
పంచాయితీ నేడే!
– హిందూపురం విభేదాల నేపథ్యంలో నేడు బాలయ్య రాక!
– పీఏ శేఖర్‌తో పాటు అసమ్మతి వర్గంతో చర్చలు..ఏకతాటిపైకి తెచ్చే యత్నం
– శేఖర్ తొలగింపు మినహా మరో చర్చకు ఒప్పుకోబోమంటున్న వ్యతిరేకవర్గం
– వ్యతిరేక వర్గం వెనుక ఎవరున్నారని జిల్లాపార్టీతో పాటు రాష్ట్ర పార్టీలోనూ తీవ్ర చర్చ
– నేను జోక్యం చేసుకోను.. బాలయ్యతోనే తేల్చుకోండన్న సీఎం
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను తొలగించాలని కొద్దిరోజులుగా నడుస్తోన్న పోరు ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై టీడీపీలో కూడా పలు రకాలుగా ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి ‘పవర్‌సెంటర్’ బాలయ్య. మరి ఆయన పీఏనే తొలగించాలని ఉద్యమిస్తున్నారంటే వీరి వెనుక అంతకంటే పెద్ద ‘పవర్’ ఉండి కథ నడిపిస్తోందా? వ్యతిరేకవర్గం టార్గెట్ పీఏనా? లేదంటే బాలయ్యపై అవినీతి మరక అంటించి నియోజకవర్గంలో బలహీనపరిచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
పురంపై బాలయ్య నిర్లక్ష్యమే ప్రధాన కారణం
బాలకృష్ణ పీఏ శేఖర్‌పై ఆదినుంచి ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జన్మభూమి ఇప్పటి వరకూ నాలుగు దఫాలు జరిగితే, ఒక్కరోజూ హాజరుకాని ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో బాలకృష్ణ ఒక్కరే! ఈ ఒక్క ఉదాహరణ చాలు నియోజకవర్గాన్ని బాలయ్య ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో! ప్రజా సమస్యలపైనా ఎంత చులకన భావం ఉందో ఇట్టే తెలుస్తోంది. పైగా జన్మభూమిలో ఆయన పీఏ శేఖర్ అధికారులతో ప్రభుత్వ వేదికను పంచుకున్నారు. అధికారులు కూడా శేఖర్‌ను ఎమ్మెల్యేలా భావించి కార్యక్రమాన్ని నడిపించారు. జన్మభూమితో పాటు చాలా అధికారిక కార్యక్రమాల్లో శేఖర్ పాల్గొన్నారు.
దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. బాలకృష్ణ కూడా శేఖర్‌ను మందలించకుండా మద్దతుగా నిలుస్తూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరించారని పార్టీనేతలు చెబుతున్నారు. అధికారుల బదిలీలు, ఇతరత్రా వ్యవహారాలను కూడా శేఖరే చూస్తున్నారనేది బహిరంగ సత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూపురానికి అనధికారిక ఎమ్మెల్యేగా శేఖర్ ఇన్నిరోజులూ వ్యవహరించారు. ఇది బాలకృష్ణకూ తెలుసు. హిందూపురం నియోజకవర్గంలో ప్రధాన ఆదాయవనరులైన కొడికొండ చెక్‌పోస్టు, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ఆర్టీఏతో పాటు పలు కీలకశాఖల నుంచి ప్రతినెలా రూ.70 లక్షలు వసూలు చేసి బాలకృష్ణకు పంపుతారనే భావన హిందూపురం అధికారులతో పాటు ప్రజల్లోనూ ఉంది.
నెలవారీ మామూళ్లు తక్కువగా ఇచ్చిన వారితో ‘నేనేం ఇంటికి తీసుకెళుతున్నానా? తక్కువైతే వసుంధర మేడం వాయించేస్తుంది’ అని బాలయ్య సతీమణి పేరు చెప్పేవాడని కొందరు అధికారులు అంటున్నారు. రీచ్‌లు ఉన్నప్పుడు ఇసుక మాఫియానే ప్రతినెలా రూ.50 లక్షలు ఇచ్చేదని తెలుస్తోంది. ఈ లెక్కన 32 నెలల్లో ఎంత వసూలైంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ డబ్బు బాలకృష్ణ భార్యకు ఇచ్చారా? లేదంటే వారి పేరుతో శేఖర్ స్వాహా చేశాడా? అనే అనుమానాలు ‘పురం’ టీడీపీ నేతలతో పాటు అందరిలోనూ ఉన్నాయి. ఇకపోతే ఇన్నిరోజులై మౌనంగా ఉండి, ఇప్పుడు శేఖర్ అవినీతికి పాల్పడుతున్నారు, తొలగించాల్సిందేనంటూ పార్టీనేతలు సీసీ వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ ఉద్యమించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
వ్యతిరేక వర్గం వెనుక ఎవరున్నట్లు!
బాలకృష్ణ పీఏపై ఉద్యమించడమంటే ఒకరకంగా బాలయ్యపై ఉద్యమించడమే! ఎప్పుడు, ఎలా ఉంటారో తెలీని బాలయ్య ‘నా పీఏను తొలగించాలని ఉద్యమిస్తారా?’అని వ్యతిరేకవర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించేందుకూ వెనుకాడరు. ఇవన్నీ తెలిసి, వీటికి తెగించి శేఖర్‌పై పోరాటం చేస్తున్నారంటే వీరి వెనుక ఎవరున్నారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. చంద్రబాబుకు తెలిసే ఈ తంతు నడుస్తోందనే అనుమానాలు ఉన్నాయని, ఇది ఎందుకు చేస్తున్నారనే దానిపై పూర్తి స్పష్టత రాలేదని టీడీపీ నేత ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ఇదిలావుండగా, శేఖర్ కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది.
ఇతన్ని తప్పనిసరిగా తొలగించే పరిస్థితిని కల్పించింది. ఆడియో విషయాన్ని వ్యతిరేకవర్గం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలయ్యకు సంబంధించిన అంశం కావడంతో ఆయనతోనే తేల్చుకోవాలంటూ సీఎం బంతిని బాలయ్య కోర్టులోనే వేసినట్లు తెలిసింది. బాలయ్య మంగళవారం ఉదయం సీఎంను కలిసిన సందర్భంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. విభేదాలు లేకుండా చూడాలని బాలయ్యకు సీఎం సూచించారు. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా మీడియాతో చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా నేడు హిందుపురానికి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పీఏను తొలగిస్తే ఇన్నిరోజులూ చేసిన వసూళ్లకు బాలయ్యే కారణమని శేఖర్ కుండబద్దలు కొట్టే అవకాశముంది. తొలగించకపోతే అవినీతిని, అరాచకాన్ని బాలయ్య వెనుకేసుకొచ్చినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇరువర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలని బాలయ్య ఉన్నారు. అయితే అతన్ని తొలగింపు మినహా మరే సర్దుబాటుకూ ఒప్పుకునేది లేదని అసమ్మతి నేత అంబికా లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో స్పష్టం చేశారు. అన్నింటికీ తెగించే ఉద్యమిస్తున్నామని, పార్టీ పరువు నిలవాలంటే శేఖర్‌ను తప్పించాలని, ఈ విషయంలో ఎంత వరకైనా ముందడుగు వేస్తామని అన్నారు. ఈక్రమంలో నేటి పంచాయితీలో బాలయ్య తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!