
బాలకృష్ణ పీఏ తిట్లపురాణం
♦ హిందూపురం నియోజకవర్గంలో శేఖర్ ఇష్టారాజ్యం
♦ సభ్యసమాజం తలదించుకునే రీతిలో కాంట్రాక్టర్‌కు తిట్లు
♦ వాట్సప్‌లో హల్‌చల్ చేస్తుతున్న ఆడియో సంభాషణలు
♦ బాలకృష్ణ దన్నుతోనే శేఖర్ అరాచకాలంటున్న టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి/ సాక్షిప్రతినిధి, అనంతపురం/ హిందూపురం అర్బన్: సినీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు శేఖర్ హల్‌చల్ చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో టెండర్లలో షెడ్యూలు దాఖలు చేసిన అనంతపురం నగరానికి ఓ కాంట్రాక్టర్‌ను ‘ఫోన్’లో తీవ్ర స్థాయిలో బెదిరించారు. పత్రికలో రాయడానికి వీలులేని భాషలో.. సభ్య సమాజం తలదించుకునే రీతిలో బూతు పురాణం అందుకున్నారు. పీఏ శేఖర్ ఫోన్ బెదిరింపుల వ్యవహారం వాట్సప్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
రెండున్నరేళ్ల నుంచి పీఏ శేఖర్ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని.. బాలకృష్ణ దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. శేఖర్ దోపిడీ, అరాచకాలకు బాలకృష్ణ అండదండలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఏ పనులకు టెండర్లు నిర్వహించినా.. పీఏ శేఖర్ అక్కడికి వాలిపోయి తనకు కమీషన్లు ఇచ్చేవారికే పనులు అప్పగించేలా అధికారులపై ఒత్తిడి తెస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనను కాదని టెండర్లలో ఎవరైనా పాల్గొంటే.. తీవ్ర స్థాయిలో బెదిరించి, పోలీసులను ఉసిగొలిపి పారిపోయేలా చేస్తారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ హిందూపురం మున్సిపాల్టీ పరిధిలో ఒక టెండర్‌లో షెడ్యూలు దాఖలు చేశారు. తనను కాదని షెడ్యూలు దాఖలు చేసిన వ్యక్తిని ఆదిలోనే బెదిరించిన పీఏ శేఖర్.. తన కార్యాలయానికి వచ్చి కలవాలని హుకుం జారీ చేశారు. దాంతో కాంట్రాక్టర్ పీఏ శేఖర్ కార్యాలయానికి వెళ్లారు. కానీ.. కార్యాలయంలో అప్పటికే చాలామంది ఉండటంతో ఏమీ మాట్లాడకుండానే కాంట్రాక్టర్‌ను పంపేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు పీఏ శేఖర్ ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో బెదిరించిన ఆడియో వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ బెదిరింపు ఘటన తర్వాత కాంట్రాక్టర్.. శేఖర్‌ను కలిసి చర్చించి గుడ్‌విల్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
విభేదాలతో వెలుగులోకి ఆడియో
హిందూపురం నియోజకవర్గ నాయకుల్లో నెలకొన్న ముసలంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శేఖర్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ బాహాటంగానే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ.. శేఖర్ తీరుకు నిరసనగా రాజీనామా కూడా చేశారు. ఇదే క్రమంలో శేఖర్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు కాంట్రాక్టర్ బెదిరింపు ఆడియోను వాట్సాప్‌లో పోస్టు చేశారు. మరోవైపు బల ప్రదర్శన కోసం శేఖర్ శనివారం లేపాక్షి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీకి అనుకున్నస్థాయిలో కార్యకర్తలు హాజరు కాలేదు. మొత్తం 10 వేల మందితో చేయాలని నిర్ణయించినా.. కేవలం 100 మంది మాత్రమే హాజరయ్యారు.
బాలకృష్ణ పీఏ శేఖర్ ఆడియో సారాంశం..
పీఏ శేఖర్: ఏమిటి విశేషాలు?
కాంట్రాక్టర్: ఏమీ లేవన్నా. మీరే చెప్పాలన్నా.
పీఏ శేఖర్: ఏమీ..?
కాంట్రాక్టర్: విశేషాలు ఏమీ లేవన్నా.. మీరే చెప్పాలన్నా.
పీఏ శేఖర్: ఏమేమీ..?
కాంట్రాక్టర్: పొద్దున మీ దగ్గరికి వచ్చాను. చాలామంది ఉంటే మాట్లాడలేదు. మున్సిపాల్టీలో లెస్(తక్కువ ధర)కు టెండర్లు వేశాను.
పీఏ శేఖర్: (రాయడానికి వీలు లేని భాషలో బూతుపురాణం.. ఆ తర్వాత మాట్లాడుతూ) నిన్నెవడ్రా నా కొడకా హిందూపురంలో టెండర్ వేయమన్నది? చెప్పుతో కొడతా నాకొడకా.. హిందూపురంలో కన్పిస్తే తాట తీస్తా నా కొడకా.
కాంట్రాక్టర్: అన్నా.. మీతో ఇప్పటికే మాట్లాడాను. బాలాజీ కూడా ఉన్నారు. మీతో మాట్లాడే టెండర్లు వేశా.
పీఏ శేఖర్: బాలాజీ ఎవడ్రా నాకొడకా.. వాణ్నీ నిన్నూ ఇద్దర్నీ చెప్పుతో కొడతా. వానితో ఏమాట్లాడినావ్ రా నాకొడకా.
కాంట్రాక్టర్:అన్నా.. నేను ఏమీ దొంగను కాదు. మేం పనులు చేసుకుంటేనే బతికేది. పూలకుంటలో ఇప్పటికే పనులు చేస్తున్నా. అందుకే టెండర్లు వేశా. తప్పు ఏమీ చేయలేదు.
పీఏ శేఖర్: చెప్పుతో కొడతా నాకొడకా.. అనంతపురానికి నా మనుషులను పంపి స్తా. పనులు ఇప్పించరా నాకొడకా.
కాంట్రాక్టర్: అన్నా.. నేను కాంట్రాక్టర్‌ను.. ఎక్కడైనా టెండర్లు వేసుకుంటా.. పనులు చేసుకుంటా.
పీఏ శేఖర్: చెప్పుతో కొడతా నాకొడకా.. ధైర్యం ఉంటే హిందూపురం రారా నా కొడకా.. నువ్ రారా హిందూపురం. (బూతుపురాణం)
కాంట్రాక్టర్: అన్నా.. పనులు చేసుకుంటేనే కదా మేం బతికేది.
పీఏ శేఖర్: నీకొకడికేనేమిరా తెలివి నా కొడకా.. హిందూపురం రారా నాకొడకా నీ తాట తీస్తా.