
బాలకృష్ణకు టీడీపీ నేతల అల్టిమేటం
అనంతపురం: సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తీవ్రమైంది. వారం రోజుల్లోగా ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగించాలని అసంతృప్త టీడీపీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శేఖర్‌ను తొలగించకపోతే హిందూపురంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహారదీక్షలు చేస్తామని చెప్పారు.
ఆదివారం హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరులో టీడీపీ అసంతృప్త నాయకులు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు చిలమత్తూరులో 144 సెక్షన్ విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పొరుగునే ఉన్న కర్ణాటకలోని బాగేపల్లిలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. శేఖర్ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ రాజీనామా చేశారు. అసంతృప్త నేతలు, శేఖర్ వర్గీయులు నియోజకవర్గంలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.