతం లంచాలు తీసుకుని అవినీతిలో కూరుకుపోయాడు. ఇలాంటి లంచగొండి పీఏను ఐకమత్యంతో తరిమికొడదామ’ని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులు అన్నారు. మంగళవారం సాయంత్రం లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలోని ఓ తోటలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ( చదవండి : బాలయ్య ఇలాకాలో ముసలం ) ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లను విస్మరించి వారికి ఇష్టమొచ్చిన వారితో డబ్బు తీసుకుని పనులు చేస్తున్నారన్నారు. లేపాక్షి ఎంపీపీ హనోక్‌ను పీఏ శేఖర్ తన ఏజెంటుగా పెట్టుకుని ఇళ్ల మంజూరుకు రూ.25 వేలు, పింఛన్‌కు రూ.2 వేలు, సబ్సిడీ రుణాలు ఇవ్వాలంటే రూ.20 వేల చొప్పున ప్రజలతో వసూలు చేశారని విమర్శించారు. గ్రామాల్లోకి టీడీపీ నాయకులు వెళ్తే ప్రజలు ఉమ్మి వేస్తున్నారని, పార్టీ పరువును, నాయకుల ప్రతిష్టను దెబ్బతీశారని వారు అన్నారు. పార్టీ అధిష్టానం పీఏ శేఖర్‌ను అలాగే కొనసాగిస్తే 20 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి నిలదీస్తామని హెచ్చరించారు. సిద్ధు అనే కార్యకర్త మాట్లాడుతూ పీఏకు అనుకూలంగా లేని వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఓ మాజీ సర్పంచ్‌పై చేయి చేసుకున్నారని, ఓ మాజీ మండల అధ్యక్షుణ్ని ఏ కారణం లేకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. శేఖర్ ఓ లోఫర్ అని మండిపడ్డాడు. తనకు ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా పోలీస్ కాన్వాయ్ పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల సీట్లలో ఆశీనులు కావడం వంటివి చేస్తున్నాడని పలువురు ధ్వజమెత్తారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మండల కన్వీనర్ మారుతీప్రసాద్, మాజీ ఎంపీపీలు మల్లికార్జున, ఆనంద్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా తమపై లేనిపోని కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ నరసింహప్ప, పార్టీ నాయకులు పాపిరెడ్డి, తిమ్మిరెడ్డి, నారాయణప్ప, ఆవులరెడ్డి, నాగలింగారెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం! హిందూపురం అర్బన్ : అసమ్మతివాదులను పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇటీవల చిలమత్తూరులోని మాజీ సర్పంచ్ ఇంట్లో అసమ్మతివాదులు నిర్వహించిన రహస్య సమావేశం, అప్పలకుంటలో సమావేశంతో పాటు మంగళవారం లేపాక్షి మండలంలో జరిగిన సమావేశాల విషయాన్ని పీఏ శేఖర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆపరేషన్ పీఏ’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్నీ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తీవ్రంగా స్పందించి అసమ్మతివాదులను పార్టీ నుంచి బహిష్కరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ఫోన్లో కోరినట్టు విశ్వనీయ సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు కావడం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు స్వయాన మామ కావడంతో ఆయన ఆదేశాలను పాటించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అసమ్మతివాదులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే హిందూపురంలో టీడీపీ బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుంది.ఇదిలావుండగా, నియోజకవర్గంలోని పీఏ అనుకూలవర్గీయులు అసమ్మతివర్గంపై వేటు వేయాలని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపినట్లు సమాచారం. ఇందులో చిలమత్తూరు మండలంలోని వారిపేర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. -
బాలయ్య ఇలాకాలో ముసలం
► ఆపరేషన్ పీఏ ► వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యే పీఏ తీరు ► సొంత పార్టీలోనే అసంతృప్తి ► హిందూపురం నుంచి సాగనంపేందుకు సీసీ, అంబికా యత్నాలు ► మండలాల్లో రహస్య సమావేశాలు హిందూపురం అర్బన్ : సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ‘తమ్ముళ్ల’ మధ్య తగువులాట మొదలైంది. మరీముఖ్యంగా నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరిస్తున్న బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ తీరు వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చిపోతుండడంతో ఇక్కడ పీఏ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పనులు మొదలుకుని పార్టీ వ్యవహారాల దాకా అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఈయన మితిమీరిన జోక్యాన్ని సొంత పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. శేఖర్‌ను హిందూపురం నుంచి ఎలాగైనా సాగనంపాలన్న ఉద్దేశంతో నియోజకవర్గంలోని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల అసంతృప్తులందరూ ఏకమవుతున్నారు. ఈ నెల 25న చిలమత్తూరు మండలం కోడూరులో జరిగిన జాతర సందర్భంగా వీరంతా కలసి మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఇంట్లో సమావేశమై ‘ఆపరేషన్ పీఏ’ కార్యక్రమానికి బీజం వేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత పట్టణంలో కొందరు సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. అలాగే 29వ తేదీన రాత్రి హిందూపురం మండలం అప్పలకుంటలోని డీసీ ఆంజనేయులు తోటలో రెండో రహస్య సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి హిందూపురంలోని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు నివాసంలో నాయకులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.అలాగే సోమవారం లేపాక్షి మండల కేంద్రంలోని సత్తార్తోటలో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశాల్లో ప్రధానంగా పీఏ శేఖర్ వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కొక్కరు ఏకరువు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం పీఏ ముందు నిలబడాల్సి వస్తోందని, ఏపనికైనా పైకం ఇవ్వాల్సివస్తోందని వారు అంటున్నారు. ‘గంట’కట్టేదెవరు? పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపడం కోసం సీనియర్ నాయకులందరూ కంకణం కట్టుకున్నా.. ఆయనపై బాలకృష్ణకు ఫిర్యాదు చేసేదెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పీఏ ఏది చెబితే అది చేయడం బాలకృష్ణకు అలవాటు. ఇలాంటి పరిస్థితుల్లో పీఏపై ఫిర్యాదు చేయడమంటే సులవైన పనికాదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే.. ఈ బాధ్యతను ఓ సీనియర్ నాయకుడిపై పెడుతున్నట్లు తెలుస్తోంది. వారు అనుకున్నట్లు ‘ఆపరేషన్ పీఏ’ కార్యక్రమం విఫలమైతే మరో రాజకీయ ఎత్తుగడకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.